కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 29
🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 29 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. శ్రేయోమార్గము - ప్రేయోమార్గము - 18 🌻
అప్పుడేమౌతాడు వాడు? అదే మోహంలో మరింతగా కూరుకుపోతాడు. పైగా ఈసారి ఏమనుకుంటాడు. మా గురువుగారే చెప్పారు కదా అనుకుంటాడు. మా గురువుగారే చెప్పగా ఇంకేముంది సమస్య. ఏమండీ మా అబ్బాయిని విదేశాలకి పంపించమంటారా అని నన్ను అడిగారనుకోండి. నేను ఏమి చెప్పగలుగుతాను. మా అమ్మాయికి ఈ పెళ్ళి చెయ్యమంటారా, ఈ సంబంధం కుదర్చమంటారా అని నన్నడిగారు అడిగారనుకోండి. నేనేం చెప్పగలుగుతాను. ఏమండీ ఈ ఇల్లు కొనమటారా అని నన్ను అడిగారనుకోండి. నేనేం చెప్పగలుగుతాను.
కాబట్టి ఈ రకమైనటువంటి జగద్వ్యాపార లక్షణాలలో నీవు గనక గురువును ఉపయోగించుకోవడం ప్రారంభించావనుకో అప్పుడు ఆత్మోన్నతికి గురువును ఉపయోగించుకునేటటువంటి అవకాశాన్ని కోల్పోతావు.
ఎందువల్ల అంటే ఆ గురువు అప్పుడు నీకు ఎట్లా కనబడతాడు అంటే నీ కోర్కెలు, నీ సందేహాలు, నీ సంసారగత సంబంధ విషయములను తీర్చేటటువంటి సాధారణమైనటువంటి విద్వాంసుడు, పండితుడు, శాస్త్రజ్ఞుడు కామ్యకకర్మలయందు, ధర్మములయందు, శాస్త్రములయందు విశేషమైన పాండిత్యం కలిగి సలహాలిచ్చేటటువంటి సలహాదారుగా ఉపయోగపడతాడే తప్ప నీ అత్మోన్నతికి, ఆత్మజ్ఞానాన్ని పొందడానికి, నువ్వు మోక్షాన్ని పొండానికి, నీవు విద్యావంతుడవు అవడానికి, నువ్వు శ్రేయోమార్గమున నడవడానికి సరియైనటువంటి సద్గురుమూర్తిగా నీకతను ఉపయోగపడలేడు.
కాబట్టి గురువుని మనం ఎట్లా ఉపయోగించుకుంటున్నామనేటటువంటి అధికారిత్వం కూడా చాలా ముఖ్యమైనటువంటిది. ఒక గ్రుడ్డివాడు మరొక గ్రుడ్డివాడిని ఆశ్రయించిన పద్ధతిగా వుండేది అవిద్యా పద్ధతి.
మోహపద్ధతి. ప్రేయోమార్గ పద్ధతి. ఇద్దరూ గ్రుడ్డివాళ్ళైతే పొందే ఫలం కూడా అంధకారమే. కాబట్టి పరలోక ప్రాప్తి సాధనమైనటువంటి ఆముష్మిక సాధనలైనటువంటి ఆధ్యాత్మికమార్గమైనటువంటి ఆత్మయే సర్వాధికమైనటువంటిది అనేటటువంటి మార్గంలో ప్రవేశించాలి అంటే మానవులందరూ తప్పక తపోనిష్ఠ కలిగివుండాలి.
తప్పక ఇంద్రియములను ఇంద్రియార్ధములందు, అవి కోరినటువంటి వాటియందు ప్రవేశింపనివ్వక, నిరోధించి నీ లక్ష్యమైనటువంటి ఆత్మవిచారణా జ్ఞానమున ప్రవేశింపజేసి, మనోబుద్ధులను ఆత్మయందు సంయమింపచేయాలి. మనోబుద్ధులను చైతన్యస్థితి యందు సంయమింపచేయాలి.
ఇంద్రియములను మనోబుద్ధులయందు, మనోబుద్ధులను చైతన్యమునందు, చైతన్యమును తనమూలమైనటువంటి పరమాత్మయందు ఎవరైతే ఉపశమింపచేస్తారో, ఉపరమింపచేస్తారో, విశ్రమింపచేస్తారో, సంయమింపచేస్తారో వారే ఆధ్యాత్మిక సాధనలో పురోగమించగలిగేటటు వంటివారు. అటువంటి ఆత్మవిద్యని గ్రహించవలసినటువంటి అవసరం వున్నది.
ఈ ఆత్మవిద్యకి అత్యంత ముఖ్యమైనటువంటి అధికారిత్వంలో వున్న లక్షణాలు చెప్తున్నారు. అహింస, సత్యం, శౌచం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం మొదలగువానిని యమనియమాదుల యొక్క లక్షణాలన్నిటినీ ఇక్కడ వివరిస్తున్నారు. ఈ అహింస, సత్యం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం ఈ లక్షణాలని తప్పక మానవులందరూ కూడా ఆచరించాలి.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment