శ్రీ శివ మహా పురాణము - 220

🌹 .   శ్రీ శివ మహా పురాణము - 220   🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴

48. అధ్యాయము - 3

🌻. కామశాపానుగ్రహములు - 5 🌻

మరీచి ప్రముఖాష్షడ్వై నిగృహీతేంద్రియక్రియాః |ఋతేక్రతుం వసిష్ఠం చ పులస్త్యాంగిరసౌ తథా || 54
క్రత్వాదీనాం చతుర్ణాం చ బీజం భూమౌ పపాత చ | తేభ్యః పితృగణా జాతా అపరే మునిసత్తమ || 55
సోమపా ఆజ్యపా నామ్నా తధైవాన్యే సుకాలినః | హవిష్మంతస్సుతాస్సర్వే కవ్యవాహః ప్రకీర్తితః || 56
క్రతోస్తు సోమపాః పుత్రా వసిష్ఠాత్కాలినస్తథా | ఆజ్యపాఖ్యాః పులస్త్యస్య హవిష్మంతో ంగిరస్సుతాః || 57

క్రతు, వసిష్ఠ, పులస్త్య, అంగిరసులను మినహాయించి, మరీచి మొదలగు ఆర్గురు ఋషులు ఇంద్రియ వికారమును నిగ్రహించగల్గిరి.(54).

క్రతువు మొదలగు ఆ నల్గురు ఋషుల బీజము భూమిపై పడెను. ఓమునిశ్రేష్ఠా! అపుడు మరికొందరు పితృగణములు జన్మించిరి (55).

సోమపులు, ఆజ్యపులు, సుకాలులు, మరియు హవిష్మంతులని వారి పేర్లు. వీరందరికి హవిర్భాగములను (కవ్యము) అందజేయు అగ్ని కవ్యవాహుడనబడును (56).

క్రతువు నుండి సోమపులు, వసిష్ఠుని నుండి కాలులు అను పుత్రులు జన్మించిరి. పులస్త్యుని సుతులు ఆజ్యపులనియు, అంగిరసుని సుతులు హవిష్మంతలనియు అనబడుదురు (57).

జాతేషు తేషు విప్రేంద్ర అగ్ని ష్వాత్తాదికేష్వథ | లోకానాం పితృవర్గేషు కవ్యవాట్‌ స సమంతతః || 58
సంధ్యా పితృప్రసూర్భూత్వా తదుద్దేశయుతాs భవత్‌ | నిర్దోషా శంభు సందృష్టా ధర్మకర్మపరాయణా || 59
ఏతస్మిన్నంతరే శంభురనుగృహ్యాఖిలాన్‌ ద్విజాన్‌ | ధర్మం సంరక్ష్య విధివదంతర్ధానం గతో ద్రుతమ్‌ || 60
అథ శంకరవాక్యేన లజ్జితోsహం పితామహః | కందర్పాయాకోపితం హి భ్రుకుటీ కుటిలాననః || 61

ఓ విప్రశ్రేష్ఠా! అగ్ని ష్వాత్తులు మొదలగు ఈ పితృదేవతలు జన్మించగా, వారందరికి మానవులు సమర్పించే హవ్యములను సమర్పించు అగ్ని కవ్యవాట్‌ అయినాడు (58).

బ్రహ్మ కుమార్తెయగు సంధ్య తండ్రి గుణములను పుణికి పుచ్చుకొనెను. శంభునిచే చూడబడిన ఆమె దోషములు లేనిదై, ధర్మ బద్ధమగు కర్మలయందు అభిరుచిగలదై యుండెను (59).

ఇంతలో శంభుడు ఆ ఋషులనందరిని అనుగ్రహించి, ధర్మమును యథావిధిగా సంరక్షించి, వెంటనే అంతర్థానము జెందెను (60).

అపుడు పితామహుడనగు నేను శంకరుని మాటలచే సిగ్గు చెందియుంటిని. మన్మథునిపై కోపము కలిగి నా కనుబొమలు ముడివడెను (61).

దృష్ట్వా ముఖమభిప్రాయం విదిత్వా సోsపి మన్మథః | స్వబాణాన్‌ సంజహారాశు భీతః పశుపతేర్మునే || 62
తతః కోపసమాయుక్తః పద్మయోనిరహం మునే | అజ్వలం చాతిబలవాన్‌ దిధక్షురివ పావకః || 63
భవనేత్రాగ్ని నిర్దగ్ధః కందర్పో దర్పమోహితః | భవిష్యతి మహాదేవే కృత్వా కర్మ సుదుష్కరమ్‌ || 64
ఇతి వేధా స్త్వహం కామమక్షయం ద్విజసత్తమ | సమక్షం పితృసంఘస్య మునీనాం చ యతాత్మనామ్‌ || 65
ఇతి భీతో రతిపతిస్తత్‌ క్షణాత్త్యక్తమార్గణః | ప్రాదుర్బభూవ ప్రత్యక్షం శాపం శ్రుత్వాతి దారుణమ్‌ || 66

ఆ మన్మథుడు నా ముఖమును చూచి నా అభిప్రాయమును గ్రహించెను. ఓమునీ! ఆతడు శివునకు భయపడి వెంటనే తన బాణములనుపసంహరించెను (62).

ఓ మహర్షీ! గొప్ప బలము గలవాడను, పద్మము నుండి పుట్టిన వాడను అగు నేను అప్పుడు కోపముతో నిండిన స్వరమును తగులబెట్టు అగ్నివలె మండి పడితిని (63).

గర్వముచే మోహితుడై యున్న ఈ మన్మథుడు మహాదేవుని యందు చేయ శక్యము కాని కర్మను చేయబూని, ఆయన నేత్రము నుండి బయల్వెడలిన అగ్నిచే దహింపబడగలడు (64).

ఓ ద్విజశ్రేష్ఠా! నేను ఈ తీరున, యతీశ్వరులగు మునులు, పితృదేవతలు చూచుచుండగా, కాముని శపించితిని (65).

కాముడు భయపడి వెంటనే బాణములను ఆవల పారవేసి, అతి దారుణమగు ఈ శాపమును విన్న వెంటనే నా ఎదుట ప్రత్యక్షమాయెను (66).

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము

10.Sep.2020

No comments:

Post a Comment