కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 131


🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 131 🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. ఆత్మను తెలుసుకొను విధము - 61 🌻


అవస్థాత్రయాన్ని విశ్లేషించే ప్రయత్నం చేస్తున్నారు. మానవులందరూ, జీవులందరూ సృష్టి అంతా కూడా జాగ్రత్‌ స్వప్న సుషుప్తులకు లోనౌతుంది. సర్వేంద్రియ వ్యవహారం పరిణామ శీలమై, ప్రతిభావంతముగా వ్యవహరిస్తున్నటువంటి కాలం ఏదైతే ఉందో దానిని జాగ్రదావస్థయని, అవే ఇంద్రియములు వెనుకకు మరలి, తమకు ఆధారంగా ఉన్నటువంటి, మనస్సు అనేటటువంటి ఏక ఇంద్రియమునందు అంశీభూతములై, నిక్షిప్తమై, అర్థజాగృతి సగము మెలకువ, సగము నిద్రా స్థితిలో సర్వేంద్రియానుభూతులన్ని ఇంద్రియముల సహాయము లేకనే అనుభవించేటటువంటి స్వప్నావస్థలోనూ,

ఆ మనస్సు కూడా అచేతనమై, సుప్త చేతనమై సుషుప్త్యావస్థలో కదలక పడియుండేటటువంటి ఇంద్రియముగా, పనిముట్టుగా మనస్సు, బుద్ధి కూడా మారి, ప్రజ్ఞా స్థితిలో నిలకడ చెంది, కానీ అట్టి ఎఱుకలేక తానైనటువంటి స్థితిని తెలుసుకోలేక తనను తాను మరిచిపోయి, శరీర భ్రాంతి యందే నిమగ్నమై ఉన్నటువంటి జీవుడు, జాగ్రత్‌ స్వప్న సుషుప్తి అవస్థలను నిరంతరాయముగా అనుభవిస్తూ, వాటియందే పరిణమిస్తూ, ఆ పరిణామమే సత్యమనుకొనుచూ, ఆ ద్వంద్వానుభూతులే సత్యమనుకొనుచూ,

అట్టి ద్వంద్వానుభూతులయందు సరియైనటువంటి వ్యవహారము లేకున్నచో తనకే ఏదో అయిపోవుచున్నదనే భ్రాంతిని పొందుచూ ఇవాళ నిద్ర సరిగ్గా పట్టలేదండీ, ఇవాళ కలలు విపరీతంగా వచ్చినాయండి. ఇవాళ నిద్రమధ్యలో లేచి కూర్చున్నానండి. ఇవాళ జాగ్రదావస్థ సరిగ్గా లేదండి. ఇవాళ మెలకువలో అంతా భావములు అన్నీ కూడాను మనః సంయమనం లేకపోవడం చేత, అరిషడ్వర్గాల చేత, కామక్రోథలోభమోహ మద మాత్సర్యముల చేత భావించబడుతూ, బాధించబడుతూ ప్రభావితం అవుతూ ఆ ఇంద్రియ సంగత్వాన్ని,

సుఖ దుఃఖ సంగత్వాన్ని, వ్యవహార సంగత్వాన్ని, ప్రతిబింబ సంగత్వాన్ని పొంది, స్వప్నావస్థలోకూడా సరియైనటువంటి స్థితి లేక అనేక రకములైనటువంటి ఇబ్బందులను అనుభవిస్తున్నట్లుగా ఇబ్బందులను అధిగమిస్తున్నట్లుగా బాధచెంది సరైన నిద్రావస్థలేక, సరియైన స్వప్నావస్థ లేక, సరియైన జాగ్రదావస్థ లేక ఈ మూడూ కూడా శరీరమే అనుభవిస్తున్నది కానీ నేను అనుభవించడం లేదనేటటువంటి జ్ఞానము లేకపోవడం చేత,

తురీయావస్థలో ప్రవేశం లేకపోవడం చేత, స్వాత్మసాక్షాత్కర జ్ఞానంలో అనుభవజ్ఞానం లేకపోవడం చేత, ప్రతి నిత్యమూ ఈ మూడు అత్యవసరమై ఉన్నదని తోచుట చేత, ఈ మూడింటి యందే నిమగ్నమగుచు, వీటినే నిత్యజీవితముగా భావించుచు, వీటి యందున్న వ్యవహారమునందు కలుగుచున్న సుఖదుఃఖములే సత్యమని భ్రమసి, వాటి యందు సాంగత్య దోషమును పొంది, వాటి సంగత్వము చేత ప్రభావితము అవుతూ, వాటినే నిరంతరాయముగా కోరుచూ, ఏ ఆత్మకైతే ఇట్టి మూడు అవస్థలు లేవో, ఏ ఆత్మ యొక్క ఉనికి చేతనే ఈ మూడు అవస్థలు ఏర్పడుచున్నవో, అట్టి స్వస్వరూప జ్ఞానాన్ని మానవుడు ఆశ్రయించడం లేదు.

అందువల్లనే జరానమరణ రూప సంసార చక్రమునందు, కర్మ చక్రమునందు ఇమిడిపోయి, బాధించబడి, ప్రభావితమై మరల మరల పరిణామ శీలమై పునరావృత్తిని పొందుచున్నాడు. కానీ పునరావృత్తి రహితమైనటువంటిది, శాశ్వతమైనటువంటిది, మోక్షదాయకమైనటువంటిది, ముక్తిదాయకమైనటువంటిది అయినటువంటి స్వాత్మనిష్ఠను, కాలత్రయాన్ని, శరీర త్రయాన్ని, దేహత్రయాన్ని దాటి అవస్థాత్రయ సాక్షిత్వాన్ని ప్రతిపాదిస్తున్నారు.

ఇప్పటి వరకూ కాలత్రయాన్ని, శరీర త్రయాన్ని, దేహత్రయాన్ని, ఈషణ త్రయాన్ని ఇలా మూడు మూడుగా ఉన్నటువంటి త్రిపుటులనన్నింటిని వివరిస్తూ ఇప్పుడు అవస్థాత్రయాన్ని.... అవస్థ అంటేనే అర్థం ఏమిటంటే, అస్థః అంటే ఉండుట. అవ - అంటే ఉన్నస్థితి నుంచి క్రిందకి దిగి వచ్చుట. అవస్థ - కాబట్టి తను ఆత్మస్వరూపుడై ఉన్నప్పటికి, జాగ్రదావస్థలో, మెలకువలో ఇంద్రియములతో వ్యవహరించుచూ, ఆ ఇంద్రియ వ్యవహారమే తానని భ్రమసి, ఆ భ్రమచేత భ్రాంతి చెంది,

మాయా మోహితుడై, అట్టి మాయా మోహమును మరింతగా అనుభవించాలనేటటుంవంటి కాంక్ష చేత, ప్రియాప్రియముల చేత లాగబడి, గుణత్రయముల చేత ప్రభావితమై మనోఫలకములో, మనోబుద్ధులచేత స్వప్నావస్థ యందుకూడా అదే ఇంద్రియానుభవములను మరల మరలా అనుభవించుచూ సంతృప్తి లేక, అసంతృప్తులను చెందుచూ, ఇంకనూ బలమైనటువంటి సుఖమును పొందాలనే బలీయమైన కాంక్ష చేత, లేని సుఖమును పొందాలనే ప్రయత్నము చేత, వస్తుగత నిశ్చయజ్ఞానము లేక,

ఆ వస్తువులు సుఖం ఇస్తున్నాయనే భ్రాంతి చేత, ఆ ఇంద్రియములే సుఖస్థానములని భ్రమసి, భ్రాంతి చెందటం చేత, భ్రమాజన్యజ్ఞానము అభ్యాసము చేత, భ్రమాజన్య జ్ఞానమును ఆశ్రయించడం చేత, ప్రతిబింబ జ్ఞానమునే సత్యమని భావించుట చేత, ఆ రకమైనటువంటి జాగ్రత్‌ స్వప్న సుషుప్తులను శరీరమే అనుభవించు చున్నప్పటికి, తాను అనుభవించుచున్నాడని తనకు ఆపాదించుకొనుచున్నాడు. ఇదీ అజ్ఞానమంటే.

నేను ఇవాళ సరిగ్గా నిద్రపోలేదండి! - విద్యా సాగర్ గారు

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


14 Dec 2020

No comments:

Post a Comment