గీతోపనిషత్తు - 97


🌹. గీతోపనిషత్తు - 97 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍀 26 - 10 . ప్రాణాయామ యజ్ఞము - ఉదాన వాయువు కంఠ భాగమునుండి భూమధ్యము వరకు వ్యాపించి యుండి జీవుని హృదయము నుండి ఊర్ధ్య గతిని కలిగించి, ప్రత్యాహారస్థితి యందు నిలుపును. అపుడు జీవుడు తననొక స్పందనాత్మక చైతన్యముగ కంఠమునందు, నోటియందు, క్రింది తాలువుయందు, పై తాలువు యందు, నాసిక యందు స్పందన ప్రక్రియగ అనుభూతి చెందుచునుండును. అప్పుడు ఉచ్ఛ్వాస, నిశ్వాస, హృదయమునందు స్పందన యుండవు. ప్రాణస్పందనము, ప్రజ్ఞ ముఖమున యుండును. 🍀

📚. 4. జ్ఞానయోగము - 29, 30 📚

Part 10

పంచప్రాణములు దేహమున ఈ క్రింది భాగములలో పనిచేయుచున్నవి.

🌷 4. ఉదాన వాయువు - 2 🌷

ఉదాన వాయువు కంఠ భాగమునుండి భూమధ్యము వరకు వ్యాపించి యుండి జీవుని హృదయము నుండి ఊర్ధ్య గతిని కలిగించి, ప్రత్యాహారస్థితి యందు నిలుపును. అపుడు జీవుడు తననొక స్పందనాత్మక చైతన్యముగ కంఠమునందు, నోటియందు, క్రింది తాలువుయందు, పై తాలువు యందు, నాసిక యందు స్పందన ప్రక్రియగ అనుభూతి చెందుచునుండును. అప్పుడు ఉచ్ఛ్వాస, నిశ్వాస, హృదయమునందు స్పందన యుండవు. ప్రాణస్పందనము, ప్రజ్ఞ ముఖమున యుండును.

ప్రజ్ఞ ప్రశాంతముగ నుండును. భ్రూమధ్యమున క్రమముగ చేరును. ఈ స్థితిలో సాధకునకు ఆహార విషయమున, ఉచ్చారణ విషయమున విశిష్టమగు నిష్ఠయుండును. పవిత్రమగు ఆహారమును మాత్రమే స్వీకరింపగలడు. పవిత్రమగు భాషణమును మాత్రమే చేయగలడు. అతడిపుడు చేరునది ఆకాశతత్వముగ గనుక, ఆకాశమువలె నిర్మలమగు విషయములందు మాత్రమే ఆసక్తి కలిగి యుండును.

ప్రాపంచిక ప్రవృత్తులు, దేహప్రవృత్తులు యాంత్రికముగ సాగుచుండును. వానిని విసర్జించ నవసరము లేదు. ఉదాసీనతతో నిర్వర్తించుట యుండును. ఉదాన శబ్దమున 'ఉత్' అను శబ్దముండును. అనగ ప్రాణమాధారముగ జీవు డూర్ధ్వముఖము చెందుటకు దేహమున ఏర్పడిన సౌకర్యమని తెలియవలెను.

ఆకాశమును చేరినది జీవ ప్రజ్ఞ యగుటచే అది అనంతము, అపరిమితము, సర్వవ్యాపకము అగు తత్త్వమునకు చేరువగుచుండును. భ్రూమధ్యము వరకు చేరి, అనంతత్వములోనికి వంతెన నేర్పరచుకొను ప్రయత్నమున నుండును.

హృదయమునుండి భ్రూమధ్యమునకు చేరు మార్గమున సాధకునికి అనేకానేక దివ్యానుభూతులు కలుగుచునుండును. అనేకములగు దివ్యరూపములు దర్శనమగు చుండును. అనేకములగు దివ్య విషయములు వినపడుచుండును. రకరకముల కాంతి దర్శనము లగుచుండును.

అట్లే వివిధములగు వాయిద్యములు వినబడుచు నుండును. ఈ సమస్త దర్శనమును నాదబిందు కళాత్మకముగ పెద్దలు వివరించుచు నుందురు. వీని కాకర్షింప బడక ఊర్ధ్వమునకు సాగుట ఉత్తమమని పెద్దలు తెలిపిరి.

భ్రూమధ్యమున చేరిన త్రిగుణాత్మక జీవప్రజ్ఞ, త్రిగుణముల కావలనున్న త్రిగుణాతీతమగు తత్వముతో అనుసంధానము చెందుటయే ప్రధానము కాగ, ఉదాన వాయువు వ్యానవాయువుతో అనుసంధానము చెందుట ప్రారంభమగును.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


14 Dec 2020

No comments:

Post a Comment