శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 246 / Sri Lalitha Chaitanya Vijnanam - 246


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 246 / Sri Lalitha Chaitanya Vijnanam - 246 🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము :

🍀 60. చరాచర జగన్నాథా, చక్రరాజ నికేతనా ।
పార్వతీ, పద్మనయనా, పద్మరాగ సమప్రభా ॥ 60 ॥ 🍀

🌻 246. 'పార్వతీ' 🌻

పర్వతరాజ పుత్రి శ్రీదేవి అని అర్థము. హిమవత్ పర్వతునకు పుత్రికగ జనించి కఠోర తపస్సు గావించి మరల పరమేశ్వరుని శ్రీమాత చేరినది. పర్వతుడు పూర్వము సంతానమునకై చేసిన తపః ఫలముగ శ్రీమాత అతని కుమార్తెగ జన్మించినది. దక్ష యజ్ఞమున భంగపడిన సతీదేవి అగ్ని నుద్భవింపజేసి అందు తన దేహమును ఆహుతి చేసెను.

అట్లు చిదగ్నికుండము చేరెను. మరల శివుని జేరుటకు తపస్సు ఆవశ్యక మయ్యెను. హితము కోరి పరమ శివుడు వారించినను పుట్టినిల్లు మమకారముతో దక్షుని గృహమున కేగి అవమాన పడెను. పెనిమిటి జ్ఞానమునకే పెనిమిటి. అట్టివాని మాట పెడచెవిని పెట్టుట, అవమాన పడుట కారణముగ పశ్చాత్తాపము చెంది పరమ శివుని అనుగ్రహము కొఱకు మరల తపస్సునకు పూనుకొనెను. శంకరుడు రౌద్రుడై దక్షుని యజ్ఞమును ధ్వంసము చేసి మహోగ్రుడై వారింపరాని రౌద్రమూర్తి అయ్యెను.

తన రౌద్రమును తానే ఉపశమించు కొనుటకై అతడును దీర్ఘమగు తపస్సును సంకల్పించెను. రుద్రుడు తపస్సు మార్గమున శంకరుడై వాత్సల్యమూర్తియైన గాని తనను మరల మన్నింపడని తెలిసిన శ్రీమాత, తాను సంకల్పించిన తపస్సునకు అపరిమితమగు దృఢము, స్థిరము వుండవలెనని భావించి, అమిత దృఢుడైన హిమవత్ పర్వత రాజునకు జన్మించెను. అట్లు పార్వతి యయ్యెను. అచంచలము, అసామాన్యము, అనుపమానము అగు తపస్సుతో శివుని మెప్పించి అతని అర్ధాంగి అయినది పార్వతీదేవి.

పార్వతి అను శ్రీమాత నామము సంకల్పమునకు దృఢత్వము, స్థిరత్వము నీయగలదు. పట్టుదలకు మారు పేరు పార్వతి నామము. ఈ నామ స్మరణము సాధకులకు పట్టుదలను అనుగ్రహింప గలదు. హిమవత్ పర్వత శ్రేణిలో గల నొక నదీ ప్రవాహమును కూడ పార్వతి అని పిలుతురు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 246 🌹

1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj



🌻 Pārvatī पार्वती (246) 🌻

She is the daughter of Himavān, the king of mountains and wife of Śiva. Nāma 634 also conveys the same meaning.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹


03 Apr 2021

No comments:

Post a Comment