శ్రీ శివ మహా పురాణము - 299


🌹 . శ్రీ శివ మహా పురాణము - 299 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴

72. అధ్యాయము - 27

🌻. దక్షయజ్ఞ ప్రారంభము - 3 🌻


మరియు ఇంద్రుడు స్వయముగాదేవతాగణములతో గూడి వచ్చినాడు. మరియు తొలగిన కల్మషములు గల ఋషులు మీరందరు విచ్చేసినారు (40). యజ్ఞమునకు యోగ్యమైన వారు, శాంతులు, సత్పాత్రులు, వేదముల తత్త్వమును వేదార్ధమును ఎరింగిన వారు, దృఢమగు వ్రతము గల వారు నగు మీరందరు వచ్చినారు (41). మనకు ఇచట రుద్రునితో పని యేమి ? హే దధీచీ! బ్రహ్మ ప్రేరేపించగా నేను ఆతనికి కన్యనిచ్చితిని (42). హే విప్రా! ఈ హరుడు కులముగాని, తల్లిదండ్రులు గాని లేనివాడు భూతప్రేత పిశాచములకు ప్రభువు. ఏకాకి. ఆతనికి అతిక్రమించుట చాల కష్టము (43).

ఆతడు తానే గొప్పయను గర్వము గల మూఢుడు. మౌనముగా నుండువాడు. అసూయాపరుడు. ఈ కర్మకు యోగ్యమైనవాడు కాదు. అందువలననే నేనాతనిని ఈనాడు రప్పించలేదు (44). కావున నీవు ఇట్టి పలుకులను మరియెచ్చటనూ చెప్పుకుము. మీరందరు కలిసి నా మహాయజ్ఞమును సఫలము చేయుడు (45).

బ్రహ్మఇట్లు పలికెను -

వాని ఈ మాటలను విని, దధీచుడు దేవతలు మునులు అందరు వినుచుండగా సారముతో గూడిన మాటను పలికెను (46).

దధీచుడు ఇట్లు పలికెను -

శివుడు లేని ఈ మహాయజ్ఞము అయజ్ఞముగా మారినది. మరియు ఇచట విశేషించి నీ వినాశము కూడ జరుగగలదు (47). దధీచుడు ఇట్లు పలికి ఆయన ఒక్కడే దక్షుని యజ్ఞ వాటిక నుండి బయటకు వచ్చి వేగముగా తన ఆశ్రమమునకు వెళ్లి పోయెను (48). తరువాత శివమతానుయాయులగు ఇతర శంకర భక్తులు కూడా బయటకు వచ్చి, వెంటనే అదే తీరున శాపమునిచ్చి, తమ ఆశ్రమములకు వెళ్లిరి (49). దధీచి, ఇతర శంకర భక్తులు ఆ యజ్ఞమునుండి బయటకు రాగానే, దుష్టబుద్ధి శివద్రోహి అగు దక్షుడు నవ్వుచూ ఆ మునులతో నిట్లనెను (50).

దక్షుడిట్లు పలికెను -

శివునకు ప్రియుడగు దధీచుడు అను బ్రాహ్మణుడు వెళ్లినాడు. అటు వంటి వారే మరి కొందరు కూడా నా యజ్ఞమునుండి తొలగిపోయిరి (51). ఇది అంతయూ మిక్కిలి శుభకరము. నాకు అన్ని విధముల సమ్మతము. ఇంద్రా! దేవతలారా! మునులారా! నేను సత్యమును పలుకుచున్నాను (52).

వివేకము లేని మూర్ఖులను, మిథ్యావాదముల యందభిరుచి గల దుష్టులను, వేద బాహ్యులను, దురాచారులను యజ్ఞకర్మలోనికి రానీయరాదు (53). మీరందరు వేదాధ్యయనపరులు. మీకు ముందు విష్ణువు ఉండి నడిపించును. ఓ బ్రాహ్మణులారా! దేవతలారా! విలంబము లేకుండగా నా యజ్ఞమును సఫలము చేయుడు (54).

బ్రహ్మ ఇట్లు పలికెను -

వాని ఈ మాటలను విని శివమాయచే విమోహితులైన వారై దేవర్షులు అందరు ఆ యజ్ఞమునందు దేవతలకు హనిస్సులనీయ నారంభించిరి (55). ఓ మహర్షీ! ఇంతవరకు ఆ యజ్ఞమునకు శాపము కలిగిన తీరును వర్ణించితిని. ఇపుడు ఆ యజ్ఞము విధ్వంసమైన తీరును వర్ణించెదను. శ్రద్ధతో వినుము (56).

శ్రీశివ మహాపురాణములోని రెండవదియగు రుద్ర సంహితయందు రెండవది యగు సతీఖండములో దక్షయజ్ఞ ప్రారంభమనే ఇరువది ఏడవ అధ్యాయము ముగిసినది (27).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


18 Dec 2020

No comments:

Post a Comment