✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. ఆత్మను తెలుసుకొను విధము -03 🌻
కొద్దిగా విరమించినటువంటి స్థితిలో ఉంటాడు. కానీ చేసి ఒకటి రెండు పనులు, మూడు నాలుగు పనులు సామాన్య ధర్మం మేరకు, తన కర్తవ్యం మేరకు, తన ధర్మం మేరకు, తాను నిర్వహించేటటువంటి ఏ పనినైనా నూటికి వెయిపాళ్ళు సమర్థవంతంగా చేస్తాడు, సక్రమంగా చేస్తాడు. నిష్కామ కర్మగా చేస్తాడు. ఇది చాలా ముఖ్యమైనటువంటి లక్షణం.
ఈ నిష్కామ కర్మకు సరిపోయేటటువంటి వాటిని మాత్రమే ఆచరిస్తాడు. మిగిలినటువంటి వాటిని ఆచరించడు. సకామ్య కర్మ ఏదైనా సరే, అది తన కర్తవ్యంలో లేనిదిగా భావిస్తాడు. తన కర్తవ్యంగా ఎప్పుడూ భావించడు.
తన కర్తవ్యం కేవలం నిష్కామ కర్మ మాత్రమే. దీనికి సరిపడితేనే ఆ కర్మను అనుమతిస్తాడు. ఆ క్రియను అనుసరిస్తాడు. ఆ ఇంద్రియములను వ్యవహరింపజేస్తాడు. ఆ విషయాలలో ప్రవర్తిస్తాడు.
తదనుభవ రూపమైనటువంటి ఫలితమను నిరసిస్తాడు. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఫలితమును నిరసించగలిగేటటువంటి, విశేష లక్షణాన్ని నిరసించ గలిగేటటువంటి, సమర్థమైనటువంటి, తనదైనటువంటి, తానైనటువంటి స్థితియందు నిలకడ కలిగేటట్లుగా చేయటానికి, ఈ ఆంతరిక యజ్ఞంలో భాగంగా అయ్యేటటువంటి వాటిని మాత్రమే ఆచరిస్తాడు.
మిగిలినటువంటి వాటికి విరమణ, మౌనం వహిస్తాడు, చేయడు అన్నమాట ఇక. అప్పుడు ఏమైపోయినై అంటే, చేసేటటువంటి పనుల సంఖ్య పరిమితించబడుతుంది. తీవ్ర వ్యవహారములన్నీ పరిమితించబడిపోతాయి.
రజోగుణ, తమోగుణ ధర్మాలన్నీ విరమించబడుతాయి. ఎప్పుడైతే ఇవన్నీ విరమించబడుతాయో సాత్విక కర్మని కూడా నిష్కామ కర్మగా మాత్రమే చేస్తాడు. మిగిలిన వాటిని చేయడు. ఎందుకనంటే అవి వృధా. నిష్ప్రయోజనములు.
ఎందుకనటా? ఆంతరిక యజ్ఞం చేయడానికి అవి ఉపయోగపడడం లేదు. ఎవరైనా యజ్ఞం చేసేటప్పుడు యజ్ఞంలో హవిస్సులను అర్పించాలి అంతే కాని నీళ్ళు పోస్తారా? ఆ యజ్ఞం చల్లారి పోయేటట్లుగా చేయకూడదు.
ఇటువంటి ఆంతరిక యజ్ఞం మరింతగా ప్రజ్వలించి, ఎంతగా ప్రజ్వలించాలయ్యా అంగాటే, సర్వ వ్యాపకమైనటువంటి అనంత విశ్వమంతా తానే అయినటువంటి స్థితిని ప్రాప్తింపచేసేంతగా సూక్ష్మతరము, సూక్ష్మతమము చేసేటట్లుగా ఈ ఆంతరిక యజ్ఞాన్ని చేయాలి. ఇట్లా వేద విహత కర్మ అంటే, ఈ ఆంతరిక యజ్ఞమే! నిజానికి సర్వ యజ్ఞముల యొక్క లక్ష్యము కూడా ఈ ఆంతరిక యజ్ఞమే.
వేద విహితుడైనటువంటి బ్రాహ్మణుడు, నిత్యమూ చేయవలసినటువంటి కర్మ ఏమిటంటే, నిత్యకర్మ జ్యోతిష్టోమాది నిత్యకర్మ అంటారు. జ్యోతిష్టోమాది నిత్యకర్మ అంటే అర్థం ఏమిటంటే, ఈ ఆంతరిక యజ్ఞాన్ని సదా చేయాలి, 24 గంటలూ చేయాలి, మూడు అవస్థలలోనూ చేయాలి.
తురీయ స్థితిలో నిలబడేటంత వరకూ చేయాలి. తురీయస్థితిలో నిలబడటమే సత్యంగా, నిత్యంగా, లక్ష్యంగా ఎంచుకుని చేయాలి. కాబట్టి ఇట్టి ఆంతరిక యజ్ఞాన్ని, ఇదే జ్యోతిష్టోమాది కర్మ అంటే అర్థం.
అంతే కానీ, బాహ్యంగా చేసేటటువంటి యజ్ఞములు, యాగములు, హోమములు అన్నింటికీ కూడా ఈ అంతరిక యజ్ఞమే లక్ష్యార్థమై ఉన్నది, వాచ్యార్థమై ఉన్నది, వాచకమై ఉన్నది. కాబట్టి, బహిరంగంలో చేయబడేటటువంటివన్నీ కూడా కర్మ ఉపాసనలో భాగంగా వున్నాయి.
ఈ కర్మ ఉపాసన భాగంగా చేయబడుతున్నటువంటి సర్వ యజ్ఞములు, సర్వ కర్మలు, సర్వ యాగములు, హోమములు, ధ్యానములు, యోగములు, ఉపాసనలు, అర్చనలు, నవ విధ భక్తి మార్గములు అన్నీ కూడా ఆత్మనివేదన అనబడే ఆంతరిక యజ్ఞాన్ని ఆశ్రయించడం కొరకే.
ఈ ఆత్మనివేదన చేయటానికి అర్హమైనటువంటి స్థితిని సంపాదించి పెట్టేటటువంటి ఈ ఆంతరిక యజ్ఞాన్ని నిరంతరాయంగా ఎవరైతే చేస్తారో, వారిలో ఒక ఉత్తమ ఫలితం వస్తుంది. అది ఏమిటంటే, జ్ఞానాగ్ని లభిస్తుంది. జ్ఞానాగ్ని దగ్ధ సర్వకర్మాణం - అన్ని కర్మలు అందులో దహించుకుపోతాయి. అన్ని కర్తృత్వ అభిమానము, భోక్తృత్త్వ అభిమానము పూర్ణాహుతి చేయబడుతాయి.
ఇది ప్రతీ యజ్ఞంలోను, ప్రతీ యాగంలోను, ప్రతీ హోమంలోను చిట్టచివరికి వ్రేల్చబడేటటువంటి ఈ పూర్ణాహుతి అంటే అర్థం ఏమిటంటే, కర్తృత్వాభిమానమును-భోక్తృత్వాభిమానమును సర్వకర్మలను.
సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ|
అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః||
సర్వకర్మ పరిత్యాగం జరిగిపోతుందన్నమాట. కర్మ పరిత్యాగం అంటే కర్మఫల పరిత్యాగం. ఫలం లేకపోతే కర్మ యొక్క ప్రయోజనం లేదు.
అటువంటి ఫల పరిత్యాగ పద్ధతి అయినటువంటి, నిష్కామ కర్మ వేద విహిత కర్మలను, ఫలాపేక్ష లేక, ఆచరించువాని యొక్క చిత్తము నిర్మలమౌతుంది. ఇది చాలా ముఖ్యము.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
Join and Share చైతన్య విజ్ఞానం Chaitanya Vijnanam
https://www.facebook.com/groups/465726374213849/
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #కఠోపనిషత్ #చలాచలబోధ
11 Oct 2020
No comments:
Post a Comment