రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
68. అధ్యాయము - 23
🌻. భక్తి మహిమ - 1 🌻
బ్రహ్మ ఇట్లు పలికెను -
ఈ విధముగా శంకరునితో విహరించి ఆ సతీదేవి సంతృప్తిని పొందెను. ఆమెకు గొప్ప వైరాగ్యము కూడా కలిగెను (1). ఒకనాడు సతీదేవి ఏకాంతమునందున్న శివుని వద్దకు వెళ్లి, మంచి భక్తితో చేతులు పైకెత్తి నమస్కరించెను (2). దక్షుని కుమార్తెయగు ఆ సతీదేవి దోసిలి యొగ్గి భక్తితో విమయముతో మిక్కిలి ప్రసన్నుడై యున్న ఆ ప్రభువునకు నమస్కరించి, తరువాత ఇట్లు పలికెను (3).
సతీదేవి ఇట్లు పలికెను -
దేవదేవా! మహాదేవా! కరుణా సముద్రా! ప్రభూ! దీనులనుద్ధరించువాడా! మహాయోగీ! నాపై దయను చూపుము (4). నీవు పరమ పురుషుడవు. సగుణుడవు. సాక్షివి, వికారములు లేనివాడవు, మహాప్రభుడవు (5). నేను నీ భార్యనై, నీతో విహరించి రమించుటచే ధన్యురాలనైతిని. ఓ హరా! భక్తులయందు నీకు గల ప్రేమ వలననే నీవు నాకు భర్తవైనావు (6).
నాథ! నేను అనేక సంవత్సరములు నీతో గూడి గొప్ప గా విహరించితిని. మహేశ్వరా! నాకు సంతోషము కలిగినది. నా మనస్సు ఇపుడు దానినుండి నివృత్తమైనది (7).
దేవదేవా! హరా! ఏ తత్త్వము నెరింగిన జీవుడు శ్రీఘ్రమే సంసారదుఃఖమును దాట గల్గునో, అట్టి మోక్షదాయకమగు పరతత్త్వమును తెలియ గోరుచున్నాను (8). నాథా! ఏ తత్త్వముచే విషయభోగరతుడగు జీవుడు పరమ పదమును పొంది సంసార విముక్తుడగునో, అట్టి తత్త్వమును దయచేసి చెప్పుము (9).
బ్రహ్మ ఇట్లు పలికెను -
ఓ మహర్షీ! ఆదిశక్తి మహేశ్వరి యగు ఆ సతి కేవలము జీవులనుద్ధరించుట కొరకై గొప్ప భక్తితో శంకరుని ఇట్లు ప్రశ్నించెను (10). తన ఇచ్ఛచే స్వీకరింపబడిన మూర్తి గలవాడు, యోగముచే విరక్తమైన బుద్ధిగలవాడు అగు శివస్వామి ఆ మాటను మిక్కిలి సంతసంచి సతీదేవితో నిట్లనెను (11).
శివుడిట్లు పలికెను -
దాక్షాయణీ! మహేశ్వరీ! దేవీ! కర్మవాసనలతో నిండియుండు జీవుడు దేవి వలన మోక్షమును పొందునో, అట్టి పరతత్త్వమును చెప్పెదను వినుము (12).
పరమేశ్వరీ! పరతత్త్వమనగా విజ్ఞానమని యెరుంగుము. ఆ విజ్ఞానము ఉదయించిన జ్ఞాని యొక్క శుద్ధమైన బుద్ధియందు 'నేనే బ్రహ్మను' అను స్మృతి కలుగును (13).
ఈ ముల్లోకములలో ఆ జ్ఞానము దుర్లభము. ఓ ప్రియురాలా! దానిని ఎరింగిన జ్ఞాని అరుదు.ఆతడు ఎవడైననూ,ఎట్టివాడైననూ సర్వదా నా స్వరూపుడే.ఆతడు సాక్షాత్తుగా పరాత్పర బ్రహ్మరూపుడై ఉండును (14).
నా యందలి భక్తి ఆ విజ్ఞానమునకు తల్లి. భుక్తి భుక్తి ముక్తులనే ఫలముల నిచ్చును. నా అను గ్రహముచే నాయందలి భక్తి తేలికగా కుదురును. ఆభక్తి తొమ్మిది విధములని చెప్పబడినది (15).
భక్తికి జ్ఞానమునుకు తేడా లేదు. భక్తిని చేయు వ్యక్తికి సర్వదా సుఖము లభించును. ఓ సతీ! భక్తిని విరోధించువానికి విజ్ఞానము కలుగనే కలుగదు (16).
ఓ దేవీ! నేను సర్వదా భక్తులకు అధీనుడనై యుందును. భక్తి ప్రభావముచే నేను ఉచ్చ నీచ భేదము, జాతి భేదము లేకుండ సర్వుల గృహములకు వెళ్లెదను. సందేహము లేదు (17).
ఓ దేవీ! ఆ భక్తి సగుణము, నిర్గుణము అని ద్వివిధముగ నున్నది. విధి విహితమై సహజముగా హృదయములో పుట్టిన భక్తి గొప్పది. దీనికి భిన్నముగా, కామనలచే ప్రేరితమై ఉదయించే భక్తి తక్కువది (18).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
30 Nov 2020
No comments:
Post a Comment