గీతోపనిషత్తు -227


🌹. గీతోపనిషత్తు -227 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 8వ అధ్యాయము - అక్షర పరబ్రహ్మ యోగము 📚

శ్లోకము 12-1

🍀 11-1. యోగస్థితులు - మానవుని ప్రజ్ఞ సాధారణముగ మనస్సునందే యుండును. ప్రజ్ఞ ఇంద్రియార్థముల వెంట పడినపుడు మనస్సు ఇంద్రియముల ద్వారా బాహ్యమునకు ప్రసరించును. ఇంద్రియార్థముల వెంట, ఇంద్రియముల ద్వారా పరుగెత్తు ప్రజ్ఞను నియమించవలెను. అప్పుడు ప్రజ్ఞ నిరర్థకము కాదు. అందు కొరకు మనస్సును శ్వాసతో చేర్చి హృదయమున స్థిరపరచ వలెను. అట్టి పరిస్థితిలో మానవ ప్రజ్ఞ అంతరంగమున ఉండును. 🍀

సర్వద్వారాణి సంయమ్య మనో హృది నిరుధ్య చ |
మూర్త్న్యైధా యాత్మనః ప్రాణమాస్థితో యోగధారణామ్ 12


తాత్పర్యము :

సర్వద్వారములను సంయమము గావించి, మనస్సును హృదయమున చేర్చి, స్థాపించి, మనోప్రాణములను శిరస్సునకు చేర్చుము.

వివరణము :

సర్వద్వారము లనగా బాహ్యమునకు ప్రజ్ఞ ప్రవహించు మార్గములు. అవి సాధారణముగ ఐదు ఇంద్రియములు. ఈ ఐదు ద్వారముల నుండి ప్రజ్ఞ బాహ్యమునకు ప్రవహించు చుండగ, మానవుడు నిర్వీర్యుడగును. మనస్సే పంచేంద్రియముల ద్వారా బాహ్యమునకు ప్రసరించు చుండును. మానవుని ప్రజ్ఞ సాధారణముగ మనస్సునందే యుండును. ప్రజ్ఞ ఇంద్రియార్థముల వెంట పడినపుడు మనస్సు ఇంద్రియముల ద్వారా బాహ్యమునకు ప్రసరించును.

బాహ్యమందలి ఇంద్రి యార్ధములకు ప్రజ్ఞ ఆకర్షింపబడుట సర్వసాధారణము. అట్లు ఇంద్రియార్థముల వెంట, ఇంద్రియముల ద్వారా పరుగెత్తు ప్రజ్ఞను నియమించ వలెను. లేనిచో చిల్లుకుండ యందలి నీరు చిల్లు నుండి కారినట్లు, కుండ నిర్జలమైనట్లు, మనస్సు శక్తిహీనమగు చుండును. ఐదు చిల్లులుగల కుండకు ఎంత జలమందించినను, కుండ నిర్జలముగనే యుండును. ఇట్లు మానవుడు ఇంద్రియార్దముల వెంట పరువెత్తుచు, దుర్బలుడై కాలక్రమమున కృశించును, నశించును. అంతేగాక మరణించును కూడ.

మనస్సు నందలి ప్రజ్ఞను అంతర్ముఖము చేయవలెను. అప్పుడు ప్రజ్ఞ నిరర్థకము కాదు. అందుకొరకు మనస్సును శ్వాసతో చేర్చి హృదయమున స్థిరపరచవలెను. అట్టి పరిస్థితిలో మానవ ప్రజ్ఞ అంతరంగమున ఉండును. అవసరమగుచో కర్తవ్యమును బట్టి మనస్సునందు ప్రవేశించి, అటుపై ఇంద్రియములద్వారా బహిర్గతమై బహిరంగమును చేరి, కర్తవ్య నిర్వహణము పూర్తియగు నంతనే మరల మనస్సుయందలి ప్రజ్ఞను హృదయమున స్థిరపరచవలెను.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


15 Jul 2021

No comments:

Post a Comment