అస్తిత్వమంతా ప్రేమతో, స్వేచ్ఛతో ఉంది.


🌹. అస్తిత్వమంతా ప్రేమతో, స్వేచ్ఛతో ఉంది. 🌹

🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀

✍️. భరత్‌,
📚. ప్రసాద్ భరద్వాజ


మీరు గతం, భవిష్యత్తుల నుంచి బయటపడి ఒక చెట్టు దగ్గర కూర్చుని, రోజూ దానితో మాట్లాడితే అది మీ మాటలకు స్పందిస్తున్నట్లు మీకు త్వరలోనే తెలుస్తుంది. కానీ, దాని స్పందన మాటల్లో ఉండదు. మీరు ప్రేమతో దానిని ఆనుకుని కూర్చుంటే అది గాలిలో ఊగుతూ మీపై పూలు కురిపిస్తుంది. వెంటనే మీలో ఇంతకు ముందెప్పుడూ కలగని ఒక నూతన అనుభూతి చోటుచేసుకుంటుంది. అలా ఆ చెట్టు మీకోసం ప్రేమతో స్పందిస్తుంది.

బాధపడే మానవుడు తప్ప మొత్తం అస్తిత్వమంతా ప్రేమతో, స్వేచ్ఛతో నిండి ఉంది. అందుకు మీరే బాధ్యులు తప్ప ఇతరులెవరూ కారు. నాతో చాలా మంది ‘‘మీరు చెప్పేది మాకు అర్థమయింది. మా బాధలను మేము నిదానంగా వదిలించు కుంటాము’’ అనేవారు. కానీ, అలా ఎప్పటికీ జరగదు.

ఎందుకంటే, బానిసత్వమనేది ఎప్పుడూ నినాదంగా పోయేది కాదు. దానిని అర్థం చేసుకునైనా మీరు అందులోంచి బయటపడాలి లేదా అది అర్థం కాకపోయినా అర్థమైనట్లుగా మీరు నటిస్తూనైనా ఉండాలి. స్వేచ్ఛ చిన్న చిన్న ముక్కలుగా రాదు. అలాగే, బానిసత్వం చిన్న చిన్న ముక్కలుగా పోదు.

గదిలో ఉన్న చీకటి దీపం వెలిగించిన వెంటనే పోతుంది. అంతేకానీ, కొద్దికొద్దిగా చీకటిపోవడం, కొద్దికొద్దిగా వెలుగు రావడం జరగదు. స్వేచ్ఛ అంటే మీరు అన్ని బంధనాల నుంచి పూర్తిగా బయట పడినట్లు. అంతేకానీ, అది కాలానికో, నిదానానికో సంబంధించిన విషయం కాదు.

బంధనాలన్నింటినీ తెంచు కోవడం తప్ప మీకు మరొక దారి లేదు.

వాటిని మీరే మీ చిన్నప్పటి నుంచి ‘‘పెద్దల పట్ల అణకువ, తల్లిదండ్రల పట్ల ప్రేమ, పూజారుల పట్ల నమ్మకం, గురువుల పట్ల గౌరవం’’ లాంటి మంచి మంచి పేర్లతో మీ చుట్టూ సృష్టించు కోవడం మొదలుపెట్టారు. మీరు బాగా లోతుగా పరిశీలించి చూస్తే అందమైన పేర్లతో బానిసత్వాన్ని మీకు బాగా అంటగట్టినట్లు తెలుసుకుని ఆశ్చర్యపోతారు. అది బానిసత్వం కాదని, మిమ్మల్ని బంధించే అందమైన పేర్లకు మీరు అతుక్కుపోయారని తెలుసుకోనంత వరకు వాటిని వదిలించుకోవడం మీకు చాలా కష్టమవుతుంది.

మా నాన్నతో నాకు ఎప్పుడూ గొడవే. ఆయన చాలా అవగాహన కలిగిన ప్రేమికుడే అయినా ‘‘నువ్వు ఆ పని చెయ్యాల్సిందే’’ అని నన్ను ఆజ్ఞాపించేవారు. అది నాకు నచ్చేది కాదు. అందుకే నేను ఆయనతో ‘‘అలా ఆజ్ఞాపించకండి. అది బానిసత్వ దుర్గంధం కొడుతోంది. ఆ కంపు నేను భరించలేను.

కావాలంటే ‘‘నీకు నచ్చితే చెయ్యి, లేకపోతే చెయ్యకు’’ అనండి. ఆ పని చెయ్యాలా, వద్దా అనేది నా ఇష్టం కానీ, మీ ఇష్టం కాదు. మీరు చెప్పిన పని చెయ్యాలో, వద్దో నన్ను ఆలోచించు కోనివ్వండి. నాకు నచ్చితే చేస్తాను, నచ్చకపోతే చెయ్యను. ఒకవేళ, ఆ పని నేను చెయ్యకపోతే మీరు కోపగించుకోకండి. నేను ‘‘మీ మాట పాటించను అనట్లేదు. అలా ఆజ్ఞాపించకండి, అంటున్నాను.

నేను సత్యానికి, స్వేచ్ఛకు, ప్రేమకే తల వంచుతాను. వాటికోసం నేను అన్నింటినీ త్యాగం చేస్తాను. అంతేకానీ, బానిసత్వానికి నేను ఏమాత్రం తల వంచను. ఈ జీవితం నాది. నా బతుకు నన్ను బతకనివ్వండి. ఆ హక్కు నాకుంది. మీరు చాలా అనుభవజ్ఞులే. కాబట్టి, మీరు నాకు మంచి సలహాలు ఇవ్వవచ్చు, సూచనలు చెయ్యవచ్చు. అంతేకానీ, నన్ను ఆజ్ఞాపించకండి. ఎలాంటి పరిస్థితిలోనూ నేను ఎవరి నుంచి ఎలాంటి ఆజ్ఞలను స్వీకరించలేను, వాటిని పాటించలేను’’ అనేవాడిని.

నేను ఎవరికీ తలవంచనని ఆయన త్వరగానే అర్థం చేసుకున్నారు. దాంతో ఆయన నన్ను ఆజ్ఞాపించడం మానుకుని ‘‘ఈ పని చెయ్యాలి. నీకు నచ్చితే చెయ్యి. లేకపోతే, నీ ఇష్టం’’ అనేవారు నాతో. వెంటనే నేను ‘‘అసలైన ప్రేమ ఇలా ఉండాలి’’ అనే వాడిని ఆయనతో.

ఏది అసలైన స్వేచ్ఛ?... చాలావరకు రాజకీయ పరమైన, ఆర్థికపరమైన, బాహ్య స్వేచ్ఛలు మీకు ఎవరో ఇచ్చినవే కాబట్టి, అవి ఏ క్షణంలోనైనా మీ నుంచి పోయేవే. అందుకే అవి ఎప్పుడూ మీ చేతుల్లో ఉండవు.

ఇంకా వుంది...

🌹 🌹 🌹 🌹 🌹


03 Apr 2021

No comments:

Post a Comment