✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. ఆత్మను తెలుసుకొను విధము -47 🌻
కానీ గురువుగారి సూచన ఎటువంటిది అంటే, అప్రతిహతమైనటువంటిది, అనుల్లంఘనీయమైనటు వంటిది. ఎప్పుడూ కూడా దానిని ఉల్లంఘించకూడదు. ఆ సూచనని సుగ్రీవాజ్ఞగా స్వీకరించాలి. రామాజ్ఞగా స్వీకరించాలి.
అలా ఎవరైతే ఈశ్వరకార్యంలో, ఈశ్వరుని చేతిలో పనిముట్టుగా, సద్గురువు చేతిలో పనిముట్టుగా కేవల ఆత్మసాక్షాత్కార జ్ఞానం అనే లక్ష్యంతో, కేవలం ఆత్మనిష్ఠని ఈ జన్మలోనే పొందాలనే తీవ్ర మోక్షేచ్ఛ చేత, తీవ్ర వైరాగ్యం చేత, గుణాతీత పద్ధతిగా, త్రిగుణ వ్యవహారమును చక్కగా పరిశీలించి, దానికి అతీతమైనటువంటి సాక్షిత్వ దృష్టితో ఎవరైతే నిలకడకలిగి ఉంటారో, ఎవరైతే ఆ రకమైనటువంటి ప్రయత్నశీలత కలిగి ఉంటారో, వాళ్ళు మాత్రమే సద్గురువుకు శరణాగతులవ్వగలుగుతారు.
ఈ శరణాగతి స్థితి చాలా విశేషమైనది. అందుకే ఇక్కడ ఆజ్ఞ అనే పదం వేశారు. ఎవరైతే గురువుగారి ఆజ్ఞకులోబడి వర్తిస్తున్నారని గుర్తి్స్తున్నారో, వాళ్ళ యొక్క శరణాగతి స్థితి చేత, గురువు ఆకర్షింపబడుతూ ఉంటాడు. వాళ్ళ యొక్క శరణాగతి స్థితి చేత, ఈశ్వరుడు ఆకర్షింపబడుతూ ఉంటాడు. వాళ్ళ వాళ్ళ యొక్క నిత్యజీవనంలో వాళ్ళేమీ చేయక్కర్లేదు.
వాళ్ళ తరఫున ఈశ్వరుడు, ప్రకృతి అవే పని చేస్తుంటాయి. స్వయం చాలితంగా అతను సంకల్పించనక్కర్లేదు. స్వయం చాలితంగా అతనేమీ చేయనక్కర్లేదు. తగినటువంటి వ్యక్తి చేత, వ్యక్తిగత జీవన సమస్యలను అన్నింటినీ కూడా ఆ యీశ్వరుడే, ఆ ప్రకృతే పరిష్కరించేస్తుంది. ఈ రకంగా ఇచ్ఛా నిర్ణయములు లేక, జీవించేటటువంటి ఉత్తమమైన జీవన విధానానికి మానవుడు పరిణామము చెందాలి.
అసలు మానవుడంటేనే ఇచ్ఛానిర్ణయములు కదండీ! కోరికే లేకపోతే మానవుడెందుకు? అసలు నిర్ణయం చేయకపోతే మానవుదేందుకు? ఈ మానవజన్మలో ఉన్నటువంటి విశేషమే అది కదా! ఛాయిస్ ఆఫ్ ఆప్షన్ [Choice of option] అంటారు. ఏమండీ, అది తింటావా? ఇది తింటావా? అది వింటావా? ఇది వింటావా? అది చేస్తావా? ఇది చేస్తావా? అలా వుంటావా? ఇలా వుంటావా? ఇలా ప్రతీచోట నీకు ఛాయిస్ ఆఫ్ ఆప్షన్ వున్నది.
కానీ, అవకాశం ఉన్నప్పటికి, మనస్సును బహిర్ముఖముగా పోనివ్వకుండా, ఎవరైతే నియమించగలుగుతున్నారో, నిగ్రహించగలుగుతున్నారో, అంతర్ముఖం వైపు త్రిప్పగలుగుతున్నారో, తన స్వస్థానము నందు సంయమింప చేయగలుగుతున్నారో, వాళ్ళు మాత్రమే ఆత్మనిష్ఠులు కాగలుగుతున్నట్లు.
వివేకవంతులు కాగలుగుచున్నారు. జ్ఞానశీలురు కాగలుగుచున్నారు. స్వేచ్ఛ ఉంది కానీ, దాన్ని వినియోగించుకోరు. అవకాశం ఉంది, వినియోగించుకోరు, సమర్థుడై ఉన్నాడు, కానీ శక్తిని వినియోగించడు. ఈ రకంగా ఎవరైతే, అన్నీ ఉన్నటువంటి వాడు, అణిగిమణిగి ఉండాలంట! ఎప్పుడూ...!
అంతేకానీ, విచ్చలవిడితనాన్ని ప్రదర్శించకూడదు. ఆచరించకూడదు. ఎప్పుడైతే అట్లా లొంగి ఉంటాడో, వంగి వుంటాడో, శరణాగతుడై ఉంటాడో, ఈశ్వరానుగ్రహమునకు పాత్రుడై ఉంటాడో, సద్గురుకృపకు ఆశ్రయించి ఉంటాడో, మానసికంగా సద్గురుమూర్తిని ఆశ్రయించి వెంబడిస్తూ ఉంటాడో, ఆత్మనిష్ఠులైనటువంటి మహానుభావులని వెంబడిస్తూ ఉంటాడో అప్పుడు సదా అతను ఆత్మోన్నతికై పరిశ్రమిస్తూ ఉంటాడు.
ఆజన్మార్జితమైనవంటి సంస్కారబలాన్ని రద్దుచేసుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. వాసనా బలాన్ని నిశ్శేషముగా పోగొట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈ రకమైనటువంటి, జ్ఞానపరమైనటువంటి సాధనలలో అతను ప్రవేశిస్తాడు. జ్ఞానయోగాన్ని అభ్యసిస్తాడు.
ఆత్మజ్ఞానాన్ని పొందటమే జీవితపరమావధిగా పెట్టుకుంటాడు. కాబట్టి ‘అయమస్మి’. ఈ అభ్యాసముల వలన, ‘అహమస్మి’ నేను అయితిని. ఇంతకు ముందు నేను శరీరముగా ఉన్నాను. ఇప్పుడు నేను ఆత్మస్వరూపుడను. ‘అయమస్మి’ - నేను ఐతిని.- విద్యా సాగర్ స్వామి
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
30 Nov 2020
No comments:
Post a Comment