✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍀 21. నిగ్రహము - అనుగ్రహము - తమను, తమ జీవితమును, తమ కార్యక్రమములను పరిపూర్ణముగ దైవమునకు సమర్పించి, అతని అనుగ్రహము కొరకే జీవించుట కర్మ సంగములేని మార్గము. 🍀
33. సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేర్ఙ్ఞానవానపి |
ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి || 33 ||
భగవానుడు బుద్ధినికాని, తనను కాని ఆశ్రయించి కర్మమును చేయమని తెలుపుచు మరియొక ముఖ్యాంశమును ఆవిష్కరించు చున్నాడు. ఇది తెలిసినచో దైవమునకు శరణాగతియే మార్గమని, ఇతర మార్గములు పూర్ణశ్రేయోదాయకము కాదని తెలియును. ఇది తెలియుట ముఖ్యము.
ఎంత జ్ఞానవంతుడైనను ప్రకృతిలోని వాడేగదా! త్రిగుణముల కీవలివాడు జీవుడు, ఆవలివాడు దేవుడు. ప్రకృతి నుండి పుట్టిన జీవులు ప్రకృతిని దాటలేరు. తమ ప్రకృతికిలోనై మాత్రమే జీవించగలరు.
జ్ఞానవంతుడైననూ యింతియే సుమా, అని శ్రీ కృష్ణుడు హెచ్చరించుచున్నాడు. కావున ప్రకృతిని దాటుటకు దైవము యొక్క అనుగ్రహము, ప్రకృతి యొక్క కరుణయు ముఖ్యము. రెండునూ ఒకటియే. బ్రహ్మ, రుద్రుడు, ఇంద్రుడు వంటి లోక పాలకులు కూడ ప్రకృతి మాయలో పడినవారే. పొరపాట్లు చేసినవారే. మరల దైవానుగ్రహము చేత, తమ స్థితియందు నిలిచిరి.
ఇక మానవులందలి జ్ఞానులెంత? వారి నిగ్రహమెంత? భగవంతుని అనుగ్రహమునకై ప్రయత్నింపవలెను గాని, నిగ్రహ మార్గము ననుసరించుట కాదు. మనో దేహేంద్రియములు ప్రకృతి యధీనమున నున్నవి. తన యధీనమున యున్నవని భావించు వాడు అవివేకి, అహంకారి. అందువలన చివరకు మిగులునది శరణాగతి మార్గమే.
తమను, తమ జీవితమును, తమ కార్యక్రమములను పరిపూర్ణముగ దైవమునకు సమర్పించి, అతని అనుగ్రహము కొరకే జీవించుట కర్మ సంగములేని మార్గము.
అహంకారమునకు లోబడియే బుద్ధి పనిచేయును. అహంకారము ప్రకృతికి లోబడి యుండును. అనగా గుణములకు లోబడి యుండును. కావున జ్ఞానియైననూ, దైవమునకు శరణమనవలసినదే. మరియొక మార్గము లేదు.
దీనివలన తెలియవలసిన ముఖ్యాంశమేమనగా, సమస్తము నందు దైవచింతన పెంచుకొనుటయే గాని, “కామము పారద్రోలుడు, ఇంద్రియములను నిగ్రహింపుడు, సద్భావములే కలిగి
యుండుడు, సత్ప్రవర్తనమే ఆశ్రయింపుడు” అని నినాదములు చేయుచు, బోధలు చేసినచో అవియన్నియు నిరుపయోగములు.
ప్రకృతి వశులగుటచేత ఎవ్వరునూ నిర్వర్తింపలేరు. దైవము నాశ్రయింపుడు, దైవచింతనము పెంచుకొనుడు, అనురక్తితో భజింపుడు, దైవమును కామింపుడు, ప్రేమింపుడు అను వాక్యములు పై నినాదముల కన్న మిన్నగ పరిష్కార మందించును.(3-33)
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
26 Oct 2020
No comments:
Post a Comment