గీతోపనిషత్తు - 88
🌹. గీతోపనిషత్తు - 88 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍀 26. ప్రాణాయామ యజ్ఞము - ప్రాణాయామ మనగా ప్రాణము యమింపబడుట. ప్రాణము యమింపబడుటకు శ్వాస నిబద్ధము కావలెను. శ్వాసను క్రమబద్ధముగ నిర్వర్తించుటకు మనసును శ్వాసపై లగ్నము చేయవలెను. ఉచ్ఛ్వాసతో అంతర్ముఖ మగుట, నిశ్వాసతో బహిర్ముఖమగుట జరుగుచున్న సందర్భములో తన ప్రజ్ఞను మించిన ప్రజ్ఞ యేదియో తనయందీ శ్వాస యజ్ఞమును నిర్వర్తించుచున్నట్లు తెలియును. 🍀
📚. 4. జ్ఞానయోగము - 29, 30 📚
Part 1
అపానే జుహ్వతి ప్రాణం ప్రాణేం పానం తథాల పరే|
ప్రాణాపానగతీ రుద్దా ప్రాణాయామ పరాయణాః || 29
అపరే నియతాహారాః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి |
సర్వే ప్యేతే యజ్ఞవిదో యజ్ఞక్షపిత కల్మషాః || 30
ప్రాణాయామ యజ్ఞమును దైవమిచ్చట బోధించు చున్నాడు. అర్హతలేని ప్రాణాయామ యజ్ఞము అనర్థములకు దారితీయును. అష్టాంగ యోగమున ప్రాణాయామము నాలుగవ అంగము. అహింస, సత్యము, బ్రహ్మచర్యము, ఇతరుల సంపదను తెలివితో దొంగిలించకుండుట, ఉచితముగ ఇతరుల వద్ద బహుమానములను, ఉపకారములను పొందకుండుట అనునవి ఐదు నియమములు.
బాహ్యమునను, అంతరమునను శుచిగా నుండుట అనునవి మరి రెండు నియమములు. ఈ ఏడు నియమములను శ్రద్ధతో దీర్ఘకాలము ఆచరించినవారే సహజమగు సంతోషము గలవారై యుందురు. ఇట్టివారికి సంతోషముగ నుండుటకు కారణ మక్కరలేదు. ఇట్టి మనస్సు కలవారు పై తెలిపిన ఏడు నియమములను పాటించి, సంతోషమును చేరుట ఎనిమిదవ మెట్టు. అట్టి వారు చేయవలసి నది శాస్త్రాధ్యయనము.
పై నియమములను పాటింపని వారు శాస్త్రములను అధ్యయనము చేసినచో మిడిమిడి జ్ఞాను లగుదురు. తెలిసీ తెలియని మూర్ఖులగుదురు. వీరికి అభివృద్ధి కుంటుపడును. వీరిననుసరించిన వారి అభివృద్ధి కూడ కుంటుపడును. భారతీయ సంప్రదాయమున అధ్యయనమునకు పై అర్హతలు తప్పనిసరి.
పై నియమములను పాటించినవారి మేథస్సు, శాస్త్రములను సరిగ నవగాహన చేసుకొనగలదు. అందులకే చదివిన వారందరు పండితులు కారు. చదువులు వేరు, విద్యలు వేరు. పై నియమములను పాటించు వారికి శా శాస్త్రాధ్యయనము, సమస్తము నందును ఈశ్వరుని దర్శనము చేయు ప్రయత్నమును రెండు నియమములుగ అష్టాంగ యోగము తెలుపుచున్నది. ఇట్టి వారికే స్థిరము, సుఖము అగు మనస్సు ఏర్పడునని పతంజలి మహర్షి పేర్కొనినాడు.
అదే విషయమును దైవము భగవద్గీత యందు ప్రాణాయామమునకు ముందు తెలిపిన యజ్ఞములలో పేర్కొనినాడు. ద్రవ్య యజ్ఞము, ఇంద్రియ యజ్ఞము, మనో యజ్ఞము, బ్రహ్మ యజ్ఞము- పై తెలిపిన నియమములకు సంబంధించిన యజ్ఞములే. ఎనిమిది యజ్ఞములు తెలిపిన భగవానుడు, తొమ్మిదవ యజ్ఞముగ ప్రాణాయామము తెలుపుచున్నాడు. అట్లే పతంజలి మహర్షి కూడ మూడు అంగములలో పదకొండు నియమములను అందించెను. వానిని పాటించిన వారికే ప్రాణాయామము అని తెలిపెను.
ప్రాణాయామము రాజయోగ మార్గమున జరుగునదే కాని చేయునది కాదు. ఈ హెచ్చరికను పాఠకులు గుర్తించి తరువాత అంశమును పఠించవలెను. ప్రాణాయామ మనగా ప్రాణము యమింపబడుట.
ప్రాణము యమింపబడుటకు శ్వాస నిబద్ధము కావలెను. శ్వాస నిబద్ధమగుటకు క్రమబద్ధముగ శ్వాసను పీల్చుట, వదలుట చేయ వలెను. శ్వాసను క్రమబద్ధముగ నిర్వర్తించుటకు మనసును శ్వాసపై లగ్నము చేయవలెను. ఉచ్ఛ్వాసతో పాటు మనసు అంతర్ముఖముగ పయనించి ఉచ్ఛ్వాస కొసకు చేరవలెను.
ఉచ్ఛ్వాసకొసన నిశ్వాస ప్రారంభమగును. నిశ్వాసను మరల అనుసరించుచు మనసు నిశ్వాస కొసను చేరవలెను. మనసు శ్వాసతో లగ్నమై యుండునట్లు పై విధముగ నభ్యాసము చేయవలెను. ఈ అభ్యాసము సిద్ధించినచో మనసు పరిపరి విధముల పోక శ్వాసకు కట్టుబడి యుండును. ఇట్లు అనేకానేక భావముల నుండి మనసు ఏక భావమునకు చేరును. అపుడు మనసు భావముకూడ శ్వాసను గూర్చియే యుండును.
ఉచ్ఛ్వాసతో అంతర్ముఖ మగుట, నిశ్వాసతో బహిర్ముఖమగుట జరుగుచున్న సందర్భములో మనసు యొక్క సహజ లక్షణమైన కుతూహలము ఉచ్ఛ్వాస, నిశ్వాసలు ఎట్లు జరుగుచున్నవో గమనించును. తాను చేయక తనయందు అవి జరుగుచున్నట్లుగ గుర్తించును. అనగా తన ప్రజ్ఞను మించిన ప్రజ్ఞ యేదియో తనయందీ శ్వాస యజ్ఞమును నిర్వర్తించుచున్నట్లు తెలియును.
తనయందు తనకు తెలియని ప్రజ్ఞ యొకటి యున్నదని తెలియును. అది తనకు మించిన ప్రజ్ఞయని తెలియును. తానుగ చేయకున్నను, తన యందు జరుగు శ్వాస, జరుగుట అను మరియొక స్థితిని తెలియచేయును.
తాను చేయువాడు, తనయందు జరుపువాడుగ మరియొక ప్రజ్ఞ తనయందు గోచరించును. ఈ చేయుటకు ఆ జరుగుట ఆధారమని కూడ తెలియును. జరుగుట, చేయుట యొక్క వ్యత్యాసములు తెలియును. పనులు జరుగునని తెలియును. చేయుట జరుగుటలో భాగమని తెలియును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
02 Dec 2020
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment