కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 119
🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 119 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. ఆత్మను తెలుసుకొను విధము - 49 🌻
తెలిసికొన వలసిన ఆత్మతత్వము అతి సూక్ష్మమగుట చేత సద్గురువుల నాశ్రయించి, వారి బోధల చేత అజ్ఞానమును పోగొట్టుకొని, నిరంతర ప్రయత్నము చేత, మనస్సును బాహ్యవిషయముల నుండి మరల్చి, పరిశుద్ధమైన సూక్ష్మబుద్ధితో, ఆత్మ సందర్శనమునకు ప్రయత్నించవలెను.
బాహ్య విషయము లందు ప్రవర్తించు మనస్సును, ఆత్మాభిముఖము చేయుట ఎంత కష్టమో, అసిధారా వ్రతముతో పోల్చి చెప్పబడినది.
ఇప్పటి వరకూ మనం మాట్లాడుకున్న ఆశాలనే మళ్ళా ఇక్కడ బోధిస్తూఉన్నారు. ఏది ఏమైనప్పటికీ తప్పక బాహ్య విషయముల నుండి మనస్సును మరల్చాలి. అంతర్ముఖత్వము వైపు నడపాలి.
అయితే ఆశ్రయించినటువంటి మహనీయులు ఆత్మజ్ఞానములో మునిగి ఉన్నారా? లేదా? ఆత్మనిష్ఠులై ఉన్నారా? లేదా? అనేటటువంటి పరిస్థితిని గమనించుకోవలసినటువంటి అవసరం ఉంది. తనకే స్వానుభవం అయినటువంటి, స్వానుభవ ప్రమాణ నిర్ణయమైనటువంటి ఆత్మానుభూతి కనుక లేకపోయినట్లయితే, కేవల శాస్త్రజ్ఞాన పరిధిలోనే నీకు బోధించ ప్రయత్నిస్తున్నట్లయితే, ఎవరూ కూడా దానిని అందుకోజాలరు.
కాబట్టి, మహానుభావులను, సద్గురువులను ఆశ్రయించి, వారి బోధలచేత అజ్ఞానమును పోగొట్టుకోవాలి. నిరంతరాయముగా నువ్వు సద్గురు ఆశ్రయంలో ఉన్నంత సేపూ కూడా నీలోపల గల సందేహాలని పోగొట్టుకోవడం, నీ లోపల అజ్ఞానయుతమైన భావనల నుండీ విముక్తమవ్వడం, నిర్ణయం తీసుకోలేకుండా మిగిలిపోయినటువంటి, అంతర్ముఖ ప్రయాణానికి సంబంధించినటువంటి అంశాలను కూలంకషంగా తెలుసుకోవడం ఇలాంటి ప్రయత్నాన్ని చేయాలి.
అంతేగాని, సద్గురుని వ్యావహారిక జీవితాన్ని కనుక మనము ఉపయోగించు కున్నట్లయితే, ఈ అంతర్ముఖ ప్రయాణము కుంటుపడుతూ ఉంటుంది.
ఏవండీ! మా అబ్బాయిని విదేశాలకు పంపమంటారా? వద్దంటారా? నన్ను ఇల్లు కట్టమంటారా? కట్ట వద్దంటారా? ఏమండీ! నన్ను బండి కొనమంటారా? కొనొద్దంటారా? ఏమండీ! నన్ను భోజనం చేయమంటారా? చేయవద్దంటారా? ఇలాంటి విషయాలు అడిగారనుకోండి, ఏం చెబుతారు? కాబట్టి, ఈ బాహ్య విషయ పరిజ్ఞానానికి ఆత్మనిష్ఠులు అయినటువంటి వారు ఉపయోగపడరు.
కానీ, వాళ్ళు అంతర్ముఖ ప్రయాణానికి, సాధన విశేషానికి సంబంధించి, మనస్సుని సంయమించేటటువంటి స్థితి గురించి, స్వభావాన్ని గెలిచేటటువంటి స్థితి గురించి, స్వాత్మనిష్ఠను పొందేటటువంటి స్థితిని గురించి, ప్రశ్నించినప్పడు వాళ్ళు మహదానంద పడిపోయి, ఆ రకమైన సాధనా మార్గములో పురోగతిలో ఉన్నటువంటి విషయాలను గురించి, పురోగతిలో ఉన్నటువంటి అంశాల గురించి నీకు చక్కగా వివరిస్తారు.
అంతేగాక, స్వానుభవ ప్రమాణం ఉన్నటు వంటి ఆత్మనిష్ఠులైతే, ఆ స్థితి నుంచీ నీకు ఉద్ధరణకు సహాయం కూడా చేస్తారు.
కాబట్టి, సహాయం ఎవరికి చేస్తారు? అనేది చాలా ముఖ్యం. అందరికి సహాయం చేస్తారనుకోవడం భ్రాంతి. అందరికీ సహాయం చేయరు. ఎవరికి చేస్తారు?
ప్రధానంగా ఎవరైతే మనః సంయమనం చేయడానికి సిద్ధపడ్డారో, ఈ జన్మలోనే సాధకులుగా వారు పురోగమనం చెంది, సచ్ఛిష్యులుగా మారి, అధికారులుగా మారి, జ్ఞానబలాన్ని పొందగలిగేటటువంటి అవకాశం ఉన్నదో, వాళ్ళకి మాత్రమే సహాయం చేస్తారు. జ్ఞానపూర్వక సహాయం వాళ్ళకు మాత్రమే చేస్తారు.
మిగిలిన వాళ్ళతో కూడా వ్యవహరిస్తూ ఉంటారు కానీ, అది విషయ పూర్వకమైనటువంటి వ్యవహారం. ఎక్కడికక్కడ ఉత్తమమైనమార్గంలో నిన్ను ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. నిన్ను ఆ రకమైనటువంటి జ్ఞానమార్గంవైపు తిప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు.
కానీ సరియైనటువంటి సహాయం, సరియైనటువంటి నిర్ణయం, సరియైనటువంటి సమర్థత పొందగలిగేటటువంటి అధికారికి మాత్రం, సద్గురువు సాక్షాత్తు ఈశ్వరుడే! ఈశ్వరానుగ్రహమన్నా సద్గురుని కృపన్నా రెండింటికి అభేదం.
అలాంటి ఆశ్రయాన్ని సాధిస్తే నీవు సుఖంగా జీవించవచ్చు. ఇక నిశ్చింతగా జీవించవచ్చు. ఎందుకని? ‘నీ భారమతడే మోశాడు రా ఓ మానవుడా హరి నామము మరువ వద్దురా’ - ఏ సాధన అయినా జీవితకాల సాధనలుగా స్వీకరించాలి.
ఏ సాధనల్ని అయినా, ఏ నియమాల్ని అయినా ఏ రకమైనటువంటి ప్రయత్నాలనైనా కూడా నిత్యం చేయాలి. నిరంతరాయంగా చేయాలి. 24 గంటలు చేయాలి. అదే జీవితంగా జీవించాలి.
తీవ్రమోక్షేచ్ఛ కలిగిన వాడవై ఉండాలి. తీవ్ర వైరాగ్యం కలిగిన వాడవై ఉండాలి. చతుర్విధ శుశ్రూషలను ఆంతరంగికంగా చేయగలగిన సమర్ధుడవై ఉండాలి. ఆ రకమైనటువంటి సచ్ఛిష్యుడు గురువుకి ప్రేమాస్పదుడైనటువంటి వాడు.
గురువు యొక్క చైతన్యాన్ని అందిపుచ్చుకోగలిగేటటువంటి సమర్థుడైనటువంటి వాడు. కాబట్టి, అటువంటి సచ్ఛిష్యపదవికి సాధకులు అందరూ కూడా తప్పక ప్రయత్నించాలి. - విద్యా సాగర్ స్వామి
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
02 Dec 2020
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment