గీతోపనిషత్తు - 86


🌹. గీతోపనిషత్తు - 86 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍀 24. మనో యజ్ఞము - “భావముల యందు దైవమును చూడుము. బాహ్యము నందు యింద్రియముల ద్వారా దైవమునే చూడుము.” ఇది భగవద్గీత బోధించు యజ్ఞము. తనకు కలుగు భావముల యందు బ్రహ్మము లేక దైవమును చూచుట ఒక అభ్యాసము. ఈ అభ్యాసము సిద్ధించినచో షడ్వికార భావములు నశించి మనిషి స్థిరమతి యగును. 🍀

📚. 4. జ్ఞానయోగము - 27 📚

సర్వా ణీంద్రియకర్మాణి ప్రాణకర్మాణి చాపరే |
ఆత్మసంయమ యోగాగ్నె జుహ్వతి జ్ఞానదీపితే || 27

మనో నిగ్రహము:

దైవము బ్రహ్మయజ్ఞము, దైవయజ్ఞము, ఇంద్రియ యజ్ఞములను ముందు శ్లోకములయందు తెలిపి, ఇపుడు మనో యజ్ఞమును తెలుపుచున్నాడు. అన్నిటికిని మూలసూత్రము నొక్కటియే. సమస్తమును దైవముగ చూచుటయే మూల సూత్రము. దైవమును బ్రహ్మము అని కూడ పిలుతురు. బ్రహ్మమునకు సమర్పణముగ సర్వమును అనుభవింపుము.

దేవతలు కూడ బ్రహ్మము యొక్క రూపములే గనుక వారియందు బ్రహ్మమును చూచుట దైవయజ్ఞ మగును. అట్లే యింద్రియార్థముల నుండి ఇంద్రియార్థములను అనుభవించునపుడు, ఆ అనుభవము ఏవిధమైన దైనను దైవముగనే చూచుట యింద్రియ యజ్ఞము. అపుడే యింద్రియములు నిగ్రహింపబడును.

మనో నిగ్రహమునకు కూడ ఇదియే సూత్రము భగవానుడు తెలుపుచున్నాడు. మనస్సు పరిపరి విధములుగ పోవుచుండును. షడ్వికారములకు గురియగు చుండును. తదనుగుణమైన అనుభూతిని పొందుచుండును. అట్టి మనస్సు సుఖదుఃఖాది ద్వంద్వముల యందు కొట్టుమిట్టాడు చుండును. అట్టివానికే శాంతియు వుండదు.

ఇది మానవుని ప్రధానమగు సమస్య. ఈ సమస్యకు కూడ పరిష్కార మొక్కటే, తనకు కలుగు భావముల యందు బ్రహ్మము లేక దైవమును చూచుట. భావమున దైవమును చూచుట ఒక అభ్యాసము. ఈ అభ్యాసము సిద్ధించినచో షడ్వికార భావములు నశించి మనిషి స్థిరమతి యగును.

షడ్వికార భావములు నశించుటనే వానిని సంయమ మను అగ్నియందు ఆహుతి చేయుటగా తెలియవలెను. మనోనిగ్రహము పేర ఎన్ని ఇతర సాధనలు చేసినను మనస్సు నిగ్రహింపబడదు. భావము నందు దైవమును చూచుట వలన సులభముగ నిగ్రహింపబడును. “భావముల యందు దైవమును చూడుము. బాహ్యము నందు యింద్రియముల ద్వారా దైవమునే చూడుము.” ఇది భగవద్గీత బోధించు యజ్ఞము.

ఆత్మ సంయమ మను యోగాగ్నిగ పై అభ్యాసము తెలుప బడినది. పరిపూర్ణ యోగులు ఈ మార్గమునే బోధింతురు. నిగ్రహము పేరున హింసా మార్గములను బోధింపరు.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


30 Nov 2020

No comments:

Post a Comment