శ్రీ శివ మహా పురాణము - 199


🌹 . శ్రీ శివ మహా పురాణము - 199 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - సృష్టిఖండః 🌴

44. అధ్యాయము - 19

🌻. శివునితో కుబేరుని మైత్రి - 1 🌻

బ్రహ్మోవాచ |

పాద్మే కల్పే మమ పురా బ్రహ్మణో మానసాత్సుతాత్‌ | పులస్త్యాద్విశ్రవా జజ్ఞే తస్య వైశ్రవణస్సుతః || 1
తేనేయ మలకా భుక్తా పురీ విశ్వకృతా కృతా | ఆరాధ్య త్ర్యంబకం దేవషుత్యుగ్ర తపసా పురా || 2
వ్యతీతే తత్ర కల్పేవై ప్రవృత్తే మేఘ వాహనే | యాజ్ఞ దత్తి రసౌ శ్రీ దస్తపస్తేపే సుదుస్సహమ్‌ || 3
భక్తి ప్రభావం విజ్ఞాయ శంభోస్తద్దీపమాత్రతః | పురా పురారేస్సం ప్రాప్య కాశికాం చిత్ర్ప కాశికామ్‌ || 4

బ్రహ్మ ఇట్లు పలికెను -

పూర్వము పాద్మకల్పమునందు బ్రహ్మనగు నా యొక్క మానసపుత్రుడైన పులస్త్యునకు విశ్రవసుడు అను కుమారుడు కలిగెను| అతనికి వైశ్రవణుడు (కుబేరుడు) అను కుమారుడు కలిగెను (1).

ఆతడు పూర్వము ముక్కంటి దేవుని అతిఘోరమగు తపస్సుతో నారాధించి విశ్వకర్మచే నిర్మింపబడిన ఈ అలకాపురిని పాలించెను (2).

పాద్మకల్పము గడిచి, మేఘ వాహన కల్పము రాగా, యజ్ఞదత్తుని కుమారుడుగా నున్న ఈ కుబేరుడు ఘోరమగు తపస్సును చేసెను (3).

దీపమును వెలిగించుట మాత్రము చేత తనకు లభించిన మహా ఫలముచే భక్తియొక్క ప్రభావమును ఎరింగి, ఆతడు పూర్వము పురారియగు శివుని చైతన్య స్వరూపమును ప్రకాశింపజేయు కాశీనగరమును చేరుకొనెను (4).

శివైకాదశముద్బోధ్య చిత్తరత్నప్రదీపకైః | అనన్య భక్తిస్నేహాఢ్య స్తన్మయో ధ్యాననిశ్చలః || 5
శివైక్యం సుమహాపాత్రం తపోsగ్ని పరిబృంహితమ్‌ | కామక్రోధమహావిఘ్న పతంగాఘాతవర్జితమ్‌ || 6
ప్రాణసంరోధనిర్వాతం నిర్మలం నిర్మలేక్షణాత్‌ | సంస్థాప్య శాంభవం లింగం సద్భావకుసుమార్చితమ్‌ || 7
తావత్తతాప స తపస్త్వగస్థిపరిశేషితమ్‌ | యావద్బభూవ తద్వర్ష్మ వర్షాణామయుతం శతమ్‌ || 8

ఆతడు చిత్తము అనే రత్న దీపముచే ఏకాదశ రుద్రులను మేల్కొలిపి, అనన్యమగు భక్తితో, ప్రేమతో నిండిన హృదయము గలవాడై. ధ్యానమునందు అచంచలుడై యుండెను (5).

ఆతడు మహాత్ములకు మాత్రమే లభ్యమగునట్టియు, తపస్సు అనే అగ్నిచే వృద్ధి పొందింపబడునట్టియు, కామక్రోధరూపములో నుండే మహావిఘ్నములను పక్షుల దెబ్బలు తగులనట్టి శివైక్యమును భావనచే పొందెను (6).

ఆతడు ప్రాణాయామములో వాయువును స్తంభింపజేయుటచే వాయు సంచారము లేనట్టియు, దోషరహితమగు అంతర్ముఖత్వముచే కాలుష్యములు లేనట్టి మనో దేశమునందు శంభులింగమును స్ధాపించి పవిత్రమగు చిత్త వృత్తులనే పుష్పములచే నారాధించెను (7).

ఆతడు శరీరములో చర్మము, ఎముకలు మాత్రమే మిగులునంత వరకు పదివేల వంద సంవత్సరముల కాలము తపస్సు చేసెను (8).

తతస్సహ విశాలక్ష్యా దేవో విశ్వేశ్వరస్స్వయమ్‌ | అలకాపతి మాలోక్య ప్రసన్నేనాంతరాత్మనా || 9
లింగే మనస్స మాధాయ స్థితం స్థాణుస్వరూపిణమ్‌ | ఉవాచ వరదోSస్మీతి తదాచక్ష్వాలకాపతే || 10
ఉన్మీల్య నయనే యావత్స పశ్యతి తపోధనః | తావదుద్యత్స హస్రాంశు సహస్రాధికతేజసమ్‌ || 11
పురో దదర్శ శ్రీ కంఠం చంద్రచూడము మాధవమ్‌ | తత్తేజః పరిభూతాక్షితేజాః సంమీల్య లోచనే || 12
ఉవాచ దేవదేవేశం మనోరథపదాతిగమ్‌ | నిజాం ఘ్రిదర్శనే నాత దృక్సామర్థ్యం ప్రయచ్ఛమే || 13

అపుడు విశ్వేశ్వర దేవుడు నిడివికన్నుల అర్ధాంగితో కూడి ప్రసన్నమగు మనస్సుతో స్వయముగా ప్రత్యక్షమై అలకాపతియగు కుబేరుని చూచెను (9).

ఆతడు మనస్సును లింగమునందు లగ్నము చేసి స్థాణువు వలె నిశ్చలుడై యుండెను. అపుడు ఆయన 'హే అలకాపతే! వరము నిచ్చెదను కోరుకొనుము' అని పలికెను (10).

తపస్సే ధనముగా గల ఆ కుబేరుడు కన్నులను తెరచి, ఉదయించే కోటి సూర్యుల కన్న అధికమగు తేజస్సు కలిగినట్టియు (11),

విషమును కంఠమునందు ధరించినట్టియు, చంద్రుని శిరస్సుపై అలంకరించుకొనియున్న పార్వతీ పతిని ఎదురుగా చూచెను. ఆ తేజస్సును కన్నులతో చూడజాలక, ఆతడు వెంటనే కన్నులను మూసుకొనెను (12).

మనోగోచరము కాని ఆ దేవదేవునితో ఆతడిట్లనెను. నాథా! నీ పాదములను చూడగలిగే శక్తిని నా కన్నులకు ఇమ్ము (13).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


No comments:

Post a Comment