రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
76. అధ్యాయము - 31
🌻. ఆకాశవాణి - 2 🌻
ఎవని పాద పద్మమును నిత్యము ధ్యానించి, ఆదరముతో పూజించి ఇంద్రాది లోకపాలకులు తమ తమ గొప్ప పదవులను పొందిరో (24), అట్టి శివుడు జగత్తునకు తండ్రి. ఆయన యొక్క శక్తియగు ఆ సతీదేవి జగత్తునకు తల్లి. ఓరీమూఢా! నీవు వారి నిద్దరినీ పూజించలేదు. నీకు శ్రేయస్సు ఎట్లు కలుగును? (25) నీ యందు దౌర్భాగ్యము సంక్రమించినది. నీకు ఆపదలు సంక్రమించినవి. ఏలయన, నీవు భక్తితో ఆ భవానీ శంకరుల నారాధించకపోతివి (26).
మంగళకరుడగు శంభుని ఆరాధించకుండగనే నేను కల్యాణములను పొందగలనననే గర్వము నీకు గలదు. ఈ గర్వము వారించ శక్యముగానిదా యేమి? ఈనాడు ఆ గర్వము నశించగలదు (27).
సర్వేశ్వరునకు విముఖుడై నీకు సాహాయ్యమును చేయగలవాడు ఈ దేవతలలో ఎవడు గలడు ?ఎంత వెదికిననూ అట్టివాడు నాకు కానవచ్చుట లేదు (28). ఇపుడు నీకు దేవతలు సాహాయ్యమును చేసినచో, వారు నిప్పుయందు పడిన శలభముల వలెన నాశమును పొందెదరు (29).
ఈనాడు నీ ముఖము మండిపోవుగాక !నీ యజ్ఞము నాశమగు గాక !నీకు ఎంతమంది సాహాయ్యమును చేసెదరో, వారందరు వెంటనే మాడి మసియగుదురు గాక !(30) దుష్టబుద్ధియగు నీకు ఈనాడు ఏ దేవతలు సాహాయ్యమును చేసెదరో, వారందరికి అమంగళము కలుగుట నిశ్చయము. ఇది నా శపథము (31).
ఓ దేవతలారా !మీరీ యజ్ఞమండపము నుండి మీ గృహములకు మరలుడు. అట్లు గానిచో ఈనాడు మీ నాశము నిశ్చయము (23). మునులు, నాగులు మొదలగు ఇతరులందరు ఈ యజ్ఞము నుండి బయటకు పొండు. అట్లు గానిచో, ఈనాడు మీ నాశము నిశ్చితము (33). ఓ హరీ !నీవు వెంటనే ఈ యజ్ఞముమండపము నుండి బయటకు పొమ్ము. లేనిచో, ఈనాడు నీవిచట నాశమును పొందుట నిశ్చతము (34).
ఓ బ్రహ్మా! నీవు శీఘ్రముగా ఈ యజ్ఞమండపము నుండి నిష్క్రమించుము. అట్లుగానిచో, నీవీనాడు నాశమును పొందుట నిశ్చయము (35).
బ్రహ్మ ఇట్లు పలికెను -
సర్వరులకు మంగళములనిచ్చే ఆ ఆకాశవాణి యజ్ఞశాల అంతటా కూర్చుండియున్న వారిని ఉద్దేశించి ఇట్లు పలికి విరమించెను (36). ఓ కుమారా !ఆకాశవాణి యొక్క ఆ ప్రసంగమును విని విష్ణువు మొదలగు దేవతలు, మునులు, మరియు ఇతరులు అందరు ఆశ్చర్యమును పొందిరి (37).
శ్రీ శివ మహాపురాణములో రెండవదియగు రుద్రసంహితయందు రెండవదియగు సతీఖండలో సత్యుపాఖ్యనమునందు ఆకాశవాణీ వర్ణనమనే ముప్పది ఒకటవ అధ్యాయము ముగిసినది (31).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
27 Dec 2020
No comments:
Post a Comment