✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. ఆత్మను తెలుసుకొను విధము - 74 🌻
అలా ఉన్నట్టి గర్భిణీ స్త్రీ తన గర్భమందున్నటువంటి జీవులను జఠరాగ్ని యొక్క ఆధారముగా పోషిస్తూఉంటుంది. ఎందుకంటే ఆవిడ తినేటటువంటి ఆహారం చేతనే లోపల ఉన్నటువంటి శిశువులు పోషించబడతూ ఉంటాయి. అలాగే హిరణ్యగర్భుని యొక్క అగ్ని తత్వ ప్రభావం చేతనే ఆ లోపల ఉన్నటువంటి జీవులన్నీ పోషింపబడుతూ ఉంటాయి.
సమస్త జీవులను తన లోపలికి ప్రళయకాలంలో సంగ్రహించి, వాటిని కొద్ది కాలం తన వద్దనే వుంచుకొని, తిరోధాన అనుగ్రహము అనేటటువంటి పద్ధతిగా వాటిని కొంతకాలం తనలో ఉంచుకొని, మరల సృష్టి ప్రారంభకాలంలో వాటిని యధాతథముగా ‘యుగవత్‘ సృష్టిగా విడుదల చేశాడు.
అంటే సృష్టి ద్వివిధంబులు. క్రమసృష్టి, యుగవత్ సృష్టి. యుగవత్ సృష్టి అనే దానికి నాంది పలుకుతున్నారు గర్భిణీ స్త్రీ అని చెప్పడం ద్వారా. అంటే అర్ధం ఏమిటి? అంటే మానవులు మానవులనే కంటున్నారు. ఏ జాతికి, ఏ రకమైనటువంటి స్థితి కలిగినటువంటి వారు, ఆ రకమైన వారికే జన్మనిస్తున్నారు కదా! ఇది సృష్టి ధర్మం కదా! అట్లే 84 లక్షల జీవరాసులకు సంబంధించినటువంటి మూల స్థానములు, ఆధారబీజములు ఈ హిరణ్య గర్భ స్థానంలో ఉన్నాయి.
మరల పునః సృష్టి కాలంలో 84 లక్షల జీవరాసులు విడుదల చేయబడ్డాయి. అపుడేమైందట?- జీవరాసులంతా ఒకే సారి ఉద్భవించాయి. మీ డార్విన్ థీరీ ఇక్కడ పోయిందన్నమాట. అంటే క్రమశః అమీబా నుండి మానవుడు పుట్టి, వరుసగా అన్ని జన్మలు ఎత్తుకుంటూ, అన్ని జన్మలు పోగొట్టుకుంటూ ఎప్పటికో పరిణామ కాలంలో మానవుడు వచ్చాడు. పరిణామ కాలంలో కోతి నుండి మానవుడు వచ్చాడు. “అలా రాలేదు” అంటుంది బ్రహ్మాండ పురాణం. ఈ హిరణ్యగర్భుడు విడుదల చేసేటప్పుడు ఏక కాలంలో అందర్నీ విడుదల చేసాడు.
గర్భిణీ స్త్రీ ఎట్లా అయితే తన రూపము కలిగినటువంటి శిశువులను తానెలా కన్నదో, అట్లే ఆ దైవీ సృష్టి కూడా దైవీ మానవుడు కూడ అదే కాలంలో ఉద్భవించాడు. ఆ సృష్టి యొక్క ప్రారంభ దశనే హృద్దైవ (హృదయ) కాలమని అన్నారు. కాబట్టి అక్కడ ఉన్న మానవులంతా ఎవరు అంటే దైవీ మానవులు. అందరికీ దైవత్వం సాధ్యమై ఉన్నటువంటి వారు. అందరికీ తమ గర్భ స్థానము అయినటువంటి, తమ ఆధారమైన స్థానము అయినటువంటి హిరణ్మయకోశమే, హిరణ్యగర్భుడే, అక్షరుడే ఆధారమైనటువంటి వాడు.
ఆ అక్షర స్థితి తెలిసినటువంటి వారు. వారు క్షర పురుష స్థితికి పడిపోయినటువంటి మన లాంటి కలియుగ పురుషులు కాదు. ఈ కలియుగంలో శరీరం నేననేటటువంటి అభిమానబలం బలపడి పోవటం వలన, తాదాత్మ్యతా బలం బలపడిపోవటం వలన, కేవలం శరీర భావం మాత్రమే మిగిలి వుండటం వలన, క్షర పురుష స్థితికి దిగజారి పోయినటువంటి బౌద్ధిక మనస్తత్వము ఉండటం చేత వీళ్ళు క్రమానుగతిలో క్రింద నుండి పైకి తెలుసుకోవలసినటువంటి అగత్యం ఏర్పడి అక్షర పురుష స్థితికి ఎదగడానికి నానా తంటాలు పడుతువున్నారు. బ్రహ్మనిష్టులవడానికి, బ్రహ్మఙానం పొందడానికి జీవితకాలం సరిపోవడం లేదు.
కానీ సృష్టి యొక్క ఆరంభ దశ కాలంలో ప్రతి ఒక్కరూ బ్రహ్మ జ్ఞానం తో ఉండటం చేత, వారి లక్ష్యం పరమాత్మే అయి ఉన్నది. కాబట్టి వేదములుద్భవించినటువంటి కాలంలో, అందరూ కూడ బ్రహ్మజ్ఞానులే. అందువలన వారి యొక్క లక్ష్యం ఏమిటంటే పరమాత్మ. వారి లక్ష్యం ఏమిటంటే బయలు.
వారి లక్ష్యం ఏమిటంటే తత్ స్థితి. ఆ రకంగా వాళ్ళు ఎవరైతే నిర్ణయాత్మకంగా, పరమాత్మ స్థితిని లక్ష్యించినటువంటి వారు వున్నారో, జన్మరాహిత్య స్థితిని సాధించినటువంటి వారు వున్నారో. అందుకనే తత్త్వశాస్త్రములన్నీ కూడ పరబ్రహ్మ నిర్ణయాన్ని, తదుపరి జన్మ రాహిత్యాన్ని లక్ష్యించే విధానాన్నే బోధిస్తూఉన్నాయి.
ఉపనిషత్తులుగాని, లేదా వేదాంత విద్య గాని, బ్రహ్మ సూత్రాలు గాని ఇవన్నీ కూడ బ్రహ్మనిష్ఠని బలపరచి, అక్కణ్ణించి పరిణామము చెందేటటువంటి, చిట్టచివరి దివ్య యానాన్ని అందించేటటువంటి మార్గ దర్శక సూత్రాలుగా మనకు అందించారు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
27 Dec 2020
No comments:
Post a Comment