భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 133


🌹.   భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 133  🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. నారద మహర్షి - 7 🌻

53. ఉన్నది ఒకేనాదం అయినప్పటికీ; వాయువు యొక్క వికార భేదముల చేత పుట్టినటువంటి వర్ణములు, అలాగే స్వరములు, ఆ స్వర్ణాల్లోంచి వచ్చిన రాగాలు, రాగంలోంచి భావము – ఇవి మాత్రమే సంగీతానికి సరిపోవుకదా!

54. అందుకని ఆయన కొన్ని వస్తువులను కూడా సృష్టించాడు. మృదంగం, వేణువు – ఈ ప్రకారంగా ఇట్లాంటి వాయిద్యాలనుకూడా వర్ణించి ఆయన బ్రహ్మ దేవుడికి చెప్పినవి, సాక్షాత్తు పరమేశ్వరియైన సరస్వతీదేవి తనకు చెప్పిన జ్ఞానంనుండే.

55. ఆ వాద్యాలన్నీ ఆమెలోపల ఉండి నిద్రిస్తున్నాయి. ఆ విద్యను గ్రహించాడు. అంతకు ముందు ఆమెయందు పరా-పశ్యంతీ స్థాయిలలో ఉన్నదంతా కూడా బహిర్ముఖమై, మధ్యమా-వైఖరీ రూపంగా ఈయన కిచ్చింది. ఒకటేమో అవ్యక్తము, మరొకటేమో వ్యక్తము. తర్వాత నారదుడు తంత్రీముఖములందు, ఆహతము – అనాహతములనే గాన మాత్ర విశేషములను ఇచ్చాడు.

56. ఆహతము అంటే, రెండు వస్తువుల తాకిడిచేత వచ్చేశబ్దం; అనాహతం అంటే ఎలాంటి తాకిడీలేకుండా పుట్టే శబ్దం. హృదయంలోని చక్రానికి యోగశాస్త్రంలో ‘అనాహత’మని పేరు. అనాహతం అంటే, ఆహతంకాని శబ్దము, హృదయంలో ఉంది. యోగులు దానిని వింటారు.

57. ఇప్పుడు మనం ఉత్పత్తిచేస్తున్న – సంగీతంలో ఏయే దోషములు ఉన్నాయో, అవిలేకుండా ఆయన ఆది సంగీతవిద్వాంసుడుగా అక్కడ పాడాడు. ఆ గానంతో దేవతలందరూ సంతోషించారు. బ్రహ్మదేవుడుకూడా బహిర్ముఖంగా సంగీతం వినటం అప్పుడే మొదటిసారి.

58. అమ్మవారు కూడా తను ఆయనకు ఇచ్చిన విద్య మళ్ళీ వింటున్నది. బ్రహ్మ సంతోషించి నారదునితో, “నాయనా! నీ జీవితమంతా సంగీతమే! స్మగీతమే నీవు. అలాగే ఉండు శాశ్వతంగా.

59. నేకేమీ పనిలేదు. దైవకార్యం ఏదయినా చెయ్యటానికై నీకు ఏదయినా కర్తవ్యం అప్పుడప్పుడు పుడితే, దానిని చేస్తావు. అంతేకాని దానిఫలంతో నీకేమీ సంబంధం ఉండదు. ఈశ్వరుడియొక్క సంకల్పం ఏదయితే ఉంటుందో, అది ఎందుకై అవసరమని అనుకుంటారో, దానికి నిమిత్తకారణంగా ఏవో కొన్ని పనులు చేస్తూ ఉంటావు. ఆ పని అయిపోగానే నీకేమీ కర్తవ్యం ఉండదు. తిరుగుతూనే ఉంటావు’ అన్నాడు.

60. “మరి నన్నేమి చెయ్యమంటావు తండ్రీ?” అని అడిగితే, ‘ఇదిగో నీకు అష్టాక్షరి ఉపదేశం చేస్తున్నాను. అది శ్రీమహావిష్ణు తత్త్వం. ఆయన నాకు తండ్రి. ఆయన నాకు గురువు. నా పుట్టుకకు హేతువు. ఆయనను గురించి నాకు అంతే తెలుసు. విష్ణుతత్త్వాన్ని అంతా నీకు చెప్తాను” అన్నాడు బ్రహ్మ.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద


11 Oct 2020

No comments:

Post a Comment