రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
71. అధ్యాయము - 26
🌻. దక్షుని విరోధము - 3 🌻
దక్షుడిట్లు పనికెను-
మీ రుద్రగణముల వారందరు వేద బాహ్యులు, వేదమార్గమును వీడినవారు, మరియు మహర్షులచే త్యజించబడినవారు అగుదురు గాక! (26) మీరు నాస్తిక సిద్ధాంతమునందు శ్రద్ధగలవారు, శిష్టుల ఆచారమునుండి బహిష్కరింపబడినవారు, మద్యపానమునందు అభిరుచిగలవారు, జటలను, భస్మను, ఎముకలను ధరించువారు అగుదురు గాక! (27).
బ్రహ్మ ఇట్లు పలికెను -
దక్షుడీ విధముగా శివకింకరులను శపించగా, ఆ మాటలను విని శివునకు ఇష్టుడగు నంది మిక్కిలి కోపావిష్టుడాయెను (28). శిలాదుని కుమారుడు, తేజశ్శాలి, శివునకు ప్రియుడు అగు నంది మహాబలుడు, గర్విష్ఠి అగు ఆ దక్షునితో వెంటనే ఇట్లనెను (29).
నందీశ్వరుడిట్లు పలికెను -
ఓ దక్షా! మోసగాడా! దుర్బుద్ధీ! శివతత్త్వము నెరుంగని నీవు బ్రాహ్మణ చాపల్యముచే శివగణములను వృథాగా శపించితివి (30). బ్రాహ్మణాహంకారము గల వారు, దుష్ట బుద్ధులు, మరియు మూర్ఖులునగు భృగ్వాది ఋషులు కూడా మహాప్రభువగు మహేశ్వరుని ఉపహాసము చేసిరి (31).
ఇచట నున్న బ్రాహ్మణులలో ఎవరైతే రుద్రుని యందు నీవు వలెనే విముఖత గల దుష్టులో, వారిని రుద్రుని తేజస్సు యొక్క మహిమను గలవాడనగు నేను శపించుచున్నాను (32). మీరు వేదములయందలి అర్థవాదముల యందు మాత్రమే శ్రద్ధగలవారై, వేద తత్త్వము నెరుంగజాలని బహిర్ముఖులై, నిత్యము ఇతరము మరి ఏదీ లేదని పలికే విప్రులు అగుదురు గాక! (33).
ఓ విప్రులారా! మీరు కామనలతో నిండిన మనస్సు కలవారై, స్వర్గమే సర్వస్వమనే ధారణ గలవారై, క్రోధ లోభ గర్వములతో కూడియున్నవారై, సిగ్గును వీడిన నిత్య యాచకులై అగుదురు గాక! (34) ఓ బ్రాహ్మణులారా! మీరు వేదమార్గమును వీడి శూద్రులచే యాగములను చేయించి, ధనమును సంపాదించుటయే ధ్యేయముగా గల దరిద్రులు అగుదురు గాక! (35)
ఓ దక్షా! దుష్టులనుండి దానములను స్వీకరించు వీరందరు నరకమును పొందగలరు. మరికొందరు బ్రహ్మ రాక్షసులగుదురు (36). ఎవడైతే శివుని దేవతలలో ఒకనిగా భావించి, ఆ పరమేశ్వరుని విషయములో ద్రోహబుద్ధిని కలిగియుండునో, అట్టి దుష్టబుద్ధియగు దక్షుడు తత్త్వము నుండి విముఖుడగును (37).
దక్షుడు గృహస్థుడై కుట్రలే ధర్మముగా గలవాడై, నిత్యము తుచ్ఛ సుఖములను కోరి కర్మ తంత్రమును విస్తరించువాడై, ఇదియే శాశ్వత వేద ధర్మమని భ్రమించి (38), ముఖములో ఆనందము లేనివాడై, ఆత్మ జ్ఞానమును విస్మరించి, పశువువలె అజ్ఞానియై, కర్మ భ్రష్టుడై, నిత్యము నీతి మాలిన వాడై అగును. ఈ దక్షుడు తొందరలో మేక ముఖము కలవాడగును (39).
దక్షుడు ఈశ్వరుని శపించగా, కోపించిన నంది అచటి బ్రాహ్మణులను శపించగా, అచట పెద్ద హాహాకారము బయలుదేరెను (40). నేనా మాటలను విని ఆ దక్షుని, భృగ్వాది బ్రాహ్మణులను కూడ అనేక పర్యాయములు నిందించితిని. వేద ప్రవర్తకుడనగు నేను శివతత్త్వము నెరుంగుదును గదా! (41) సదాశివుడు నంది యొక్క వచనములను విని చిరునవ్వును అల్పముగా ప్రకటించి, ఆతనికి బోధించగోరి ఈ మధుర వాక్యములను పలికెను (42).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
14 Dec 2020
No comments:
Post a Comment