22. గీతోపనిషత్తు - కర్మ సూత్రము - మనము చేయు పనులు పదిమందికి పనికి వచ్చునట్లు చేసినచో బంధస్థితి నుంచి మోక్షస్థితి వైపు మార్గమున మలుపు రాగలదు.


🌹  22. గీతోపనిషత్తు - కర్మ సూత్రము - మనము చేయు పనులు పదిమందికి పనికి వచ్చునట్లు చేసినచో బంధస్థితి నుంచి మోక్షస్థితి వైపు మార్గమున మలుపు రాగలదు.  🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


📚.  గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 48, 49  📚

చేయు పనుల ద్వారా మనలను మనమే బంధించుకొనుట

ఏమి తెలివి? తెలివైన వాడిననుకొనువాడు కూడ తన తెలివితోనే తన జీవితమును చిక్కుపోచుకొను చున్నాడు కదా! వీరు కొరమాలిన తెలివికలవారే కాని, నిజమైన తెలివిగలవారు కారు.

యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ |
సిద్ధ్యసిద్ధ్యోః సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే || 48

దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగా ద్ధనంజయ |
బుద్ధౌ శరణ మన్విచ్ఛ కృపణాః ఫలహేతవః || 49

ఒక పని చేయునప్పుడు, దాని నుండి పుట్టు పనులను, చిక్కులను, కష్ట-నష్టములను పూర్తిగ బేరీజు వేసుకొనవలెను. ప్రస్తుతమునకు సరలికర్యముగ నున్నదని, లాభము కలుగుచున్నదని, జయము చేకూరునని, చేయుపనులు అటుపై వికించగలవు.

పెద్దలు యిచ్చిన నానుడిలో ముఖ్యమైన దేమనగా - ''పాపము చేయు నపుడు చమ్మగ నుండును. ఫలితము లనుభవించునపుడు చేదుగా నుండును.''

కరుడుకట్టిన స్వార్థముతో తనకు లాభించునని ప్రతి మానవుడు దాని తరంగముల ప్రభావము తెలియక ఉరుకులు పరుగులు వేయుచూ యితరులను దోచుకొనుచున్నాడు. మానవుడు రాక్షసుడై హద్దూ-పద్దూ లేక భూమి సంపదను, వృక్ష సంపదను, జంతు సంపదను దోచుకొనుచున్నాడు.

ఎక్కువ దిగుబడికై వృక్షములు మరియు జంతువుల జన్యువులను కూడ రసాయనక చర్యలతో ఒత్తి కలిగించుచున్నాడు. ఇది అంతయూ తనయొక్క మేలునకే అనుకొని చేయుచున్నాడు. చేయు పనులనుండి పుట్టబోవు మహత్తర మైన విపత్తులను గమనించుటయే లేదు.

పంచభూతముల సమన్వయమును కూడ భంగపరచుటకు సిద్దపడిన మానవుడు, ఈనాడు తాను చేసిన పనికి కలుగు ఫలిత మెట్లుండునోనని భయ భ్రాంతుడై జీవించుచున్నాడు.

మంచుపర్వతములు కరుగునని, సముద్రములు పొంగునని, అగ్నిపర్వతములు బ్రద్దలగునని, అనివార్యమైన రోగములు ప్రబలునని, జీవనపు అల్లిక చెడిపోవు చున్నదని దుఃఖ పడుచున్న మానవుడు ఈ విపత్కర పరిస్థితికి తానే కారణమని తెలుసుకొనవలెను.

తన స్వార్థచింతన తగ్గించు కొని పరహితము పెంచుకొనినచో జీవన విధానమున మార్పు ఏర్పడి పరిష్కారము లభింప గలదు.

ఈనాటి మానవుని తెలివి ఆత్మహత్య గావించుకొను వాని తెలివిది. శాస్త్ర విజ్ఞానము పెరుగుదల, సంస్కారముల

తరుగుదల కారణముగ అతి వేగముగ ప్రమాదము వైపు పరుగిడుచున్నాడు.

మనము చేయుపనులు పదిమందికి పనికి వచ్చునట్లు చేసినచో బంధస్థితి నుంచి మోక్షస్థితి వైపు మార్గమున మలుపు రాగలదు.

ప్రతి జీవియు తన జీవన నిర్మాణ పథంమున ఎప్పటికప్పుడు

జీవితముపై తన స్వామిత్వమును పరికించుచుండవలెను. అట్లు కానిచో వృత్తి, కుటుంబము, సంఘము, అతనిని బంధించగలవు.

జీవితము ముందుకు సాగుచున్న కొలది, బాధ్యతలు పెరిగిననూ మనసున బంధము పెరుగరాదు. బంధములు పెంచుకొను

మార్గము చావుతెలివి.

ఉదా : మంచి గదిని నిర్మాణము చేసుకొను వాడు తన చుట్టునూ ఇటుకపై ఇటుక పేర్చుకొనుచూ నలువైపులా గోడను నిర్మించుకొనినచో బయటకు పోవు దారిలేక తను నిర్మించిన గదియే నిర్గమశాన్యమగు దుర్గమై తాను సమాధి చెందుటకు కారణమగును.

ప్రతివ్యక్తియూ ఈనాడు తన పెరుగుదల రూపమున ఈషణ

త్రయమున విపరీతముగ బంధించుకొనుచూ తన గోరీని తానే

నిర్మాణము చేసుకొనుచున్నాడు. అంతియేకాదు, తనంత తెలివిగ యితరులు గోరీలు కట్టుకొన కూడదని పోీపుచూ అందమైన గోరీని నిర్మాణము చేసుకొను చున్నాడు. జీవితమును ఒక కారాగారముగ నిర్మించుకొనుటగా కాక, రాకపోకలు గల ఒక గృహముగ నేర్పాటు చేసుకొనుటకు వలసిన సూత్రమునే భగవానుడు-

''మాకర్మ ఫలహేతుర్భూ'' అని హెచ్చరించి యున్నాడు. చిన్నతనముననే ఈ ఎరుక కలిగినచో జీవిత మానందమయ మగుటకు అవకాశముండును. తిమింగలముచే పట్టబడిన తరువాత తెలిసినచో బంధమోచనము కష్టతరము.

ఎవరైననూ వచ్చి రక్షించవలసినదే కాని, తనను తాను రక్షించుకొనలేు. అట్టి వానికి గజేంద్రుడు చేసిన ప్రార్థనయే శరణ్యము.

🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్

04.Sep.2020

No comments:

Post a Comment