🌹 . శ్రీ శివ మహా పురాణము - 386🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴
అధ్యాయము - 15
🌻. తారకుని తపస్సు - 3 🌻
అపుడు ఆ దేవతలు, మునులు అందరు పరస్పరము చర్చించుకొని భయముతో దీనులైనా లోకమునకు వచ్చి నన్ను సమీపించిరి (33). దుఃఖముతో గూడిన మనస్సు గల వారందరు చేతులు ఒగ్గి నాకు నమస్కరించి స్తుతించి వృత్తాంతమునంతనూ నివేదించిరి (34). ఆ లోకోపద్రవమునకు గల కారణమును నేను విమర్శ చేసి నిశ్చయించి, ఆ రాక్షసుడు తపము చేయుచున్న స్థలమునకు వరమునిచ్చుటకై వెళ్లితిని (35). ఓ మహర్షీ! నేనాతనితో నిట్లనింటిని వరమును కోరుకొనుము , నీవు తీవ్రమగు తపస్సును చేసియుంటివి . నీకు ఈయరాని వరము లేదు(36). ఈ నా మాటను విని మహా సురుడగు ఆ తారకుడు నాకు నమస్కరించి చక్కగా స్తుతించి మిక్కిలి దారుణమగు వరమును కోరుకొనెను,(37)
తారకుడిట్లు పలికెను-
వరములనిచ్చు నీవు ప్రసన్నుడవైనచో, నాకు సాధ్యము కానిది ఏమి ఉండును? హే పితామహా! నేను నీ నుండి కోరు వరమును చెప్పెదను. వినుము(38). హే దేవదేవా! నీవు నా యందు ప్రసన్నుడవై, నాకు వరమునీయ నిశ్చయించినచో , నాపై దయ ఉంచి నాకు రెండు వరముల నీయవలెను. (39). హే మహాప్రభో! నీవు నిర్మించిన బ్రహ్మండములో ఎక్కడైననూ నాతో సమమగు బలముగల పురుషుడు మరియొక్కడు ఎవడైననూ ఉండరాదు. ఇది నిశ్చయము(40). శివుని వీర్యముచే పుట్టిన కుమారుడు సేనాపతియై ఏనాడు నా పై ఆయుధమును ప్రయోగించునో, అపుడు మాత్రమే నాకు మరణము కలుగవలెను(41).
ఓ మహర్షీ! ఆ రాక్షసుడు అపుడు నాతో అట్లు పలుకగా, నేను ఆ వరములనిచ్చి వెంటనే నా లోకమునకు తిరిగి వచ్చితిని (42). ఆ రాక్షసుడు తాను కోరిన గొప్ప వరములను పొంది మిక్కిలి ప్రసన్నుడై శోణితమను పేరు గల నగరమును చేరెను(43). అపుడు రాక్షసగురువగు శుక్రుడు నా ఆజ్ఞను పొంది ఆ మహాసురుని రాక్షసుల సన్నిధిలో ముల్లోకములకు రాజుగా అభిషేకించెను. (44) అపుడా మహా రాక్షసుడు ముల్లోకములకు ప్రభువై, స్థావర జంగమములగు ప్రాణులను పీడించుచూ తన ఆజ్ఞను ప్రవర్తిల్లజేసెను.(45)
ఆ తారకుడు ముల్లోకములలో యథావిధిగా రాజ్యమునేలెను. అతడు దేవతలు మొదలగు వారిని పీడించుచూ, ఇతర ప్రజలను పాలించెను. (46). తరువాత ఆ తారకుడు వారి శ్రేష్ఠవస్తువులను లాగుకొనెను. ఇంద్రుడు మొదలగు దేవతలు ఆ రాక్షసునకు భయపడి శ్రేష్ఠవస్తువులను స్వయముగా అతనికి సమర్పించిరి. (47). ఇంద్రుడు భయముతో తన ఐరావత గజమును అతనికి సమర్పించెను. కుబేరుడు నవనిధులను ఇచ్చివేసెను(48). వరుణుడు తెల్లని, గుర్రములను, సూర్యుడు దివ్యమగు ఉచ్చైశ్శ్రవమును భయముతో అతనికిచ్చివేసిరి. ఋషులు కోర్కెల నీడేర్చు కామధేనువు నిచ్చిరి(49).
ఆ రాక్షసుడు ఎక్కడెక్కడ ఏయే శుభవస్తువు కంట పడినా, దానిని తీసుకొని వెళ్లెను. ఇట్లు ముల్లోకములు సారహీనములయ్యెను (50). ఓ మహర్షీ! సముద్రములు వానికి భయపడి తమలోని రత్నములను ఇచ్చివేసినవి. భూమి దున్నకుండగనే పంటలు పండినవి. ప్రజలందరు రాజుయొక్క కోర్కెలను దీర్చిరి(51). వానికి దుఃఖము కలుగకుండునట్లు సూర్యుడు ప్రకాశించెను. చంద్రుని కాంతి హవిర్భాగములను సర్వమును లాగుకొనెను. మరియు అతడు ఇతరులందరి సంపదలను హరించి వేసెను. (53).
అతడు ముల్లోకములను వశము చేసుకొని తానే ఇంద్రపదవి నధిష్ఠించి ఏకైక ప్రభువు అయి, సర్వమును తన వశమునందుంచుకొని , అద్భుతముగా రాజ్యమును చేసెను. (54). అపుడాతడు దేవతలనందరినీ వెళ్ల గొట్టి ఆ స్థానములలో రాక్షసులను స్వయముగా నియమించెను. గంధర్వాది దేవగణములను తన సేవకులుగా నియమించుకొనెను(55). ఓ మహర్షీ !అపుడు వానిచే పీడింపబడిన ఇంద్రాది దేవతలందరు దిక్కు తోచనివారై మహా దుఃఖముతో నన్ను శరణు జొచ్చిర(56).
శ్రీ శివ మహాపురాణ రుద్ర సంహితాయాం పార్వతీ ఖండలో తారకాసురుని తపస్సు. రాజ్యము వర్ణన అనే పదునైదవ అధ్యాయము ముగిసినది(15).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
16 Apr 2021
No comments:
Post a Comment