గీతోపనిషత్తు - 50





🌹.   గీతోపనిషత్తు - 50   🌹

🍀 10 అసక్తత - సమాచరణము - నిష్కామ కర్మమే మోక్షమునకు మార్గమని, అట్లు నిర్వర్తించినవానికి మోక్షము అరచేతి యందుండునని, ఇది తన శాసనమని, అనుపానముగ ఫలాపేక్షలేక, కర్మాచరణము అనునిత్యము జరుగవలెనని తెలుపుచున్నాడు. 🍀

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


📚.   కర్మయోగము - 19   📚

ఆసక్తి లేక కర్మ లాచరించిన వానికి పరమపదము లభించగలదని ఈ సూత్రము తెలుపుచున్నది. ఆసక్తి లేక కర్మ లెట్టాచరించగలరు? ఆసక్తి లేనివా డేపనియు చేయడే! దీని రహస్యమేమి? భగవంతుడు గీతయందు పలుమార్లు "అసక్తః" అని పలుకుతుంటాడు.


19 . తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర |

అసక్తో హ్యాచరన్కర్మ పరమాప్నోతి పూరుషః || 19 ||


ఈ పలికిన అసక్తత ఫలములకు సంబంధించినది. పనికి సంబంధించినది కాదు. పనిచేయు వానికి పనియందే ఆసక్తి యుండవలెను గాని ఫలమునందు కాదు.

ఫలము నందాసక్తత యున్నవానికి పని యందు శ్రద్ధ చెడును. పని యందు శ్రద్ధ యున్న వానికి పనియే సౌఖ్యము నిచ్చును. ఫలములు పొందుట, పొందక పోవుట అతనిని బాధించవు. పని యందు సక్తుడవు కమ్ము, ఫలముల యందసక్తుడవు కమ్ము.

ఇచ్చట పని యనగా పరహితముతో కూడినది అని మరల మరల చెప్పనక్కరలేదు. నియత కర్మను అనగా చేయవలసిన కర్మను ఫలముల యందాసక్తి లేక యజ్ఞార్థముగ ఆచరించవలెనని భగవానుడు పలుకుతునే యున్నాడు.

నిజమునకు ఫలముల యందాసక్తి లేకుండ కర్మ నాచరించవలెనని ఈ అధ్యాయమున 7వ శ్లోకము నందు, 9వ శ్లోకమునందు పలికినాడు. అట్లాచరించినచో పరమును లేక దైవమును పొందవచ్చని వాగ్దానము చేయుచున్నాడు.

నిష్కామ కర్మమే మోక్షమునకు మార్గమని, అట్లు నిర్వర్తించినవానికి మోక్షము అరచేతి యందుండునని, ఇది తన శాసనమని తెలిపినాడు.

పై శాసనమునకు అనుపానముగ ఫలాపేక్షలేక, కర్మా చరణము అనునిత్యము జరుగవలెనని తెలుపు చున్నాడు. “సతతం” అని పలుకుటలో ఫలాసక్తి శాశ్వతముగ విసర్జించ బడవలెనని తెలుపుచున్నాడు.

ఫలాసక్తి లేనిచో ఏ కార్యమైనను చేయవచ్చునా? అను సందేహమును గూడ నివృత్తి చేయుటకై “కార్యం కర్మ"ను ప్రస్తావించి నాడు. అనగా తాను చేయవలసినపని ఫలాసక్తి లేక ఎల్లపుడు చేయవలెనని. ఫలాసక్తి లేక చేయవలసిన పని చేయువాడు ఎట్లైనా చేయవచ్చునా? అను సందేహమును నివారించుటకు "సమాచర” అని తెలిపినాడు.

సమాచరణ మనగా సమ్యక్ ఆచరణము. సమ్యక్ ఆచరణ మనగా ఎక్కువ తక్కువలు లేక నిర్వర్తించుట. అనగా కర్మ నిర్వర్తనము ఒక నిర్మల ప్రవాహమువలె సాగవలెనుగాని ఒడుదొడుకులతో కాదని యర్థము. మార్గమున ఒడుదొడుకులున్నను ప్రవాహ వేగమునకు ఒడుదొడుకులు అవసరము లేదు.

కొన్ని దినములు విపరీతముగ పనిచేయుట, కొన్ని దినములు చతికిల పడుటగా కర్మ జరుగరాదు. జరుగు కర్మయందు, వేగము నందు ఒక నిశ్చలత యుండవలెను. భూమి, ఇతర గ్రహములు చరించు విధానము సమాచర అను పదమునకు తగినట్లుగ నుండును.

వృక్షముల యొక్క పెరుగుదల యందు గూడ ఈ లక్షణములు చూడవచ్చును. సమాచరణము సృష్టి ప్రవాహమునకు ముఖ్య లక్షణము.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్


11 Oct 2020

No comments:

Post a Comment