గీతోపనిషత్తు - సాంఖ్య యోగము : 10. మార్పు - మహత్మ్యము


🌹. 10. మార్పు - మహత్మ్యము -
నేను అను ఈ ప్రజ్ఞ గుణాతీతము, కాలాతీతము కూడ! దీనినుండి సమస్త భావములు, కాలానుసారముగ వృద్ధి చెంది, ప్రవర్తించి, ఈ నేనను ప్రజ్ఞలో మరల కలియుచున్నవి.
🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 18, 19, 20, 21 📚

ఈ సృష్టి మొత్తమును పరిశీలించి చూచినచో సమస్తమును మార్పు చెందుచున్నట్లు గోచరించును. మార్పు చెందు ఈ సమస్తమునకు మార్పు చెందని ఒక కేంద్రము కలదు. అది మార్పు చెందువానిలో మార్పు చెందక యుండును. అది ఆధారముగా సమస్తమును ఉద్భవించి, వృద్ధిపొంది, లయమగు చున్నది.

ఉద్భవము, వృద్ధి, లయము, మరల ఉద్భవము, అనంతముగా సాగుచుండును. లయమైనపుడు వృద్ధిపొందిన విషయము సూక్ష్మమై ఈ కేంద్రమునందు యిమిడి యుండును. మరల కాలము ననుసరించి ఉద్భవించుట, వృద్ధిపొందుట జరుగుచున్నది.

అన్తవన్త ఇమే దేహా నిత్యస్యోక్తా: శరీరిణ: |
అనాశినో ప్రమేయస్య తస్మాత్ యుధ్యస్వ భారత || 18

య ఏనం వేత్తి హన్తారాం యశ్చైనం మన్యతే హతం |
భౌ తౌ న విజానీతో నాయం హన్తి న హన్యతే || 19

న జాయతే మ్రియతే వా కదాచిన్
నాయం భూత్వా భవితా వా న భూయ: |

అజో నిత్య: శాశ్వతోయం పురాణో
న హన్యతే హన్యమానే శరీరే || 20

వేదావినాశినం నిత్యం య ఏనమజమవ్యయమ్ |
కథం స పరుష: పార్థ కం ఘాతయతి హన్తి కం || 21

ఉదాహరణకు మనలో బాల్యము నుండి వృద్ధాప్యము వరకు అనుదినము మార్పులు జరుగుచునే యున్నప్పటికీ దైనందినముగ ఆ మార్పులను మనము గమనించము.

కారణమేమన సహజముగా మార్పు చెందని ఆ కేంద్ర ప్రజ్ఞయే మనము. మనమాధారముగా అనేక భావములు కలిగినవి. ఆ భావములు మార్పు కూడ చెందినవి. భాషణములు కూడ అట్లే! ఎన్నెన్నో భావములు, భాషణములు, చేతలు, వాియందు ఎన్నెన్నో మార్పులు! ఇన్ని యందు ' నేనున్నా''నను ప్రజ్ఞకు ఏ మార్పూలేదు.

ఈ ప్రజ్ఞ గుణాతీతము, కాలాతీతము కూడ! దీనినుండి సమస్త భావములు, కాలానుసారముగ వృద్ధి చెంది, ప్రవర్తించి, ఈ నేనను ప్రజ్ఞలో మరల కలియుచున్నవి.

ఈ ప్రజ్ఞనే ఆత్మ యందురు. అది నిత్యముగను, నాశరహితముగను, కొలతలకు అతీతముగను, జనన మరణముల కతీతముగను ఉండును.

ఉండుటయే దీని సహజ లక్షణము. దీనినుండి పుట్టిన వానికి చంపుట, చచ్చుట ఇత్యాది లక్షణము లుండును. ఇది మాత్రము శాశ్వతముగ నుండును.

కావుననే భీష్మాదులు మరణించినను, మరణించుట అనగా ఆ మరణము వారి దేహములకు, భావములకే గాని, వారికి కాదని, వారింతకు ముందు కలరని, ఇక ముందును ఉందురని భగవానుడు తెలిపెను. వారిని దేహములుగా కాక దేహులుగా అనగా దేహములను ధరించిన వారిగా చూడుమని జ్ఞానదృష్టి కల్పించబూనెను.

దేహములు నిత్యము కావనియు, దేహులు నిత్యులనియు, చంపకుండినను దేహములు కాలక్రమమున మరణించుననియు,

అట్టి దేహములు ధర్మ యుద్ధమున మరణించుటచే అందలి ప్రజ్ఞలకు ఉత్తమ సంస్కారములు కలుగుననియు, కావున యుద్ధము చేయుమనియు భగవానుడు బోధించినాడు.

ఇందొక మహోపదేశము కలదు. ''దేహి నిత్యుడు కావున దేహమును ధర్మాచరణమునకై వినియోగించుచు, అట్టి ఆచరణమున వలసినచో మరణించుటకైనను మానవుడు వెనుతీయరాదని'' ఉపదేశము.

ధర్మము ఎటు పోయినను మనము ఉండవలె ననుకొనుట కాక, మనకేమైనను ధర్మము నిలబెట్టుట గీత ప్రతిపాదించు ముఖ్యమైన సూత్రము.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment