గీతోపనిషత్తు - సాంఖ్య యోగము : 7. ఓర్పు - వచ్చి పోవునవి - ఓర్పుగల వానికి సమస్తము అధీనమున నుండును. ఓర్పు లేనివాడు దుఃఖితుడు అగును. ఓర్పుతో తాను చైతన్య స్వరూపుడనని మరల మరల గుర్తు తెచ్చుకొనవలెను.



🌹 7. ఓర్పు - వచ్చి పోవునవి - ఓర్పుగల వానికి సమస్తము అధీనమున నుండును. ఓర్పు లేనివాడు దుఃఖితుడు అగును. ఓర్పుతో తాను చైతన్య స్వరూపుడనని మరల మరల గుర్తు తెచ్చుకొనవలెను. 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 14 📚

మాత్రాస్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖదాః |

ఆగమాపాయినో-నిత్యా స్తాం స్తితిక్షస్వ భారత || 14

వెండితెరపై పాత్రధారులు వచ్చిపోవుచుందురు. వివిధములైన సంభాషణములు వారి నడుమ జరుగుచుండును. సన్నివేశములు నిరంతరము సాగుచుండును. సమస్య లేర్పడుచుండును.

మరియు పరిష్కరింప బడుచుండును. సుఖ పూరితములు, దుఃఖ పూరితములు, ఉద్రేక పూరితములు, రాగద్వేష పూరితములు మరెన్నెన్నియో సమస్యలు వచ్చిపోవు చుండును. అనంతముగా పాత్రధారులు వచ్చిపోవుచుందురు. దృశ్యములు వచ్చిపోవు చుండును. సన్నివేశములు వచ్చిపోవు చుందురు.

వెండితెరపై వచ్చిపోవుచున్న సమస్త దృశ్యములకు వెండి తెరయే ఆధారము. ఎన్ని విషయములు వచ్చిపోవుచున్నను వెండి తెర వెండితెరగానే యుండునుగాని, స్థితి మార్పు చెందదు.

పళిలిరాణికము, సాంఫిుకము, జానపదము అగు ఎన్ని చిత్రములు తెరపై ప్రదర్శింపబడినను, వాని వాసన లేక ప్రభావము వెండితెర కుండదు. సినిమాహాలులోని వెండితెర విందే సృష్టిలోని చైతన్యము.

చైతన్యము ఆధారముగా లోకములు, లోకులు ఏర్పడుదురు. వారి నడుమ సన్నివేశములు కాలము రూపమున ఏర్పడుచుండును. ఇందేదియు చైతన్యము నంటదు. సృష్టిలోని ఈ చైతన్యమునే దైవమందురు.

దాని నాశ్రయించుటచేత జీవులు కూడ సమస్యల కతీతముగ ప్రశాంతముగ జీవించనగును. దాని నాశ్రయించుటకే వివిధ మార్గములు.

సృష్టియందలి ఈ చైతన్యము త్రిగుణాత్మకముగ ఏర్పడినపుడు లోకములు, లోకులు, సన్నివేశ ములు ఏర్పడును. అనగా సినిమా యుండును.

శుద్ధచైతన్యముగా నున్నపుడు సినిమా లేక వెండితెర యుండును. సినిమా వేయబడు నపుడు కూడ వెండితెర ఉన్నప్పటికీ అందలి సన్నివేశములను, సమస్యలను చూచువారికి వెండితెర మరపునకు వచ్చును. వెండి తెర గుర్తున్నవారికి సన్నివేశములన్నియు వచ్చిపోవునవి వలె కనుపించును.

సుఖము - దుఃఖము; సళిలికర్యము- అసళిలికర్యము; లాభము-నష్టము; ధనము-పేదరికము; జననము-మరణము; రాత్రి-పగలు మొదలగునవన్నియు వచ్చిపోవునవియే.

శ్రీకృష్ణుడు అట్టి చైతన్య స్వరూపుడు కనుక ఈ సృష్టి యందలి సమస్తము వచ్చిపోవునవియే అనియు, '' నేను'' అను చైతన్యము శాశ్వత మనియు, అట్టి శాశ్వత ప్రజ్ఞయందు నిలబడిన వానికి మొత్తము సృష్టి అంతయు ఒక సినిమా కథనం వలె ఆనందము నందించు ననియు బోధించెను. అనిత్యములు మరియు వచ్చిపోవు విషయముల యందు ఓర్పు వహించమని బోధించెను.

ఓర్పుగల వానికి సమస్తము అధీనమున నుండును. ఓర్పు లేనివాడు దుఃఖితుడు అగును.

సృష్టి యందలి సమస్త విజయములకును ఓర్పు ప్రధానమని భగవానుడు బోధించెను. ''తితిక్షస్వ భారత'' - ఓ భారతీయుడ! ఓర్పు వహించుము! అని గీత నిర్దేశించుచున్నది.

ఓర్పుతో తాను చైతన్య స్వరూపుడనని మరల మరల గుర్తు తెచ్చుకొనవలెను. అట్లు గుర్తు తెచ్చుకొనుట వలన జీవితము నందలి సమస్తమైన సన్నివేశములు వచ్చిపోవునవియే అని తెలియగలదు. ఈ అభ్యాసము వలననే ఎవనికైనను తెలియుట యుండును గాని, చదువుట, వినుట వలన మాత్రము కాదు.

ఓర్పును మించిన గుణము లేదని, దానిని ముందు పొందుమని గీతోపనిషత్తు ప్రప్రథంమముగా బోధించుచున్నది.

ఓర్పు వలననే శ్రీరాముడు, ధర్మరాజు, హరిశ్చంద్రుడు, నలుడు ఇత్యాది దివ్యాంశ సంభూతులు లోకము లన్నిటిని జయించగల్గిరి.

ఓర్పు మనిషిని మహాత్మునిగ మార్పు ఉత్ప్రేరకము. ఎన్ని సద్గుణము లున్నప్పటికిని ఓర్పు లేనిచో అవి రాణించవు.

🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment