గీతోపనిషత్తు -101


🌹. గీతోపనిషత్తు -101 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍀 29. కర్మ నిర్వహణ - నియమములు - జ్ఞాన యజ్ఞమున, కర్మ మంతయును పరిసమాప్తి చెందుచున్నది. జ్ఞానముతో యజ్ఞము చేయుటయే జ్ఞాన యజ్ఞము . అనగ తెలిసి కర్మను నిర్వర్తించుట. కర్మ, కర్తవ్యము రూపమున మనవద్దకు కాలానుసారముగ వచ్చుచుండును. దానిని నిర్వర్తించునపుడు తెలిసినవాడు ఈ నియమములను పాటించును.

1. ఫలాపేక్షలేక నిర్వర్తించుట. 2. చేయవలసిన విధానము నెరిగి కర్తవ్యమును నిర్వర్తించుట. 3. కర్తవ్యమును తప్పించుకొనకుండుట. 4. కర్తవ్యము నిర్వర్తించునపుడు, వర్తనమున ఎక్కువ తక్కువలు లేకుండుట. 5. అలసత్వము, అశ్రద్ధ, కాలయాపనము చేయకుండుట. 6. నిర్వర్తింపబడుచున్న విషయములందు తగుల్కొనకుండుట, చిక్కుపడక యుండుట. వక్రగతుల ననుసరింపక సక్రమముగ ఓర్పుతో శ్రద్ధతో నిర్వర్తించుట. 🍀


33. శ్రేయాస్ ద్రవ్యమయా ద్యజ్ఞాద్ జ్ఞానయజ్ఞః పరంతప |
సర్వం కర్మాఖిలం పార్థ! జ్ఞానే పరిసమాప్యతే || 33


ఓ అర్జునా! ద్రవ్యము వలన సాధింపబడు యజ్ఞము కంటే జ్ఞాన యజ్ఞము గొప్పది. జ్ఞాన యజ్ఞమున, కర్మ మంతయును పరిసమాప్తి చెందుచున్నది. కర్మము పరిసమాప్తి చెందు విధానము శ్రీకృష్ణుడు యిచ్చట తెలిపియున్నాడు. జ్ఞానముతో యజ్ఞము చేయుటయే జ్ఞాన యజ్ఞము అనునది యిచ్చట తెలిపిన రహస్యము. అనగ తెలిసి కర్మను నిర్వర్తించుట. కర్మ, కర్తవ్యము రూపమున మనవద్దకు కాలానుసారముగ వచ్చుచుండును. దానిని నిర్వర్తించునపుడు తెలిసినవాడు ఈ క్రింది నియమములను పాటించును.

1. ఫలాపేక్షలేక నిర్వర్తించుట.

2. చేయవలసిన విధానము నెరిగి కర్తవ్యమును నిర్వర్తించుట.

3. కర్తవ్యమును తప్పించుకొనకుండుట.

4. కర్తవ్యము నిర్వర్తించునపుడు, వర్తనమున ఎక్కువ తక్కువలు లేకుండుట.

5. అలసత్వము, అశ్రద్ధ, కాలయాపనము చేయకుండుట.

6. నిర్వర్తింపబడుచున్న విషయములందు తగుల్కొనకుండుట, చిక్కుపడక యుండుట. వక్రగతుల ననుసరింపక సక్రమముగ ఓర్పుతో శ్రద్ధతో నిర్వర్తించుట.

పై సూత్రములను పాటించుచు, సమస్త కర్తవ్య కర్మలను నిర్వర్తించువాడు కర్మబద్ధత నుండి, క్రమముగ విముక్తి చెందును. అటు పైన దివ్యకర్మయందు భాగముగ నిలచును. దివ్యకర్మను కూడ పై సూత్రములాధారముగనే నిర్వర్తించును కనుక మోక్షస్థితి యందే యుండి, కర్మ నిర్వహణము చేయుచు నుండును. సనక సనందనాదులు, నారదమహర్షి, సప్తఋషులు, మనువులు అట్టివారు. వారు సృష్టియందు శాశ్వతులై జ్ఞానయజ్ఞమున నిలచి జీవులకు మార్గము చూపుచున్నారు.

ఈ శ్లోకము జ్ఞానయోగమునకు హృదయము వంటిది. ఎవరే పని గావించుచున్నను పై సూత్రములను పాటించుట వారిని ఆ పనుల నుండి విముక్తులను చేయును. ముక్తి మార్గమును చూపునదే జ్ఞానము. అది ఆచరణమున యిమిడి యున్నది. ఆచరణమున పై సూత్రములను పాటించని వారు ఎన్ని తెలిసినను, తెలియనివారే. జీవితమున బద్ధులే. బద్ధులైన వారు ఎంత చదివినను, తెలిసినను జ్ఞానులు కారు. బద్ధత లేనివారే జ్ఞానులు.

బంధచ్ఛేదనము గావించుకొనుటకు దైవమిచ్చినది నిష్కామ కర్మయోగము. అట్టియోగమున నిలచి, బంధములను పరిష్కరించుకొనుట జ్ఞానయోగ మగును. జ్ఞానము పేరిట శాస్త్రాధ్యయనము, క్రతువులు, మంత్రములు, తంత్రములు, పూజలు, అభిషేకములు, సత్కార్యములు చేయువారు కూడ పై సూత్రములను పాటించనిచో బద్దులే అగుచున్నారు. ఇది గమనించవలసిన విషయము.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


18 Dec 2020

No comments:

Post a Comment