శ్రీ శివ మహా పురాణము - 427
🌹 . శ్రీ శివ మహా పురాణము - 427🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴
అధ్యాయము - 25
🌻. సప్తర్షులు పార్వతిని పరీక్షించుట - 4 🌻
ఆ కుమారులు తపస్సును చేసెదమని ప్రతిజ్ఞచేసి పశ్చిమ దిక్కున నున్న నారాయణ సరస్సుకు వెళ్ళిరి. నారదుడు కూడ అచటకు వెళ్లి (33) వారికి మోసపు ఉపదేశమును చేసెను. వారతని ఉపదేశముచే తిరిగి తండ్రి వద్దకు ఒక్కడైననూ మరలివెళ్లలేదు.(34)
ఈ వార్తను విని దక్షుడు కుపితుడు కాగా తండ్రి యాజ్ఞచే అతనిని ఓదార్చెను. అతడు తరువాత మరల వేయిమంది కుమారులను గని తపస్సు కొరకు పంపెను. (35). ఆ కుమారులను కూడా తండ్రి యాజ్ఞచే తపస్సును చేయుట కొరకు అచటకు వెళ్లిరి. నారదుడు కూడ అచటకు వెళ్లి వారికి వైరాగ్యము నుపదేశించెను. (36)
అతని ఉపదేశముచే వారు కూడ సోదరుల మార్గములో వెళ్లిరి. వారు భిక్షాటన యందభిరుచి గలవారై తండ్రి గృహమునకు మరలి పోలేదు.(37) ఓ శైలజా! నారదుని మంచిదనము ఈ తీరున లోకప్రసిద్ధమై యున్నది. మానవులలో వైరాగ్యమును కలిగించే అతని మరియొక గాథను వినుము(38).
పూర్వము చిత్రకేతు డనే విద్యాధరుడుడుండెను. నారదుడాతనికి తన ఉపదేశమును చేసి అతని ఇంటిని శూన్యము చేసెను. (39). ఇతరుల బుద్ధిలో భేదములను కల్పించే ఈ నారదుడు తన ఉపదేశములను ప్రహ్లాదునకు చేసి హిరణ్యకశిపునకు మహా దుఃఖమును కలిగించెను.(40)
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
15 Jul 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment