రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
68. అధ్యాయము - 23
🌻. భక్తి మహిమ -3 🌻
ఓ దేవీ! వాటిని స్వీకరించువారు లేక పోవుటచే అవి శిథిలమైనవి. సర్వయుగములలో, మరియు విశేషించి కలియుగములో భక్తి ప్రత్యక్ష ఫలము నిచ్చును (39). భక్తియొక్క ప్రభావము చేనేను నిత్యము భక్తికి వశుడనై ఉందుననుటలో సందేహము లేదు. లోకములో భక్తి గల పురుషునకు నేను సర్వదా సహాయమును చేసెదను (40).
ఆతని విఘ్నములను నేను తొలగించి, ఆతని శత్రువును దండించెదను. సందేహము లేదు. ఓ దేవీ! భక్తుని కారణంగా నేను క్రోధముతో నిండినవాడనైనా కంటినుండి పుట్టిన అగ్నితో కాముని (41) దహించితిని. నేను నాభక్తులను రక్షించెదను. దేవీ! పూర్వము నేను భక్తుని కారణంగా సూర్యునిపై తీవ్రమగు కోపమును పొంది (42) శూలమును తీసుకొని ఆతనిని జయించితిని.
ఓ దేవీ! భక్తుని కారణంగా నేను పరివార సమేతుడగు సమేతుడగు రావణుని కోపము చేసి పరిత్యజించితిని (43).ఆతని విషయములో నేను పక్షపాతమును సహించలేదు. ఓ దేవీ!చెడు ఆలోచనను చేయ మొదలిడిన వ్యాసుని, నేను భక్తుని కారణంగా (44) నందిచే దండింప జేసి కాశీ నుండి బయటకు పంపించితిని. ఓ దేవదేవీ! ఇన్ని మాటలేల? నేను సర్వదా భక్తునకు అధీనుడనై ఉందును (45).భక్తిని చేయు పురుషునకు నేను మిక్కిలి వశుడనై ఉందు ననుటలో సందియము లేదు.
బ్రహ్మ ఇట్లు పలికెను -
దక్షుని కుమార్తెయగు సతీదేవి భక్తి మహాత్మ్యమును ఈ తీరున విని (46), మనస్సులో మిక్కిలి సంతసించి, శివుని ఆనందముతో నమస్కరించెను. ఓ మహర్షీ! ఆమె గొప్ప భక్తితో భక్తికాండకు సంబంధించిన విషయమునే మరల ప్రశ్నించెను (47).
లోకములో జీవులను ఉద్ధరించుటయే పరమ లక్ష్యముగా గల సుఖదాయకమగు శాస్త్రమును గురించి, యంత్ర మంత్ర విషయముల గురించి, విశేషించి వాటి మహిమను గురించి (48),
జీవులను ఉద్ధరించే ఇతర విషయముల గురించి ప్రశ్నించెను. శంకరుడు ఆ సతీ ప్రశ్నను విని మిక్కిలి సంతసంచిన వాడై (49),సర్వజీవులనుద్ధరించుట కొరకై ప్రీతితో సర్వమును వర్ణించెను.
మహేశ్వరుడు యంత్ర శాస్త్రమును, పంచాగమును (50), ఆయా శ్రేష్ఠ దేవతల మహిమను వర్ణించెను. ఓ మహర్షీ! ఇతిహాస గాథలను, భక్తుల మహాత్మ్యమును (51)
వర్ణాశ్రమ ధర్మములను, రాజ ధర్మములను, పుత్ర ధర్మములను, స్త్రీ ధర్మములను, వాటి మహాత్మ్యమును, వినాశములేని తత్త్వమును (52), జీవులకు సుఖమును కలిగించే వైద్య శాస్త్ర, జ్యోతిశ్శాస్త్ర, సాముద్రిక శాస్త్రములను, ఇతరములైన అనేక శాస్త్రములను (53) మహేశ్వరుడు దయతో వాటి స్వరూపము స్పష్టమగునట్లు వర్ణించెను.
ఈ విధముగా సర్వజ్ఞలగు సతీశివులు ముల్లోకములకు సుఖములనొసంగిరి (54). వారు లోకములకు ఉపకారము చేయుట కొరకై సద్గుణములకు నిలయమగు మూర్తులను ధరించి, హిమ వత్పర్వతమునందు, కైలాసము నందు బహు విధములుగా క్రిడించిరి (55). పరబ్రహ్మ స్వరూపులగు వారిద్దరు అపుడు ఇతర స్థలముల యందు కూడ విహరించిరి (56).
శ్రీ శివ మహాపురాణములోని రెండవదియగు రుద్రసంహితయందు రెండవదియగు సతీ ఖండమునందు భక్తి ప్రభావవర్ణమనే ఇరువది మూడవ అధ్యాయము ముగిసినది (23).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
02 Dec 2020
No comments:
Post a Comment