🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. విశ్వామిత్రమహర్షి - 6 🌻
35. ఆహారం ప్రాణశక్తి కోసమేకదా! ఆప్రాణశక్తి సర్వత్రా వ్యాపించిఉంది. ఉదకంలో ఉంది. ఆకాశంలో ఉంది. నీళ్ళలో ఉంది. గాలిలో ఉంది. ప్రాణశక్తి అనేది తినే ముద్దలోమాత్రమే లేదు. కాబట్టి ఆహారంతో నిమిత్తం లేకుండా వేరుగా ప్రాణశక్తిని ఎవరయితే తమలోకి తీసుకోగలరో వాళ్ళు తపస్సుకు యోగ్యమయిన శరీరాన్ని కలిగినవాళ్ళు. అట్లాంటివాళ్ళు ఆహారంమీద ఆధారపడి ఉండనక్కరలేదు. ఇది శౌచవిధి.
36. నిత్యజీవితంలోకూడా శరీరకశౌచం కంటే మానశికశౌచం ప్రధానం. అందుకనే ‘సబాహ్యాభ్యంతరః శుచిః’ అనిచెప్పి బాహ్యము, లోపలకూడా శుద్ధికోసమని నీళ్ళుచల్లుకుంటారు. ఆచమనంచేస్తారు. ఈ ఆచమనం ఎందుకంటే, లోపల ఉండే అంతఃశౌచంకోసమని. ప్రాణాయామం చేస్తారు, లోపల్ ఉండేటటువంటి మాలిన్యంపోవాలని. ఇవన్నీ ప్రయత్నాలు. ఇంతకూ వీటన్నిటికీ అటీతమయినది సంకల్పము.
37. సృష్టిలో దేనియందయినా కరుణ, దయ, నిర్వికారము; అలగే అవమానము, సన్మానము రెండింటియందు సమదృష్టి-ఇవి శౌచానికి హేతువులవుతాయి. ఎందుకంటే క్రోధం అశుచినిస్తుంది లోపల. ఆశ అసుచినిస్తుంది. లోభంతోనూ అశుచి వస్తుంది. దేనియందయినా ఆశపెట్టుకుని అదికావాలంటే అది అశౌచికం. అది అశుచి. ఆగ్రహం అశుచే! లోభం, మోహం ఇవన్నీకూడా – అంతఃకరణలో ఉండే దోషాలన్నీకూడా-అంతఃకరణకు అశుచిని అపాదించేవే. కాబట్టి ఇవి లేకపోతే శౌచధర్మం కలుగుతుంది. ఈ అశుచి వదిలినవాడికి అంతఃకరణ పూర్తిగా వశమై, పరమశుచీభూతుడై అంతఃకరణలో తపస్సు చేస్తాడు.
38. అలా లేకపోతే, శరీరం ఎన్ని మాట్లు స్నానంచేసినా, ఆచమనం చేసినా, మంత్రోదకం చల్లుకున్నా తపస్సు పదినిమిషాలకంటే ఎక్కువ చెయ్యలేడు. కూర్చోలేడు. ఒక గంటసేపుకూడా నిలబడలేడు. ప్రాణాయామంచేయలేడు. వాయువును నిగ్రహించలేడు. కాబట్టి కలిలో మితాహారము, అంతఃశౌచము ఉండాలి. దానివలన ప్రాణాయామము మొదలైన నియమాలన్నీ లభిస్తాయి. వాటివల్ల మనుష్యుడు తపస్సుకు యోగ్యమైన అంతఃశరీరం కలిగినవాడు. తపస్సుకు పనికిరాని శరీరం వ్యర్థమయినటువంటిదే. మానవజన్మకు తపస్సుతప్ప కర్తవ్యమేముంది? ఏది సంపాదించినా నశించేదే కదా!.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
18 Dec 2020
No comments:
Post a Comment