రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
55. అధ్యాయము - 10
🌻. బ్రహ్మకు జ్ఞనోదయమగుట - 3 🌻
విష్ణువు ఇట్లు పలికెను -
హే బ్రహ్మన్ ! మనమిద్దరము శంకరుని సంకల్పముచే జన్మించిన సమయములో ఆయనను మనము ప్రార్థించగా, మనలను ఉద్దేశించి ఆయన అపుడు చెప్పిన పలుకులను గుర్తుకు తెచ్చుకొనుము (48).
నీవా వృత్తాంతమునంతనూ మరచితివి. శాంభవీ పరాదేవి ధన్యురాలు. ఆమె చే జగత్తు సర్వము మోహింపబడినది. శివుడు తక్క ఇతరులు ఆమెను ఎరుంగజాలరు (49).
శివుడు తన ఇచ్ఛచే నిర్గుణ స్వరూపము నుండి సగుణుడై నన్ను సృష్టించి, ఆ తరువాత నిన్ను సృష్టించెను. ఆయన తన శక్తితో లీలలను సృష్టించును (50).
అపుడు శంభుప్రభువపు నిన్ను సృష్టిని చేయుమని ఆదేశించెను. హే బ్రహ్మన్! దాని పాలనను నాకు అప్ప జెప్పెను. నాశరహితుడు ఉమా సహితుడునగు శివుడే వాస్తవముగా జగత్కారణమగును (51).
అపుడు మనిమిద్దరము దోసిలి యొగ్గి, సాష్టాంగ ప్రణామమును చేసి, మనస్థానములకు వచ్చితిమి. సర్వేశ్వరుడవగు నీవు కూడా గుణ సంహితుడవై రూపమును స్వీకరించి అవతరించుము (52).
అని మనము కోరగా, కరుణామయుడు అనేక లీలలను సృష్టించుటలో నిపుణుడు అగు ఆ ప్రభువు నవ్వి, ఆకాశము కేసి చూచి మిక్కిలి ప్రీతితో నిట్లనెను (53).
హే విష్ణో! నా శ్రేష్ఠమగు రూపము, నన్ను పోలిన రూపము, బ్రహ్మదేహమునుండి ప్రకటమై లోకములో రుద్రుడను పేర కీర్తింపబడును (54).
ఆ రుద్రుడు నా పూర్ణావతారము. మీరు ఆయనను సర్వదా పూజించుడు. ఆయన మీ కోర్కెలనన్నిటినీ ఈడేర్చును. త్రిగుణసాక్షి, నిర్గుణుడు, గొప్ప యోగమునకు ప్రవర్తకుడునగు ఆ రుద్రుడు లయమును చేయగలడు (55).
ఈ త్రిమూర్తులు నాకుమారులు. వారు నా స్వరూపమే రుద్రుడు విశేషించి నా పూర్ణాంశ గలవాడు. ఉమాదేవికి కూడ మూడు రూపములు ఉండగలవు (56).
ఆమె లక్ష్మి అను పేరుతో విష్ణువునకు భార్య యగును. సరస్వతి అను పేరుతో బ్రహ్మకు పత్నియగును. ఆమె పూర్ణరూపముతో సతియను పేరుగలదై రుద్రునకు భార్య కాగలదు (57).
మహేశ్వరుడు దయతో ఇట్లు పలికి అంతర్ధానమయ్యెను. మనము మనకు అప్పిగించబడిన కార్యముల యందు నిమగ్నులమై సుఖముగా నుంటిమి (58).
హే బ్రహ్మన్! మనము కాలము వచ్చుటచే వివాహమాడితిమి. శంకరుడింకనూ వివాహమాడలేదు.ఆయన స్వయముగా రుద్రుడను పేర అవతరించి కైలాసము నాశ్రయించి ఉన్నాడు (59).
హే ప్రజాపతీ! ఉమాదేవి సతియను పేర అవతరించును. ఆమె పుట్టుట కొరకు ప్రయత్నమును చేయవలెను (60).
విష్ణువు ఇట్లు పలికి మిక్కిలి దయను చూపి అంతర్దానమాయెను. నేను మిక్కిలి అధికమైన ఆనందమును పొందితిని. నాలోని ఈర్ష్య తొలగి పోయెను (61).
శ్రీ శివ మహాపురాణములోని రెండవది యగు రుద్రసంహితయందురెండవది యగు సతీ ఖండములో బ్రహ్మ విష్ణు సంవాదము అనే పదియవ అధ్యాయము ముగిసినది (10).
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
Join and Share చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group
https://t.me/ChaitanyaVijnanam
No comments:
Post a Comment