🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 102 🌹
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. పిప్పలాద మహర్షి - 4 🌻
21. అతడు ఈ జీవకోటికి అంతర్యామిగా ఉన్నాడు. అంతే కాకుండా కాలరూపుడై ఉన్నాడు. అంతర్యామిగా కాలరూపుడు అంటే, పుట్టిన శరీరం ఒకసారెపుడో నశించాలి. కాబట్టి దానికి వృద్ధిక్షయములు అన్నీ ఉంటాయి. వాటిని విధిస్తూఉండే అంతర్యామి ఒకరు లోపల ఉన్నారు. పరబ్రహ్మ వస్తువే ఉందక్కడ. తరువాత అంతర్ముఖంగా అదే అతడు చేసే కర్మకు సాక్షిగాకూడా ఉన్నది.
22. ఎందుచేతనంటే ప్రతీజీవుడియందు అతడుచేసే కర్మ చూచేదెవరు? ఎవరు నిర్ణయం చేస్తున్నారు? అంతస్సాక్షిగా ఉన్న పరమాత్మవస్తువు జీవాత్మకు వెనుక, ద్రష్టగా(చూచేవాడుగా) సాక్షిగా ఉన్నాడు. (“ద్వా సుపర్ణా…” అనే ఉపనిషన్మంత్రానికి ఈ అర్థమే ఉంది. ఆ మంత్రంలో వర్ణితమైన వృక్షం ఈ దేహం. అందులోని రెండు పక్షులు – ఒకరు జీవాత్మ, మరొకరు పరమాత్మ. అతడు ద్రష్ట. చూచేవాడు కాబట్టి అతడిని సాక్షి అని అంటారు.)
23. “అంతటా వ్యాపించిన ఆ పరమాత్మ సృష్టిస్థితిలయములకు హేతువు అవుతున్నాడు. సర్వస్వరూపుడు అతడే! యజ్ఞంలో అర్చించబడేది అతడే! దక్షిణాయనానికి, ఉత్తరాయణానికి ఆయనే కారకుడు.
24. కర్మానుసారంగా జీవులకు దక్షిణాయనంలో పితృయానమార్గంలో చంద్రమండల ప్రాప్తి, ఉత్తరాయణంలో అర్చిరాది మార్గమున బ్రహ్మలోకప్రాప్తి అతడే కల్పిస్తున్నాడు. మొదటిది పునరావృత్తి సహితము, రెండవది పునరావృత్తి రహితము.
25. అంటే పితృయానమార్గంలో చంద్రలోకానికి వెళ్ళినప్పుడు జీవుడికి మళ్ళీ పునర్జన్మ కలిగితీరుతుంది. ఉత్తరాయణంలో యోగ్యుడై వెళ్ళిపోతే పునర్జన్మ కలుగదు. అంటే అందరికీ అనికాదు.
26. ఎందుకంటే ఉత్తరాయణంలో అనేక జీవులు చనిపోతున్నాయి. మేక, కుక్కలతోపాటు ఎన్నో జీవులు చనిపోతున్నాయి. మహాపాపాలు చేసినవాళ్ళు కూడా చనిపోతున్నారు. ఉత్తరాయణంలో పుణ్యశీలి, జ్ఞానం కోరేవాడు పోతే అతడి పుణ్యం సఫలమయే కాలం వచ్చిందన్నమాట. అప్పటికే మోక్షంపై కోరిక ఉండి పుణ్యంచేసినవాడు ఉత్తరాయణ కాలంలోపోతే, అతడు పరమపదానికి వెళతాడు” అని చెప్పాడు పిప్పలాదుడు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద
04.Sep.2020
No comments:
Post a Comment