కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 30


🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 30 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. శ్రేయోమార్గము - ప్రేయోమార్గము - 19 🌻

బ్రహ్మచర్యం అన్నదాంట్లో ప్రతి ఒక్కరికీ సందేహం కలగవచ్చు. బ్రహ్మచర్యము అంటే అర్ధము ఏమిటంటే బ్రహ్మమునందు చరించుట.

అనగా అర్ధం ఏమిటంటే ఇంద్రియములను ఇంద్రియార్ధములందు పని చేస్తున్నప్పటికి నేను బ్రహ్మమును, నేను సాక్షిని అని ఎవరైతే విలక్షణంగా వుంటారో, ఆ ఇంద్రియ సుఖమును తాననుభవించడు. శారీరిక చర్య, ఉపచర్యలలో ప్రవర్తించినటువంటి సందర్భాలు ఏర్పడినప్పటికీ కూడా సంయమేంద్రియుడై ఇంద్రియజయాన్ని కలిగియుండి నామమాత్రమై నిమిత్తమాత్రమై ఉంటాడు. అప్పుడేమయ్యాడు? అంటే ఆయా చర్య ఉపచర్యలలో, ప్రతిచర్యలలో పాలుపంచుకున్నట్లుగా చూచేవారికి కనబడుతున్నాడు.

జగత్తుకి చూస్తే మాత్రం అలాగే వున్నట్లుగానే కనబడుతున్నాడు. కాని వాస్తవికంగా తాను అలా లేడు. ఈ రకముగా శరీరమునందే ఉన్నటువంటివాడై వుండి, అశరీరిగా వున్నాడు. దేహమునందే ఉన్నవాడుగా వుండి, దేహిగా వున్నాడు. క్షేత్రమునందే ఉన్నవాడుగా వుండి, క్షేత్రజ్ఞుడుగా వున్నాడు.

ఈ రకమైనటువంటి విభాగన్యాయమును మన అంతరంగమునందు ఏర్పరచుకుని బుద్ధిని గనక చైతన్యమునందు సంయమించేటటువంటి సాధనని, ఉపశమించేటటువంటి సాధనని గనక మనం చేసినట్లయితే నీవు ఆత్మోపదేశమును పొందినవాడవై ఆత్మవిచారణ ద్వారా ఆత్మోన్నతిని సాధించి ఆత్మానుభూతిని, ఆత్మనిష్ఠని పొందగలుగుతావు అనేటటువంటి దృఢమైనటువంటి సరియైనటువంటి మార్గనిర్దేశం చేస్తున్నారు.

శ్రేయోమార్గము ననుసరించువారు అరుదుగా నుందురు. లోకములో నూటికి కోటికి ఎవరో ఒకరే నీవంటివారు ఆత్మజిజ్ఞాస కలవారుందురు. మానవులలో అనేకులు ఆత్మనుగురించి వినుటకు నోచుకొనరు. ఆత్మ జ్ఞానమును ప్రబోధించి ఉపదేశములను వినుటకు అవకాశము కల్పించుకొనరు. ఒకవేళ అట్టి ఉపదేశములను వినుచుండినను వారిలో ఎక్కువమందికి ఆత్మయననేమో తెలియదు. ఆత్మ తత్వమును చెప్పగలవారు కూడా అరుదుగా వుందురు. ఆత్మను గురించి విని, వినిన దానిని మనన నిధి ధ్యాసలచే ఆత్మ నెరుంగువారు కుశలురు.

ఆత్మ తత్వమును బోధించువారు కూడా అతి కుశలురై యుండవలెను. అట్టి నిపుణుడైన ఆచార్యునిచేత బోధింపబడి ఆత్మ నెరుగు వ్యక్తిని అద్భుతమైన వ్యక్తి యనక తప్పదు. - విద్యా సాగర్ స్వామి

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment