🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 33 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. శ్రేయోమార్గము - ప్రేయోమార్గము - 22 🌻
అట్లాగే మన నిజజీవితంలో కూడా జగత్ వ్యవహారమునకు, జగత్ వ్యాపారమునకు సంబంధించి అనేక సూచనలని, సలహాలని, అవగాహనలని, ఆక్షేపణలని, ఆశ్రయాలని అందించేటటువంటివారు కోకొల్లలుగా వుంటారు.
కాని నాయనా! ఆత్మనిష్ఠ గురించి మీరేమైనా తెలియజేయగలరా అని ప్రశ్నించాలట. అత్మానుభూతి మీరు పొందారా అని ప్రశ్నించాలట. అట్టి ఆత్మానుభూతి విషయమై ఆత్మనిష్ఠ విషయమై నాకు మీరు సహాయం చేయగలరా అని పరిప్రశ్న వేయాలిట. అలా ఎవరినైతే నీవు అర్ధిస్తావో, తప్పక నీకు సహాయం చేస్తాను ఆత్మనిష్ఠ విషయమై, తప్పక నీకు ఆత్మానుభూతి పొందేట్లుగా చేస్తాను అనే వాగ్ధానం చేయగలిగేటటువంటి ఆచార్యుడని ఆశ్రయించాలి.
కాబట్టి గురుపౌర్ణమి అంటే ఏమిటంటే హస్తమస్తక సంయోగము అనేటటువంటి పద్ధతి ద్వారా గురువుగారు నీకు ఈశ్వరుడు సాక్షిగా వాగ్ధానం చేస్తున్నారు. శిష్యుడు ఈశ్వరుడి సాక్షిగా గురుపాదమును ఆశ్రయిస్తున్నాడు. శరణాగతుడౌతున్నాడు. చరణాగతి కాదు అది, శరణాగతి. అంటే సంజ్ఞారూపకంగా కాళ్ళుపట్టుకుని ప్రార్ధిస్తున్నాం అన్నమాట. ఇంక అంతకుమించి ప్రార్ధించడానికి వేరే మార్గము లేదు కాబట్టి.
హృదయపూర్వకమైనటువంటి నివేదన, శరణాగతి. అటువంటి పద్ధతిగా మనం గురువును ఆశ్రయించాము. మానసిక ఆశ్రయాన్ని పొందటం. మనస్సుని హృదయ స్థానంలో నిలిపి ఉంచడమే అన్ని సాధనల యొక్క పరమగమ్యం.
కాబట్టి అన్ని తపస్సుల యొక్క ఉద్దేశ్యం ఏమిటంటే మనస్సుని హృదయస్థానమందు నిలిపి వుంచి స్వరూపజ్ఞాన విశేషంచేత నీవు జీవించడం. అట్లా జీవనం ఎవరైతే చేస్తారో వాళ్ళు సరియైనటువంటి విధానంలోకి ప్రవేశిస్తారనమాట. అటువంటివారు అతికుశలురైనటు వంటి గురువును ఆశ్రయిస్తున్నారు.
గురువు ఎటువంటి వాడయ్యా అంటే శిష్యునిలో ఏర్పడేటటువంటి కొద్దిపాటి మార్పులని కూడా చెప్పకనే గ్రహించగలిగేటటువంటి సమర్ధత ఆయన దగ్గర వుంది. అలా చూస్తేనే గ్రహిస్తాడు. వింటూనే గ్రహిస్తాడు. వినకుండా కూడా గ్రహిస్తాడు. అపరోక్షంగా కూడా చూడగలుగుతాడు. నిన్ను నీడలాగా వెంబడిస్తూ వుంటాడు. నీ హృదయస్థానంలోనే నిలకడైనటువంటి స్థానం కలిగి వుండి నీలో కలుగుతున్నటువంటి మార్పులన్నిటినీ గ్రహిస్తాడు. ఆ రకంగా నువ్వు గురువుని నీ హృదయస్థానంలో నిలుపుకోవాలి.
ఆ రకమైనటువంటి మానసిక ఆశ్రయాన్ని పొందేటటువంటి కుశలత్వాన్ని సంపాదించాలి. నైపుణ్యాన్ని సంపాదించాలి. అప్పుడేమౌతావు. సర్వార్పణ అయిపోతావు అనమాట. అట్లా ఎవరైతే సర్వార్పణైనటువంటి శరణాగతి స్థితిని అనుభవిస్తున్నారో వాళ్ళు ఉత్తమగతి చెందేటటువంటి అవకాశం కలుగుతుంది.
ఇంకా ఇందులో ఒక మర్మగర్భమైనటువంటి విశేషం కూడా వుంది. నూటికో కోటికో అనడంలో ఒక ఉద్దేశ్యం వుంది. తెలుసా మీకు ఎవరికైనా? సాధారణంగా అందరూ అంటుంటారు - ఎక్కడో నూటికో కోటికోనండీ అంటుంటారు. అంటే శతజన్మలకి ఒకసారి ఈ అవకాశం వస్తుంది.
వందసార్లు పుట్టి పోతే, శత జన్మలకు - శతజన్మల ఆయుర్దాయం - వంద వందలు - అంటే ఎంత- పదివేల సంవత్సరాలకి ఒకసారి నీకు ఈ ఆత్మనిష్ఠని పొందాలి అనే ఆసక్తి కలుగుతుంది. అటువంటి ఆసక్తిని ఏదో ఒక ప్రతిబంధకాలని ఉద్దేశించి, ఏదో ఒక సమస్యలనుద్దేశించి, ఏదో ఒక తాత్కాలికమైన అంశాలని ప్రాధమ్యాలుగా స్వీకరించి ఆత్మానుభూతి కొరకు చేసేటటువంటి ప్రయత్నాన్ని విరమించడం అనేది అత్యంత హీనమైనటువంటిది. ధన్యత చెందే అవకాశం శతజన్మలకి ఒకసారి వస్తుంది.
ఇంకా కోటికో అంటాం.. తెలుసా మీకెవరికైనా. ‘కోటికో’ అనడం వెనక ఉద్దేశ్యం ఏమిటంటే ఒక్కొక్క పర్యంతము క్రిమికీటకాదుల జన్మలతో గనక నువ్వు ప్రారంభించినట్లయితే కోటి జన్మలకి ఒకసారి కూడా లభించే అవకాశం వుండదు. అన్నిసార్లు పుట్టిపోతూ వుంటావు. ఏ వంద జన్మలకో, ఏ కోటి జన్మలకో గాని నీకు ఆత్మనిష్ఠని పొందాలి అనేటటువంటి బలమైన నిర్ణయం కలగడం లేదు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment