కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 135


🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 135 🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. ఆత్మను తెలుసుకొను విధము - 65 🌻


కాబట్టి సాధకులందరు తప్పక సాధించవలసినటువంటి లక్షణం ‘నిష్కామకర్మ’. మరి అట్టి తటస్థ లక్షణాన్ని, సాక్షిత్వ సాధనని స్వీకరించినటువంటి వారు మాత్రమే, తనను తాను బుద్ధి నుంచి వేరుపరచుకుంటారు. ఎవరైతే అట్లా బుద్ధినుంచి వేరుగా అయ్యారో, వేరు పడ్డారో, స్వానుభూతమై, బుద్ధి సాక్షిణి, ‘సాక్షిణీ, సాక్షి వర్జితా’ అని లతితా సహస్రనామంలో కూడా వస్తుంది. కాబట్టి, బుద్ధి సాక్షిణి, అయినటువంటి స్థితికి చేరాలి. ఆ మహతత్త్వానికి చేరాలి. అప్పుడు సహజముగా నీకు ఈశ్వరానుభూతి కలుగుతుంది. నేను ఈశ్వరుడను, అనీశ్వర భావం పోతుంది. నిరీశ్వర భావం పోతుంది. సదా అదే భావనలో ఉండడానికి నీవు ఉద్యుక్తమౌతావు.

ఎందుకంటే, అది ఆనందప్రదం. అది సహజముగా ఆనందనిలయం. కాబట్టి, ఒకటి చేయడం ద్వారానో, ఒకటి చెందడం ద్వారానో, ఒకటి చేయకపోవటం ద్వారానో ఇప్పటి వరకూ కలుగుతున్న వన్నీ, సంతోషములు, సుఖదుఃఖములు. నిజానికి ఆనందములు కావు. కారణ రహితమైనటువంటి సుఖము ఏదైతే ఉందో, అదే, దాని పేరే ఆనంద ప్రతిబింబము.

అక్కడ సుఖదుఃఖాలు అనే అలలు లేవు. సాగర గర్భము వలె గంభీరమైనటువంటిది, లోతైనటువంటిది. నిరంతరాయమైనటువంటిది. నిరుపమానమైనటువంటిది. నిశ్చలమైనటువంటిది. అటువంటి నిశ్చలము - నీరవత్‌ స్థితికి చేరుకునేటటువంటి స్థితికి మానవుడు, ఈ అభిమానము అనేటటువంటి తెరను దాటుకుంటూ వెళ్ళాలి. ఈ అభిమానము అనే తెర తొలగించబడాలి. ఈ తెర తొలగించగలిగే శక్తి అమ్మకు ఉన్నది. అమ్మ యొక్క అనుగ్రహం చేత, మానవులందరు ఈ తెర తొలగించబడి, ఈశ్వర సాక్షాత్కారాన్ని పొందవచ్చు.

ఈశ్వరుడే సర్వజీవులకు తండ్రి. ప్రకృతి తల్లి. కాబట్టి ప్రకృతి యొక్క సహాయంతో, నీ చుట్టుపక్కల ఏర్పడుతున్నటువంటి సాంఘిక, సామాజిక, వైయుక్తిక, వ్యక్తిగత సంఘటనలు అన్నింటిని, ప్రకృతి యొక్క వరదానంగా, ఈశ్వరుడి యొక్క వరదానంగా, ఈశ్వరుని తెలుసుకోవడానికి, ఈశ్వరుని సాక్షాత్కరింప చేసుకోవడానికి మార్గంగా, ఇచ్చినది కాదనక, రానిది కోరక, తన కర్తవ్యాన్ని సేవకుని వలె, ఈశ్వరుని చేతిలో పనిముట్టు వలె, తన కర్తవ్యాన్ని నాలుగు ఆశ్రమ ధర్మాలలో స్పష్టంగా ఎవరైతే నిర్వచించుకుని ధర్మంతో నిర్వహిస్తారో, మోక్ష కాంక్షతో నిర్వహిస్తారో,

సామాన్యముగా నిర్వహిస్తారో, విశేషమైనటువంటి లక్షణాలు లేకుండా నిర్వహిస్తారో, మానసికమైనటువంటి పరిణతి, బుద్ధి యొక్క పరిణతి చేత, నిష్కామ కర్మను సిద్ధింప చేసుకుని, ఆ నైష్కర్మ్యసిద్ధి యొక్క బలం చేత, నేను అనేటటువంటి అహంభావనను తొలగించుకుని, ఆ నేను స్థానంలో, ఈశ్వరుడే కర్త, ఈ పిల్లవాడిని ఎవరు చదివించారమ్మా ఇంత బాగా? నేనే చదివించానండి! ఈ పిల్లవాడు ఎలా అయ్యాడమ్మా ఇంత గొప్పవాడు? నా వల్లే అయ్యాడండి! ఈ రకమైనటువంటి కర్తృత్వభావాన్ని త్యజించాలన్నమాట.

ఈ భర్తగారు ఇంత బాగా అవ్వడానికి కారణం ఏమిటమ్మా? అంటే నేనే అయ్యానండీ అని ఏ భార్యా చెప్పదు. నావల్లే ఈయన ఇంతవాడయ్యాడండి, ఆయన చెప్పుకుంటాడు. నా భార్య యొక్క సహకారం చేత, నేను ఇంతవాడిని అయ్యాను. నేను ఈ పనులన్నీ సాధించాను. అట్లాగే భార్యగారు కూడా చెప్పుకుంటారు, నా భర్తగారి యొక్క సహకారం వల్ల నేను ఈ పనులన్నీ చేయగలిగాను. ఇలా నీ గురించి మరొకరు చెప్పుకున్నప్పుడు కూడా నీలో అభిమానము ప్రవేశిస్తుంది.

ప్రశంస ద్వారా కూడా అభిమానము కలుగుతుంది. అయితే సామాన్య రీతిగా ఎవరైతే ఉన్నారో, వాళ్ళు పొంగక, కుంగక ఉంటారు. ప్రశంస చేత పొంగరు, తెగడ్త చేత కుంగరు.

ఓహో! అలాగా? ఈశ్వరానుగ్రహం. అని ఎవరైనా ఒక వేళ ప్రశంసించినప్పటికీ కూడా, ఆ ప్రశంసలన్నీ ఈశ్వరునికి ధారపోస్తారు. కృష్ణార్పణం, దైవార్పణం, ఈశ్వరార్పణం.... అనేటటువంటి పద్ధతిగా జీవిస్తూ ఉంటారు. అప్పుడు ఏమైంది? అప్పుడు వాళ్ళేమీ స్వీకరించడం లేదు. స్వీకరించకపోతే ఎవరి గిఫ్ట్‌ వారి దగ్గరే ఉంటుంది. కాబట్టి, ఎవరి గిఫ్ట్‌ వారి దగ్గరే ఉన్నప్పుడు మనల్నేమీ బాధించలేదుగా. మనమేమీ దానిని స్వీకరించలేదు.

అట్లా మానసికంగా భౌతికంగా శరీరభావన నుంచి, దేహభావన నుంచి, కర్తృత్వ భావన నుంచి, భోక్తృత్వ భావన నుంచి, తనను తాను వేరుచేసుకోవడానికి, ఈ సాంఖ్యవిచారణ క్రమాన్ని, ఈ పంచీకరణ యొక్క విధానాన్ని, పంచకోశ విరమణకు, పంచకోశ నిరసనకు ప్రతీ ఒక్కరూ తప్పక వినియోగించుకోవాలి. ఇది ఆంతరిక సాధన. ఇది ప్రతి నిత్యం చేయవలసినటువంటి సాధన. అనుక్షణం చేయవలసినటువంటి సాధన. ఈ విచారణ క్రమం ఎప్పుడూ జరుగుతూ ఉండాలి. - విద్యా సాగర్ గారు

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


18 Dec 2020

No comments:

Post a Comment