🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. విశ్వామిత్రమహర్షి - 4 🌻
22. హరిశ్చంద్రుడు రాజ్యంపోయినా, కొడుకుపోయినా సత్యవ్రతమే గొప్పదని, ఇవన్నీ ఎప్పుడయినా నశించేవేనని, కాని సత్యవ్రతం శాశ్వతమైనటువంటి ఐశ్వర్యమనీ వివేకంతో గ్రహించాడు. అందుకే దారిద్య్రాన్నికూడా దుఃఖంలేకుండా అనుభవించాడు. “అయ్యో! భార్యను పోగొట్టుకుంటున్నాను. అయ్యో! రాజ్యం పోగొట్టుకున్నాను” అని ఏడవలేదు. చూచిన వాళ్ళు దుఃఖం పొందారు.
22. కాబట్టి మహాత్ములెవరయినా సరే, కష్టం వచ్చినప్పుడు దుఃఖించలేదు. వాళ్ళకు వచ్చిన కష్టాన్ని చూచినవాళ్ళుమాత్రం దుఃఖించారు. విశ్వామిత్రుడు లేకపోతే హరిశ్చంద్రుడు లేడు, అతడి చరిత్ర లేదు. అతడిని అసత్యమాడించగలనని విశ్వామిత్రుడు ప్రతిజ్ఞచేసాడని మామూలుగా పురాణంలో వ్రాయబడింది.
23. అలా వ్రాయబడిఉందికాని, వాస్తవంగా విశ్వామిత్రుడు అన్నది, “హరిశ్చంద్రుడి సత్యవ్రతదీక్షను నేను పరీక్షిస్తాను. మీరెవ్వరూ పరీక్షచేయలేరు!” అని. ఆ విధంగా ఆయనను పరీక్షించి నిలబెట్టి, “నా పరీక్షకు నీవు నిలబడ్డవు! నువ్వు ఏది అడిగినా నీకిస్తాను” అని హరిశ్చంద్రుడికి అన్ని కోరికలనూ తీర్చాడు.
24. విశ్వామిత్ర వాక్యాలలో మహాపాతకాలంటే ఏమిటో నిర్ణయించబడి ఉన్నది. ప్రాయశ్చిత్తం అనేది లేదు. అనుభవించి తీరవలసిందే! ఇహపరములూ రెండూ తెలిసిన ఋషులు వ్రాసారివన్నీ. ఇహంలో ఏధర్మాన్ని ఆచరిస్తే ఏ లోకం కలుగుతుందో తెలిసి, పరలోకస్వభావంకూడా తెలిసినవాళ్ళే ఇహలోక ధర్మం చెప్పలి. ఇక్కడి న్యాయం చూచినవాళ్ళు; అంతేగాక, పారలౌకికమైన ప్రవృత్తి ఏమిటి? స్వర్గం అంటే ఏమిటి? పాశబంధనాన్నించి విముక్తి అంటే ఏమిటి? అది దేనివల్ల కలుగుతుంది-అవన్నీకూడా తెలిసిన మహర్షులే ఇక్కడ ఆచరించవలసిన ధర్మాన్ని కూడా చెప్పారు. కాబట్టి వాళ్ళ మాటలు మనకు శిరోధార్యములు.
25. విశ్వామిత్రుడు సప్తర్షిమండలంలోకి వెళ్ళి సప్తర్షులలో ఒకరుగా ఉండి, నిత్యుడు – శాశ్వతుడుగా వెలుగొందుతున్నారు. ఆయనకొక లోకం, పదవి ఉన్నది. ఆయనను స్మరణచేయటంతోటే దర్శనమిచ్చేటటువంటీ మహాత్ముడు, శక్తిసంపన్నుడు. ఆయనను స్మరించి స్తోత్రంచేస్తే ఉపాసిస్తే అనేక విశేషములయిన జ్ఞానములు కలుగుతాయి.
26. ఆయన శక్తి ఎంతటిదో, ఆయన ఔదార్యముకూడా అంత గొప్పదే. ఆయనను అడిగితే ఏదయినా ఇస్తారు, ఇవ్వడంలో ముదువెనకలు లేవుమరి. ఆయన గొప్పదాత, క్షాత్ర లక్షణం కలిగినదాత. అందుకనే లోకలో-బ్రాహ్మణుడేం దానంచేస్తాడు, చేస్తే క్షత్రియుడే చెయ్యాలి, లేకపోతే వైశ్యుడివ్వాలి అని ఒక వాడుక ఉంది. వాళ్ళే దాతలు కాని, బ్రాహ్మణులెలా అవుతారు? బ్రాహ్మణులు ఇవ్వరు, తీసుకుంటారు.
27. అంటే, దాత అనేవాడికి క్షాత్రగుణం ఉండాలి, రజోగుణం ఉండాలి. రజోగుణం లేకపోతే ఇవ్వలేడు. “వాడడిగింది నాకు లేఖ్ఖా! అడిగింది ఇచ్చేస్తాను. నా దగ్గిన ఉన్నది ఇచ్చేస్తాను” అనుకుంటాడు దాత. దెండో ఆలోచన ఉండదు. ఖర్చుపెట్టేటప్పుడు దాతృత్వగుణానికి వెనకాల రజోగుణం ఉంటుంది. తీక్షణమైన స్వభావం ఉంటుంది. ఆ స్వభావానికి – దాత ఒక వీరుడు, ధీరుడు అయి ఉండాలి. ‘దానవీరుడు’ అంటారందుకే. కర్ణాదులు అందరూ అలాంటివాళ్ళే, దానవీరులు వాళ్ళు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
16 Dec 2020
No comments:
Post a Comment