✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚
శ్లోకము 27
🍀 27. ప్రశాంత స్థితి - కల్మషరహితుడై ఆత్మతో యోగము చెందిన యోగి ప్రశాం తుడై, బ్రహ్మమును పొందిన వాడై ఉత్తమ సుఖమును పొందు చున్నాడు. అట్టి వానిని రజస్తమో గుణముల వికారములు అంటవు. ప్రశాంత చిత్తమును దాని మూలమగు బుద్ధిపై నిలపి, బుద్ధి యను వెలుగునందు ప్రవేశించి, అటుపైన బుద్ధి మూలమైన ఆత్మ యందు ధారణ చేసి, ధ్యానించి, ఆత్మతో యోగము చెందుట వలన రజస్తమస్సులు తాకని స్థిరచిత్త మేర్పడును. అదియే ఉత్తమ సుఖము. 🍀
ప్రశాంత మనసం హ్యేనం యోగినం సుఖ ముత్తమమ్ |
ఉపైతి శాంత రజసం బ్రహ్మభూత మకల్మషమ్ || 27
కల్మషరహితుడై ఆత్మతో యోగము చెందిన యోగి ప్రశాం తుడై, బ్రహ్మమును పొందిన వాడై ఉత్తమ సుఖమును పొందు చున్నాడు. అట్టి వానిని రజస్తమో గుణముల వికారములు అంటవు. రజస్తమస్సులు జీవితమున కుడి ఎడమలకు లాగు చుండును. జీవితము ఊయల కెక్కిన వానివలె తలత్రిప్పటగ సాగును. హెచ్చు తగ్గులతో కూడిన రహదారియందు ప్రయాణము చేయుట వలె అలసటగ జీవితముండును.
వరద ప్రవాహము నందు ఈత కొట్టుట వలె నుండును. విశ్రాంతి ఎండమావులవలె గోచరించును. ప్రశాంతి అను పదమున కర్థమే లేదు. సుఖము కొరకు యత్నించుటే గాని సుఖముండదు. ఇంతలో అనారోగ్యము, ముసలితనము ఆవరించి మరణము ద్వారా మాత్రమే విశ్రాంతి లభించును. ఇట్టి జీవితము లన్నియు రజస్తమస్సులుగ, ఆటు పోట్లలో వృథా అయిన జీవితములుగ తెలియవలెను.
గాలికి రెప రెపలాడుచు వెలుగుచున్న ద్వీపజ్వాలవంటి జీవితములు ఎప్పుడైనను ఆరిపోవచ్చును. రజస్తమస్సుల ఆటు పోట్ల నుండి రక్షింపబడుటకు దీపమున కేర్పరచు చిమ్నీ ఎట్టిదో, అంతరంగ ప్రవేశమట్టిది. చిమ్నీ లోపలి దీపము ఎట్లు స్థిరముగ నుండునో అంతరంగమునకు మరల్చబడిన మనస్సను దీపము స్థిరముగ నుండుట కవకాశ మేర్పడును.
గుహలో నున్నవానిపై వాతావరణ ప్రభావము ఎట్లుండదో, అట్లే అంతరంగమున చేరు అభ్యాసమున బహిరంగపు ఆటుపోట్లు ఉండవు. అంతరంగము గుహ వంటిది. గాలి వాన ఎండ చలి ఇట్టివాని ప్రభావము బహి రంగమందే యుండుట వలన గుహలోని వానికి ప్రశాంతత సహజముగ నుండును.
ప్రశాంత చిత్తమును దాని మూలమగు బుద్ధిపై నిలపి, బుద్ధి యను వెలుగునందు ప్రవేశించి, అటుపైన బుద్ధి మూలమైన ఆత్మ యందు ధారణ చేసి, ధ్యానించి, ఆత్మతో యోగము చెందుట వలన రజస్తమస్సులు తాకని స్థిరచిత్త మేర్పడును. అదియే ఉత్తమ సుఖము. కావున ప్రశాంత మనస్కు డగునని తెలుపబడినది. ప్రశాంతమనగ ప్రశస్తమగు శాంతము. చెదరని శాంతము ఆత్మ బ్రహ్మమునందు నిలచినవానికి ఇట్టి చెదరని స్థితి నిలచి యుండును. మరణమును కూడ దర్శించునే కాని కలత చెందడు. అట్టి వానికి మరణము దేహ విసర్జనమే కాని తనకు అంతము కాదు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
16 Apr 2021
No comments:
Post a Comment