భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 144



🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 144 🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. నారద మహర్షి - 18 🌻


132. అసలు సన్యాసికి ఇటువంటి నియమావళి మన సంప్రదాయంలో ఉంది. సన్యాసి పడుకున్నచోట అన్నం తినకూడదు. అన్నం తిన్నచోట పడుకోకూడదు. అంటే పగలు భోజనంచేసిన ఊళ్ళో రాత్రి నిద్రపోకూడదు. సన్యాసికి కేవలం మనసుమాత్రమే నిలకడగా ఉండాలి, శరీరం నిలకడగా ఉండకూదదు. అంతరంగంలో నిలకడ ఉండాలి.

133. జనపదాల విషయం వచ్చినప్పుడు, గృహస్తులవిషయం వచ్చినప్పుడు, సన్యాసి వాళ్ళ ఇళ్ళల్లో ఉండకుండా ఆశ్రమాన్ని నిర్మించుకుని దూరంగాపోవచ్చు. ఎవరికీ కనబడకుండా ఉండాలి. అందరికీ కనబడేటట్లు మధ్యలో ఉంటే, సన్యాసి అనిపించుకోడు.

జగత్పూజ్యుడు, జగద్గురువు అని ఎవరినయితే మన్నిస్తారో, అలాంటివారికి ఒక వేదన కలుగుతుంది. “నన్ను గురువు అని నమస్కారం చేస్తున్నాడు.

134. ఇతడి నమస్కారానికి నేను అర్హుణ్ణేనా? అతడికి చెప్పవలసినవన్నీ చెప్పానా? ఇతడికి నావలన ఏ ఉపకారమైనా జరిగిందా! నా బోధ సంపూర్ణమయిందా!” అనే వేదన గురువుకు ఉంటుంది. ఎందుకంటే, నమస్కారం స్వీకరించటం సులభమేకాని దానికి ప్రత్యుపకారం చేయటం సులభంకాదు. ఆశీర్వచనం చేయాలి. అదికూడా మనస్ఫూర్తిగా ఆశీర్వచనం చేయాలి. ఇందులో శక్తి ఉండాలి, తపస్సు ఉండాలి, చిత్తశుద్ధి ఉండాలి. ఇది తేలికయిన విషయమా! నమస్కారం ఎంతో సులభం.

135. ‘ఆ,కా,మా,వై’ – ఆషాదం, కార్తీకము, మాఘము, వైశాఖము – ఈ నాలుగు మసాలలోని పూర్ణిమలన్నీ కూడా పవిత్రమైనవి. చాతుర్మాస్య వ్రతాలని చెసుకుంటారు. చాతుర్మాస్య వ్రతాలు బ్రాహ్మణులకు – సన్యాసులకే కాదు, అందరికీ పవిత్రమయినవి. నేలమీద నిద్రపోవటము, మితాహారము, ధ్యానము, పరమసాత్వికమైన మనోభావాలతో కూడినటువంటి నియమబద్ధమైన జీవనం అవలంబించాలి అటువంటి జీవనంతో ఆ నాలుగుమాసాలు గడపాలి. ‘వైయాసికి’ అంటే వ్యాసుడి భావతం.

136. భాగవతం వ్యాసుడి హృదయం. ఆయన తపస్సు, హరిభక్తి, ఆయనే ప్రకారంగా ఈ సృష్టిని అర్థంచేసుకున్నాడో ఆ పరమార్థం, చరమంగా జీవులకేది క్షేమమని నిర్ణయించాడో ఆ జీవిత పరమార్థం అంతా పిండి ఒకచోట పెట్టి, ‘భాగవతం‘ మనకు ప్రసాదించాడు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


26 Oct 2020


No comments:

Post a Comment