రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴
92. అధ్యాయము - 04
🌻. దేవి దేవతలనోదార్చుట - 3 🌻
శివుడు ఈ తీరున కాముకుని వలె విరహ దుఃఖముతో నిండిన పలుకులను పలుకుచూ, కాముకుల ప్రవృత్తిని లోకమునకు ప్రదర్శించువాడై లీలను ప్రకటించెను (39). పరాజయము లేని ఆ పరమేశ్వరుడు యథార్థముగా వికారము గలవాడు, దీనుడు కాదు. శివస్వామి పరిపూర్ణుడు, మాయను వశము చేసుకున్న సర్వేశ్వరుడు (40).
ఆయనకు మోహముతో గాని, కామముగాని ప్రయోజనమేమున్నది? మాయ యొక్క లేపము లేని ఆ ప్రభువునకు వికారము కలుగట యెట్లు సంభవము?(41). ఆ రుద్ర ప్రభుడు నన్ను వివాహమాడ వలెనని తీవ్రమగు కోర్కెను కలిగి యున్నాడు. ఓ దేవతలారా! నేను మేనా హిమవంతుల గృహములో భూమిపై అవతరించవలెనని కూడా ఆయన కోరుచున్నాడు (42).
ఈ కారణముచే నేను రుద్రనకు సంతోషమును కలిగించుట కొరకై లోకపు పోకడననుసరించి హిమవంతుని భార్యయగు మేన యందు అవతరించెదను (43). నేను భక్తితో ఘోరమగు తపస్సును చేసి రుద్రునకు ప్రియురాలనై దేవతల కార్యమును చేసెదను. ఇది ముమ్మాటికీ సత్యము. సందేహము లేదు (44).
మీరందరు మీమీ గృహములకు వెళ్లి, నిత్యము శివుని ఆరాధించుడు. ఆయన దయచే దుఃఖములన్నియూ నశించుననుటలో సందేహము లేదు (45). నేను దయానిధియగు ఆయన దయచే ఆయనకు భార్యనై ఆ కారణముగా నేను ముల్లోకములలో నమస్కరింపదగిన దానను, పూజింపదగిన దానను కాగలను. ఆయన కృపచే సర్వమంగళములు సంపన్నము కాగలవు (46).
బ్రహ్మ ఇట్లు పలికెను -
కుమారా! ఆ జగన్మాత ఇట్లు పలికి, దేవతలు చూచుచుండగా అంతర్ధానమై, శీఘ్రముగా తన లోకమును చేరెను (47). విష్ణువు మొదలగు దేవతలు, మరియు మునులు అందరు ఆమె వెళ్లిన దిక్కువైపు నమస్కారము చేసి తమ తమ స్థానములకు వెళ్లిరి (48).
ఓ మహర్షీ! దుర్గాదేవి యొక్క పుణ్యచరిత్రను నీకీతీరున వర్ణించి చెప్పితిని. ఇది మానవులకు సర్వదా సుఖమును, భక్తిని, ముక్తిని ఈయగలదు (49). ఎవడైతే దీనిని నిత్యము వినునో, స్థిరచిత్తముతో వినిపించునో, లేదా పఠించునో, లేక పఠింపజేయునో, అట్టివాడు సర్వకామనలను పొందును (50).
శ్రీ శివ మహాపురాణములో రెండవది యగు రుద్ర సంహితయందు మూడవది యగు పార్వతీ ఖండములో దేవతల నోదార్చుట అనే నాల్గవ అధ్యాయము ముగిసినది (4).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
24 Feb 2021
No comments:
Post a Comment