✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. ఆత్మ విచారణ పద్ధతి - 14 🌻
ఎవరైతే ఆత్మజ్ఞాన విచారణ, ఆత్మవిచారణ, ఆత్మనిష్ఠ, ఆత్మానుభూతి, ఆత్మసాక్షాత్కార జ్ఞానం ఈ త్రోవలో నడిచేటటువంటి వారు ఎవరైతే వుంటారో, వాళ్ళకి ఈ అరిషడ్వర్గాలు మిత్రులు వలే ప్రవర్తిస్తాయి. వీళ్ళకు శతృత్వం వుండదన్నమాట!
ఎందుకని అంటే,
రాగద్వేషాలు లేవు కాబట్టి.
సమానత్వం ఉంది కాబట్టి.
సమరసత్వం ఉంది కాబట్టి.
శాంతము ఉన్నది కాబట్టి.
వీళ్ళు నిలకడగా, స్థిరంగా తమ లక్ష్యం వైపుకు ప్రయాణం చేస్తూ వుంటారు కాబట్టి, నిరంతరాయంగా ప్రయాణం చేస్తారు కాబట్టి, అవస్థాత్రయాన్ని దాటే ప్రయత్నంలో ఉంటారు కాబట్టి,
వీళ్ళకి ఏ రకమైనటువంటి రాగద్వేషాలు వుండవు.
కనుకనే అటువంటి ధైర్యశాలి అయినటువంటివాడు బుద్ధిమంతుడు, ధైర్యశాలి....
ఇంకేం తెలియాలట? జగత్తు యొక్క స్థితిని గ్రహించాలి. జగత్తు యొక్క అశాశ్వతత్వమును, ఆత్మయొక్క శాశ్వతత్వమును గ్రహించాలి. మనమందరం జగత్తులో వ్యవహరించేటప్పడు.... జగత్తే సత్యముగా చూస్తుంటాము. ‘సత్యము’ అంటే అర్థం ఏమీలేదు.
“పరవశత్వము” జగత్తును అనుభవించేటప్పుడు పరవశించి అనుభవిస్తాడన్నమాట! అంటే అర్థం ఏమిటి? ఒకావెడ, కొత్త పట్టుచీర కట్టుకుందనుకోండి! ఆహా! ఆవెడకి ఇంద్రభోగం లభించినంత ఆనందం కలుగుతుంది.
ఆ ఒక్కక్షణం, రెండు క్షణాలు, మూడు క్షణాలు, ఐదు క్షణాలు... ఎవరైన ఇతరులు ఆహా! నీవు అద్భుతమైన వస్త్రాలు కట్టుకున్నావని అంటే, ఐరావతం ఎక్కినంత ఆనందం పొందుతారు. ఆ ‘ప్రశంస’. ఆ ప్రశంస పూర్వకమైనటువంటి దృష్టిని మనం కోరుతూ వుంటామన్నమాట! ఆ ప్రశంస పూర్వకమైనటువంటి అనుభూతిని కోరుతూ వుంటాము.
ఏమిటి? ఆ ప్రశంసలో వున్న విశేషం అంటే, ‘అహం’ పోషించ బడుతోంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. తెగిడితే పొగుడుతాడు. పొగిడితే తెగుడుతాడు. ఈ రెండు లక్షణాలు ఒక్కచోటే వుంటాయి. పొగిడిన నోటితోనే మరలా ఒక్క క్షణంలో తెగుడుతాడు. అంటే నిరసిస్తాడన్నమాట. ఖండిస్తాడన్నమాట.
కాబట్టి, పొగడ్తలకు పొంగక, తెగడ్తలకు కుంగక వుండేటటువంటి వాడు ఎవడైతే వున్నాడో, వాడే ఈ ప్రశంసకు, దూషణ భూషణలకు లొంగని వాడు. అదే కాక, జగత్తు యొక్క అశాశ్వతత్వమును బాగుగా ఎరగాలి. ఎప్పటికప్పుడు నీ మనస్సుని చంచలత్వముగా పరిగెత్తింపజేసి, తనవైపు ఆకర్షింపజేసేటటువంటి, త్రిగుణ మాలిన్యంతో కూడుకున్నటువంటి... జగత్తు ఏదైతే వుందో... ఆ జగత్తు నీ యందు పనిచేస్తూ వుంటుంది.
నిన్ను మేల్కొల్పుతూ వుంటుంది. నిన్ను ప్రేరేపిస్తూ వుంటుంది. నిన్ను ఆకర్షిస్తూ వుంటుంది. నీ యందు వున్నటువంటి బలాల్ని, బలహీనతల్ని నీకు తెలియజెప్తూ వుంటుంది. దానిని ఆత్మవిచారణకు అనుకూలమైనటువంటి పద్ధతిగా, విచారణగా గ్రహించాలే కానీ దానిని త్రిగుణ పద్ధతిగా, త్రిగుణ తాదాత్మ్యతతో కనుక అనుభవించడం కనుక మనం అలవాటు చేసుకుంటే, దాని వెంబడిపడే పోతాం అన్నమాట! - విద్యా సాగర్ స్వామి
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #కఠోపనిషత్ #చలాచలబోధ
10.Sep.2020
No comments:
Post a Comment