శ్రీ శివ మహా పురాణము - 475


🌹 . శ్రీ శివ మహా పురాణము - 475 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 35

🌻. పద్మా పిప్పలాదుల చరిత్ర - 3 🌻

స్త్రీలోలుని స్పృశించినంత మాత్రాన పుణ్యమంతయూ నశించును. స్త్రీ లోలుడు పరమపాపి. వానిని చూచినచో, పాపము చుట్టు కొనును (20). స్త్రీలోలుడైన పురుషుడు మంచి కర్మలను చేసిననూ సర్వదా అపవిత్రుడే యగును. ఆతనిని పితృదేవతలు, దేవతలు, మరియు సర్వమానవులునిందించెదరు (21).ఎవని మనస్సు స్త్రీలయందు లగ్నమై యుండునో, వానికి జ్ఞానముతో గాని, గొప్ప తపస్సుతోగాని, జపహోమ పూజాదులతో గాని, విద్యతోగాని, దానముతో గాని పని యేమున్నది? (22) నీకు తల్లిని అగు నాయందు నీవు స్త్రీ భావమును కలిగి మాటలాడి నావు. నేను నిన్ను శపించుచున్నాను. నీవు కాలక్రమములో క్షయమును పొందగలవు (23).

వసిష్ఠుడిట్లు పలికెను -

ధర్ముడు ఆ పతివ్రత యొక్క శాపమును విని రాజవేషమును విడిచి పెట్టెను. ఆ దేవదేవుడు నిజరూపమును ధరించి వణికిపోవుచూ ఇట్లనెను (24).

ధర్ముడిట్లు పలికెను -

నేను ధర్ముడనని తెలుసుకొనుము. ఓ తల్లీ! నేను జ్ఞానులకు, గురువునకు కూడ గురువును. ఓ పతివ్రతా! నేను సర్వదా పరస్త్రీని తల్లి అను బుద్ధితో దర్శించెదను (25). నేను నీ మనస్సు నెరుంగుదును. అయిననూ, విధిప్రేరితుడనై నీలోని లోపమును కని పెట్టుటకు నీ వద్దకు వచ్చినాను (26). ఓ సాధ్వీ! నీవు నాకు తగిన శాస్తిని చేసితివి. నీవు శపించుటలో తప్పు లేదు. తప్పు మార్గములో వెళ్లువారికి ఈశ్వరుడు తగు శాస్తిని ఏర్పాటు చేయును (27). సర్వప్రాణులకు సుఖదుఃఖములను, పరములను స్వయముగానిచ్చువాడు, సంపదలను ఆపదలను కలిగించుటలో సమర్థుడు అగు ఆ శివుని కొరకు నమస్కారమగు గాక! (28)

శత్రుత్వమును నెరపుటకు, మైత్రిని చేయుటకు, ప్రీతిని చూపుటకు, కలహమును చేయుటకు, సృష్టిని చేయుటకు, సృష్టిని ఉపసంహరించుటకు ఎవడు సమర్థుడో, అట్టి శివుని కొరకు నమస్కారము (29). ఎవడు పాలను తెల్లగా చేసినాడో, సృష్ట్యాదియందు నీటిలో చల్లదనమును నింపినాడో, అగ్నిని వేడిగా నిర్మించినాడో, అట్టి శివుని కొరకు నమస్కారము (30). ఎంతయూ ఆలోచించి మహదాది క్రమములో ప్రకృతి నుండి ఎవడైతే సృష్టిని చేసి, బ్రహ్మ విష్ణు రుద్రాదులను కూడా సృష్టించినాడో, అట్టి శివునకు నమస్కారమగుగాక! (31)


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

15 Nov 2021

No comments:

Post a Comment