గీతోపనిషత్తు -110
🌹. గీతోపనిషత్తు -110 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
శ్లోకము 41
🍀 36. కర్మనిష్ఠ - కర్మఫలములను సన్యసించి, కర్తవ్య కర్మల నాచరించు వాడు జ్ఞానముచే సంశయములను భిన్నము గావించి కర్మనిష్ఠతోనే ఆత్మవంతు డగును. అట్టివానికి సృష్టియందు సమస్తము శాశ్వతముగ సహకరించుచునే యుండును. అట్టివాని కెట్టి బంధములు లేవు. శ్రీకృష్ణుడు మానవులకు అందించిన సందేశ మొక్కటియే. ఫలాసక్తి సన్యసించి కర్తవ్యమును నిర్వర్తించుట. కర్తవ్యము నాచరించుటే ముఖ్యము గాని, ఫలములను బట్టి కర్తవ్యముల నాచరించుట కాదు. చేయు పని కర్తవ్యమా, కాదా? అనునది ముఖ్యము. 🍀
యోగసన్యస్త కర్మాణం జ్ఞానసంఛిన్న సంశయమ్ |
ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ || 41
కర్మఫలములను సన్యసించి, కర్తవ్య కర్మల నాచరించు వాడు జ్ఞానముచే సంశయములను భిన్నము గావించి కర్మనిష్ఠతోనే ఆత్మవంతు డగును. అట్టివాని కెట్టి బంధములు లేవు.
శ్రీకృష్ణుడు మానవులకు అందించిన సందేశ మొక్కటియే. ఫలాసక్తి సన్యసించి కర్తవ్యమును నిర్వర్తించుట. భగవద్గీతయందు ఈ అంశము మరల మరల తెలుపబడుచునే యుండును.
ఎన్ని రకములుగ చెప్పినను సాధకున కందించు విషయ మొక్కటియే. కర్తవ్యము నాచరించుటే ముఖ్యము గాని, ఫలములను బట్టి కర్తవ్యముల నాచరించుట కాదు. ఇది మానవునకు వంట బట్టుటకు వందల జన్మలు గడువవచ్చును. అయినను బంధ మోచనమున కిదొక్కటియే మార్గము. మరియొక మార్గము లేదు. చేయు పని కర్తవ్యమా, కాదా? అనునది ముఖ్యము.
కర్తవ్యమే అని తేలినపుడు ఆచరించుటయే గాని మరియొక మార్గము లేదు. ఆచరించునపుడు సమతూకముగ నాచరించ వలెను. లేనిచో ఆచరించుట ద్వారా మరల కర్మలు పుట్టవచ్చును.
సమతూకముగ ఆచరించినపుడు ఫలములు సిద్ధింపవచ్చును. సిద్ధించిన ఫలములయందు మోహపడుట వలన కూడ మరల బంధము కలుగవచ్చును. అందువలన కేవలము కర్తవ్య నిర్వహణమే కాని, జీవితమున మరి ఏమియు లేదని కృష్ణుని ఉపదేశ సారాంశము.
నిర్వర్తించుట ఆనందముగ జరిపినచో కర్మ నిర్వహణమే వలసిన అనుభూతి నందించును. కృష్ణు డట్లే వర్తించినాడు. నిజమునకు అట్టి వర్తనమున, దిట్టయై నర్తించినాడు కూడ. అతని సందేశము కూడ నదియే.
కర్మ నిర్వహణ మందలి సూత్రములను తెలిసి, అట్లు జీవించువాడు జ్ఞానముచే సంశయములు తొలగినవాడై, కర్మములనుండి విడివడి ముక్తుడగును. ఆత్మవంతుడు కూడ అగును. అట్టివానికి సృష్టియందు సమస్తము శాశ్వతముగ సహకరించుచునే యుండును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
27 Dec 2020
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment