గీతోపనిషత్తు -276
🌹. గీతోపనిషత్తు -276 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚
శ్లోకము 12-3
🍀 12-3. కర్తవ్య కర్మ - ఆశామోహములు దరి రానీయకుండగ యుండవలె నన్నచో కర్తవ్యమే శరణ్యము. ఈ కర్తవ్యమునే “కార్యం, కర్మ" అని భగవద్గీత వచించినది. చేయవలసిన పనిని కార్యం కర్మ అందురు. మోహపడుట, ఆశపడుట ఎచ్చటుండునో అచ్చట అజ్ఞానము వలన బంధముండును. వానివలన మోహిని, ఆసురి, రాక్షసి అను మూడు వికృతులు జీవుని పట్టును. అట్టి వానికి నిష్కృతి లేదు. ఈ ఒక్క సూత్రము చిన్నతనముననే తెలిసినచో అట్టి జీవుడు వికృతిని బడక, ప్రకృతి యందుండి, కర్తవ్యకర్మ మార్గమున సంస్కృతిని పొందును. 🍀
మోఘశా మోఘకర్మాణో మోఘజ్ఞానా విచేతసః |
రాక్షసీ మాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః || 12
తాత్పర్యము : మోహముచేతను, ఆశచేతను వికృతి చెందిన చేతస్సు గలవారై, అజ్ఞానమగు కర్మలు జీవకోట్లు నిర్వర్తించు చున్నారు.
వివరణము : భగవంతుడు గీతాబోధన నడుమ మోహము, ఆశ, వానితో కూడిన కర్మలు అజ్ఞానమువలన నిర్వర్తింప బడునని, దాని వలన మోహిని, ఆసురి, రాక్షసి అను మూడు వికృతులు మానవు నాశ్రయించునని తెలిపెను. ఆశామోహములు దరి రానీయకుండగ యుండవలె నన్నచో కర్తవ్యమే శరణ్యము. ఈ కర్తవ్యమునే “కార్యం, కర్మ" అని భగవద్గీత వచించినది. చేయవలసిన పనిని కార్యం కర్మ అందురు. ఏ భాషణమైనను, చేష్ట అయినను చేయవలసినదే చేయవలెను. ఇతరములు చేసినచో ప్రకృతి బంధించుట తప్పదు.
కనుక మోహపడుట, ఆశపడుట ఎచ్చటుండునో అచ్చట అజ్ఞానము వలన బంధముండును. వానివలన మోహిని, ఆసురి, రాక్షసి అను మూడు వికృతులు జీవుని పట్టును. అట్టి వానికి నిష్కృతి లేదు. ఈ ఒక్క సూత్రము చిన్నతనముననే తెలిసినచో అట్టి జీవుడు వికృతిని బడక, ప్రకృతి యందుండి, కర్తవ్యకర్మ మార్గమున సంస్కృతిని పొందును. తెలుగు వారికి “ఆశా మోహముల దరి రానీకోయి, అన్యులకే నీ సుఖము అంకిత మోయి" అను గీతం వరముగ అందజేయబడినది. ఈ శ్లోకము సారాంశ మదియే.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
15 Nov 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment