🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 85 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. ఆత్మను తెలుసుకొను విధము -15 🌻
కాబట్టి, తీర్థ ఆరామ క్షేత్రాదులను దర్శించడం అనేది సంస్కారయుతమైనటువంటి వాటిలో భాగము. నిజానికి నీవు పొందగలిగితే నీ ఆత్మ స్వరూపాన్ని నీ హృదయ స్థానంలోనే, నీ హృదయాకాశములోనే, నీ బుద్ధి గుహలోనే, నీ అంతర్ముఖంలోనే నీవు పొందగలుగుతావు.
అలా పొందగలిగిన వారు, రోజూ జ్యోతిష్టోమాది కర్మలను ఆచరించే వారు, అలాగే పంచాగ్నులను ఒనర్చించేటటువంటి వారు, అలాగే త్రిణాచికేతాగ్నిని - నాచికేతాగ్నిని - రోజుకు మూడు సార్లు చయనం ఒనర్చేటటువంటివారు, ఎటువంటి స్థితిని ఆశ్రయిస్తున్నారో, ఎటువంటి లక్ష్యాన్ని అనుభవిస్తున్నారో, ఎటువంటి లక్ష్యసిద్ధిలో ప్రవేశిస్తున్నారో, వాళ్ళు కూడా ఆ కర్మ ఉపాసనకి లక్ష్యమైనటువంటి ఆత్మానుభూతి ఏదైతే ఉన్నదో, ఆ ఆత్మానుభూతిని, ఆ పరమాత్మ తత్వమునే, ఆ పరబ్రహ్మనిర్ణయమునే నొక్కి ఒక్కాణిస్తున్నారు. స్థిరముగా చెబుతున్నారు.
కాబట్టి, మానవులందరూ ఒకవేళ వేదాధ్యయనపరులైతే నేమో అలా అగ్ని సంచయనము ద్వారా, వాళ్ళు ఆత్మతత్వంలోకి ప్రవేశిస్తారు. అలా వేదాధ్యయనపరులు కాని వారు, తమ చిత్తశుద్ధితో, బుద్ధిగుహయందున్న, హృదయస్థానము నందున్న, స్వస్వరూప జ్ఞానమైన, స్వయం ప్రకాశకమైన ‘నేను’ ను పొందే ప్రయత్నం చేయాలి. అంతేకానీ, నీడ వలె ఉన్నటువంటి జీవాత్మను ఆశ్రయించరాదు అని చెబుతున్నారు.
(జీవాత్మ - పరమాత్మ లిరువురు కర్మ ఫలమును అనుభవించుటకు శరీరంలో ప్రవేశించినటుల చెప్పబడినది. జీవాత్మ మాత్రమే కర్మఫలమును అనుభవించును. ‘శరీరస్థోపి కౌన్తేయ నకరోతి నలిప్యతే’ - అని భగవద్గీతలో కూడా చెప్పినటుల పరమాత్మ కర్మలను ఒనర్చుట లేదు. వాని ఫలమును అనుభవించుట లేదు. అయినప్పటికి ఛత్రి న్యాయమున వారిద్దరూ అనుభవించుచున్నటుల చెప్పబడినది.)
ఇక్కడ మనకందరికి రావల్సిన సందేహం గురించి వ్యక్తీకరిస్తున్నారు. అంటే అర్థం ఏమిటంటే, ఏమండీ, పరమాత్మ సమస్త జీవుల హృదయాంతరాళములో ఉన్నాడన్నప్పుడు, అదే స్థానంలో జీవాత్మ కూడా ఉన్నాడన్నప్పుడు, మరి కర్మానుభవం జీవాత్మకు, పరమాత్మకు కూడా ఉండాలి కదా! అనేటటువంటి సందేహం మీకు రావచ్చు. కానీ, పరమాత్మ సమిష్టి స్వరూపుడు, జీవాత్మ వ్యష్టి స్వరూపుడు. ఇది ఒక శరీరం అనేటటువంటి పరిమితికి మాత్రమే చూడగలిగి అనుభవించ గలిగే పరిమితమైనటువంటి శక్తిగలవాడు జీవాత్మ.
సర్వవ్యాపకమైనటువంటి, సృష్టి యందు అంతటా వ్యాపించి ఉండి, ఏకకాలంలో సాక్షిగా ఉన్నటువంటివాడు పరమాత్మ. పరమాత్మ స్థితియందు ఏక కాలంలో, సర్వ సాక్షిత్వము ఉన్నది, సర్వ కర్తృత్వము ఉన్నది, సర్వ భోక్తృత్వము ఉన్నది. సర్వ హర్తగా కూడా ఉన్నాడు. కాబట్టి పరమాత్మ కర్మఫలాన్ని అనుభవిస్తున్నాడని చెప్పజాలము.
కాని జీవాత్మ ప్రారబ్ద, ఆగామి, సంచిత కర్మలు అనేటటువంటి త్రివిధ కర్మల చేత, కర్మచక్రంలో తిరగుతూ ఉంటాడు. వాని యొక్క సృష్టి స్థితి లయములు శరీరమును పొందడం అనేది ఈ కర్మఫలానుసారము కర్మచక్రమును అనుసరించి జరుగుతూ ఉంటుంది. కానీ, పరమాత్మ సంకల్ప సృష్టిగా సర్వసృష్టిని సృజించగలిగే సామర్థ్యం కలవాడగుట చేత, సర్వకర్త, సర్వభర్త, సర్వహర్త, సర్వభోక్త అయినటువంటి పరమాత్మ సర్వసాక్షి కూడా అయివున్నందున అతనికి కర్మఫలము లేదు.
దీనినే భగవద్గీతలో ‘నకరోతి, నలిప్యతే ’ శరీరములో ఉన్నప్పటికి, ‘శరీర అస్థోపి’ - శరీరము నందు ఉన్నప్పటికీ, ఆత్మ ‘న కరోతి, న లిప్యతే’. పని చేయదు, ఏమి పొందదు. ఏక కాలములో నీలో ఉన్నటువంటి సత్యనేను, యథార్థ నేను ఏదైతే ఉన్నదో, అది ఏమీ చేయుట లేదు. అదేమిటండీ? ఇప్పుడు మీరు మాట్లాడుతున్నట్లు కనబడుతున్నారు కదా అంటే, నా యథార్థనేను మాట్లాడటం లేదు. నా చైతన్యనేను మాట్లాడటం లేదు. నా ఆత్మనేను మాట్లాడటం లేదు.
కాబట్టి, వ్యవహారిక నేను వేరుగా ఉన్నది. యథార్థ నేను వేరుగా ఉన్నది. వ్యవహారిక నేనుకు జీవాత్మ అని పేరు. ఏ నేనైతే చలించకుండా స్థిరముగా ఉన్నదొ, పరిణామము లేక ఉన్నదొ దానికి ఆత్మయని పేరు. ఈ రెంటి యొక్క యథార్థ స్వరూప స్వభావ స్థితులలో మనిషి సాధన పూర్వకముగా అర్థము చేసుకోవాలి.
నీలోపలికి నిన్ను నువ్వు అన్వేషించుకుంటూ పోవడం ద్వారా, నిన్ను నువ్వు తెలుసుకోవడం ద్వారా, తనను తాను గుర్తెరగడం ద్వారా, సెల్ఫ్ రియలైజేషన్ [self realization] ద్వారా, ఆత్మానుభూతి ద్వారా, కదలని డాగలి మీద అనేక పనిముట్లు తయారైనట్లుగా తయారౌతుంది ఈ ప్రపంచమంతా. ఇది కూటస్థం అంటే.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
26 Oct 2020
No comments:
Post a Comment