✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚
శ్లోకము 7
🍀 7 - 1. ఆత్మ తత్వము - స్వభావముపై స్వామిత్వము సాధించినవాడు ప్రశాంతు డగును. అట్టివాడు చలి - వేడిమి, సుఖము - దుఃఖము, ప్రశంస - అవమానములను సమదృష్టితో దర్శించగలడు. పరమాత్మను చేరుటకు సమర్థుడగును. ఆత్మయనగ పరమాత్మ. ఆత్మ యనగ జీవాత్మ. జీవాత్మయే ప్రత్యగాత్మ. అతడు బుద్ధియందున్నపుడు, చిత్తమునం దున్నపుడు, స్వభావము నందున్నపుడు, యింద్రియములం దున్నపుడు, కర్మేంద్రియములం దున్నపుడు కూడ తానే యున్నట్లు భావించును. నేను అను ప్రత్యగాత్మ శరీరమున యింద్రియముల యందు, స్వభావమునందు, బుద్ధియందు సంస్కారమును బట్టి, చేయు పనులను బట్టి యుండును. ఉత్తమ సంస్కార మున్నపుడు ఆత్మ బుద్ధియందుండి ప్రపంచమున మనస్సు, యింద్రియములు, శరీరము సౌకర్యముగ (వాహనముగ) వినియోగించును. కేవలము ఆలోచనాపరుడుగ నున్నపుడు స్వభావములోనికి సంసరణము చెంది సగటు మానవ ప్రజ్ఞగ యుండును. అపుడు “నేను” అనియే భావించును. 🍀
జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః |
శోతోష్ణ సుఖదు:ఖేషు తథా మానావమానయోః || 7
స్వభావముపై స్వామిత్వము సాధించినవాడు ప్రశాంతు డగును. అట్టివాడు చలి - వేడిమి, సుఖము - దుఃఖము, ప్రశంస - అవమానములను సమదృష్టితో దర్శించగలడు. పరమాత్మను చేరుటకు సమర్థుడగును. ఆత్మయనగ పరమాత్మ. ఆత్మ యనగ జీవాత్మ. జీవాత్మయే ప్రత్యగాత్మ. అతడు బుద్ధియందున్నపుడు, చిత్తమునం దున్నపుడు, స్వభావము నందున్నపుడు, యింద్రియములం దున్నపుడు, కర్మేంద్రియములం దున్నపుడు కూడ తానే యున్నట్లు భావించును.
ఇట్లు తాను నడచుచున్నానని భావించినపుడు తాను అనగా శరీరమని అర్థము. చూచు చున్నపుడు, విను చున్నపుడు, తినుచున్నపుడు, తానే చూచు చున్నానని, విను చున్నానని, తినుచున్నానని భావించును. అపుడు తాను యింద్రియములందున్న "నేను." అట్లే భావించు చున్నపుడు భావములన్నియు స్వభావము నుండి వచ్చును గనుక, అచ్చట నున్న నేను మనస్సుయందున్న నేను. అదే విధముగ బుద్ధి యందున్నపుడు కూడ “నేను” అనియే భావించును. అపుడు ఆత్మ బుద్ధితో కూడియున్నదని తెలియవలెను.
ఇట్లు నేను అను ప్రత్యగాత్మ శరీరమున యింద్రియముల యందు, స్వభావమునందు, బుద్ధియందు సంస్కారమును బట్టి, చేయు పనులను బట్టి యుండును. ఉత్తమ సంస్కారమున్నపుడు ఆత్మ బుద్ధియందుండి ప్రపంచమున మనస్సు, యింద్రియములు,
శరీరము సౌకర్యముగ (వాహనముగ) వినియోగించును. కేవలము ఆలోచనాపరుడుగ నున్నపుడు స్వభావములోనికి సంసరణము చెంది సగటు మానవ ప్రజ్ఞగ యుండును. అపుడు “నేను” అనియే భావించును. మరింత దిగజారినపుడు కేవలము తినుట, వినుట, చూచుట, స్పర్శించుట యిత్యాది పానీయాదులు యిమిడి, అనగా యింద్రియముల యందు యిమిడి యుండిపోవును. ఇట్టివారు మానవ రూపముననే యున్నను పశువులతో సమానమై యుందురు.
కేవలము శరీరమే తా మనుకొనువారు దాని పోషణము కొరకు మాత్రము జీవించువారు మానవులలో అందరికన్న చిన్నవారు. ఇన్ని స్థితులలోనికి ఆత్మయే అవరోహణము చెందుచున్నది. జీవాత్మ బుద్ధిలో యుండవచ్చును. స్వభావములో (మనస్సులో) నుండవచ్చును. ఇంద్రియములలో నుండవచ్చును. శరీరములోనికి కూడ దిగవచ్చును. ఇవి యన్నియు తాను ప్రవేశించు వ్యూహములు. గృహముల వంటివి. ఇవియన్నియు కాక తా నున్నాడు. తాను అహర్నిశలు పై స్థితులలో నిలుచుచుపోయినచో తన నిజస్థితి మరచును.
తాను శరీరమునం దున్నాడు కాని శరీరము తాను కాదు అని తెలియవలెను. తాను ప్రపంచమును యింద్రియములద్వారా అనుభవించుచున్నాను కాని తాను యింద్రియములు కాదు. తాను మనస్సుద్వారా స్వభావమునుండి వెలువడుచున్న భావనలయందు ప్రవేశించుచున్నాడు. కాని తన భావములే తాను కాదు. తాను బుద్ధియను కక్ష్యనుండి ప్రకాశించుచున్నాడు. ఆ ప్రకాశమునకు కూడ తానే ఆధారము. తా నాధారముగనే తన ప్రకాశమున్నది. అట్లే తా నాధారముగనే తన భావములు, కోరికలు, శరీరము ఉన్నవి. ఇవి యన్నియు కాక తా నెట్లున్నాడు? నేను, తాను అని మనము పదే పదే పలుకు పదమునకు అర్థమేమి? తాను ప్రవేశించు కక్ష్యలు తాను కాదు గదా!
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
23 Feb 2021
No comments:
Post a Comment