గీతోపనిషత్తు - 57





🌹. గీతోపనిషత్తు - 57 🌹

🍀 18. శరణాగతి - శరణాగతి మార్గమునకు దైవము రెండు నియమముల నేర్పరచినాడు. ఆశ, మోహము అనునవి దరిచేరనీయక తోచినది దైవార్పణ బుద్ధితో చేయుట. 🍀

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


📚. కర్మయోగము - 30 📚


30. మయి సర్వాణి కర్మాణి సంన్యస్యాధ్యాత్మచేతసా |

నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః || 30 ||


భగవంతుడు కర్మలయందు శరణాగతి మార్గమును కూడ నందించినాడు. సమస్త కర్మలను తనయందు సన్యసించి, ఆశా మమకారము లేక, నిర్వర్తించు చుండుమని ఆదేశించినాడు.

'సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు', 'బ్రహ్మార్పణమస్తు' అను పదములు వినుచునే యున్నాము. రెంటి యర్థము ఒకటే. చేయుట యందలి సుళువులు బుద్ధిబలముచే గ్రహించుట సుళువు కాదు. కొన్ని సమయములందు విచికిత్స యుండగలదు. చేయవలసినదా, చేయదలచినదా అనునది సులభముగ తేలదు. అపుడేమి చేయవలెను?

ఇట్టి ప్రశ్నలు నరులకు సహజమే. చేయవలసినది కానిచో కర్మఫల మేర్పడునేమో, చేయవలసినది చేయకుండినచో అందుండి కూడ ఫలితములు ఏర్పడునేమో. చేయవలెనా? వలదా? అను ప్రశ్నలు పుట్టవచ్చును.

ధర్మజ్ఞునికైననూ సంకటము కలిగించు సన్నివేశములు పురాణములయందు కోకొల్లలుగా నున్నవి. ఇట్టి సమయమున విచికిత్స కన్న దైవమునకు సమర్పణము చెంది, తోచినది చేయుటయే శరణ్యము.

కాని శరణాగతి మార్గమునకు దైవము రెండు నియమముల నేర్పరచినాడు. ఆశ, మోహము అనునవి దరిచేరనీయక తోచినది దైవార్పణ బుద్ధితో చేయుట.

అర్జునుడు విచక్షణాపరుడే. ధర్మపరుడే. కర్తవ్య నిర్వహణమున చెదరనివాడు. అట్టివానికే యుద్ధము చేయవలెనా? వద్దా అను ప్రశ్న పుట్టినది. అట్లు పుట్టుటకు కారణము పితామహుని యందు, గురువు నందుగల మోహమే. ఇతరులను సంహరించుట కతడు సంసిద్ధుడే. కాని తాతయందు మోహము వలన కర్తవ్యమున చెదరెను. ఏమియు పాల్పడక చతికిలపడెను.

అట్టి మోహబద్ధునికి కర్తవ్యమును గూర్చి వివరించిననూ అది యందదు. అందువలన శరణాగతి మార్గమును దైవము బోధింపవలసి వచ్చినది. నరులకిట్టి సంకటములు సహజమే.

అట్టి సమయమున దైవార్పణముగ కార్యములు నిర్వర్తించుట యిచట తెలుపబడినది. కర్మ మార్గమున దైవమిచ్చు తుది పరిష్కార మిదియే. భారము భగవంతుని పై వేసి ఆశామోహములు లేక తోచినది చేయుట అనునది సూత్రము. (3-30)

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹



Facebook, WhatsApp, Telegram groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


21 Oct 2020

No comments:

Post a Comment