శ్రీ శివ మహా పురాణము - 256



🌹 . శ్రీ శివ మహా పురాణము - 256 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴

60. అధ్యాయము - 15

🌻. నందావ్రతము - శివస్తుతి - 1 🌻

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఓ మునీ! తరువాత ఒకనాడు నేను నీతో గూడి తండ్రి ప్రక్కన నిలబడియున్న ఆ సతీ దేవిని చూచితిని. ముల్లోకముల సారభూతమైన ప్రకృతి ఆమెయే (1). తండ్రి నీకు, నాకు నమస్కరించి సత్కరించుటను చూచిన సతీదేవి ఆనందముతో లోకలీలను అనుసరించునదై భక్తితో మనలకు నమస్కరించెను (2). ఓ నారదా! మనమిద్దరము దక్షునిచే ఈయబడిన శుభాసనము నందు కూర్చుండి యుంటిమి. అపుడు నమస్కారము చేసి వినయముగా నిలబడియున్న సతిని చూచి నేను ఇట్లంటిని (3). నిన్ను ఎవడు ఏకాంత నిష్ఠతో ప్రేమించుచున్నాడో, ఓ సతీ! ఎవనిని నీవు ప్రేమించుచున్నావో అట్టి సర్వజ్ఞుడుస,జగత్ర్పభువు అగు దేవ దేవుని భర్తగా పొందుము (4).

ఏ ఈశ్వరుడు ఇతర స్త్రీని స్వీకరించలేదో, స్వీకరించుట లేదో, భవిష్యత్తులో స్వీకరించడో ఆతడు నీకు భర్తయగుగాక! ఓ శుభకరీ! నీ భర్తకు సాటి మరియొకరు లేరు (5). నారదా!మనము ఇట్లు పలికి చాలసేపు దక్షుని ఇంటిలో నుండి ఆమెను చూచితిమి. తరువాత దక్షుడు సాగనంపగా స్వస్థానమును పొందితిమి (6). ఆ మాటను విని దక్షుడు మిక్కిలి సంతసించెను. ఆతని చింత తొలగెను. ఆతడు తన కుమార్తెను దగ్గరకు తీసుకొనెను. ఆమె పరమేశ్వరియని ఆతడు ఎరుంగును (7). భక్తవత్సల, స్వేచ్ఛచే ధరింపబడిన మానవాకృతి గలది యగు సతీదేవి ఈ తీరున బాల్యమును అందమగు ఆట పాటలతో గడిపి, కాలక్రమములోబాల్యావస్థను దాటి ఎదిగెను (8).

ఆ సతీదేవి బాల్యమును దాటి ¸°వనములో అడుగిడెను. ఆమె సర్వాయవ సుందరియై యుండెను. ఆమె సన్నని దేహముతో శోభిల్లెను (9). దక్ష ప్రజాపతి ¸°వనములో అడుగిడిన ఆమెను చూచి, ఈమెను శివునకు ఇచ్చి వివాహమును చేయుట ఎట్లాయని ఆలోచించెను (10). ఆమె కూడా అదే కాలములో శివుని భర్తగా పొందవలెనని గోరెను. ఆమె తండ్రి మనస్సును ఎరింగి తల్లి వద్దకు వచ్చెను (11). పరమేశ్వరియగు ఆ సతీదేవి వినయముతో కూడిన మనస్సుగలదై, శివుని ఉద్దేశించి తపస్సునుచేయుటకై తల్లియగు వీరిణిని అనుమతిని గోరెను (12).

దృఢమగు వ్రతముగల సతీదేవి మహేశ్వరుని భర్తగా పొందుట కొరకై తల్లి అనుజ్ఞను పొంది ఇంటియందు ఆయనను ఆరాధించెను (13). ఆమె ఆశ్వయుజమాసములో పాడ్యమి, షష్ఠి, ఏకాదశి తిథులయందు పులిహోరను, మధురాన్నమును నైవేద్యమిడి శివుని భక్తితో పూజించుచూ గడిపెను (14). కార్తీక చతుర్దశినాడు చక్కగా తయారుచేసిన అప్పములను, పాయసములను నైవేద్యమిడి పరమేశ్వరుని ఆరాధించెను (15). మార్గశీర్ష కృష్ణాష్టమి నాడు నీటితో అభిషేకించి యవధాన్యపు అన్నమును నైవేద్యమిడి సతీదేవి శివుని మరల పాలతో అభిషేకించెను. ఆమె దినములనీ తీరున గడిపెను (16).

పుష్య శుక్ల సప్తమినాడు రాత్రియందు జాగరణము చేసి , ఆ సతి ఉదయము కూరగాయలతో కలిపి వండిన అన్నమును శివునకు నైవేద్యమిడి పూజించెను (17). ఆమె మాఘపూర్ణిమ నాడు రాత్రి యందు జాగరణము చేసి తడి బట్టలతో నదీ తీరముందు శంకరుని పూజించెను (18). ఫాల్గుణ కృష్ణ చతుర్దశి నాడు రాత్రి జాగరణము చేసి నాల్గు యామముల యందు మారేడు దళములతో విశేష పూజలను చేసెను (19). చైత్ర శుక్ల చతుర్దశి నాడు ఆమె రాత్రింబగళ్లు శివుని మోదుగు పుష్పములతో మరియు దమనము అనే సుగంధి పత్రములతో పూజించెను. మరియు ఆ మాసమును శివధ్యానముతో గడిపెను (20).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


26 Oct 2020

No comments:

Post a Comment