రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
59. అధ్యాయము - 14
🌻. సతీజన్మ - బాల్యము - 1 🌻
బ్రహ్మ ఇట్లు పలికెను -
హే దేవర్షీ! ఇంతలో లోకపితామహుడనగు నేను వాని వృత్తాంతము నెరింగి, ప్రీతితో వేగముగా నచటకు విచ్చేసితిని (1). విద్వాంసుడనగు నేను పూర్వమునందు వలె నే దక్షుని ఓదార్చితిని. వానితో నీకు మంచి స్నేహమును కలిగించి, నీకు మిక్కిలి ప్రీతిని కలిగించితిని (3). నా కుమారుడవు, మునిశ్రేష్ఠుడవు, దేవతలకు ఇష్టుడవు అగు నిన్ను మిక్కిలి ప్రీతితో ఓదార్చి,నిన్ను తీసుకొని నేను నా ధామమునకు చేరుకొంటిని (3). తరువాత నాచే ఓదార్చబడిన దక్ష ప్రజాపతి తన భార్యయందు అరవై మంది సుందరీమణులగు కుమార్తెలను కనెను (4).
ఆతడు శ్రద్ధతో వారి వివాహమును ధర్మడు మొదలగు వారితో చేసెను. ఓ మహర్షీ! ఆ విషయమును మక్కిలి ప్రీతితో చెప్పెదను. వినుము (5). ఓ మహర్షీ! దక్షుడు ధర్మునకు పదిమందిని, కశ్యప మహర్షికి పదముగ్గురిని, చంద్రునకు ఇరవై ఏడు మందిని (6), అంగిరసునకు ఇద్దరిని, కృశాశ్వునకు ఇద్దరిని, తార్ క్ష్యునకు మిగిలిన కన్యలను ఇచ్చి యథావిధిగా వివాహమును చేసెను. వారి సంతానముతో (7) ముల్లోకములు నిండెను. విస్తర భీతిచే ఆ వివరములను చెప్పుట లేదు. సతీదేవి పెద్ద కుమార్తెయని కొందరు మధ్యమ కుమార్తెయని కొందరు చెప్పెదరు (18).
కనిష్ఠ కుమార్తె యని మరి కొందరి మతము. కల్ప భేదముచే ఈ మూడు పక్షములు సత్యమే. కుమారులు పుట్టిన తరువాత దక్ష ప్రజాపతి భార్యతో గూడి (9), మిక్కిలి సంతసించిన మనస్సు గలవాడై ఆ జగన్మాతను మనస్సులో ధ్యానించెను. ఆతడు గద్గ దమగు వాక్కుతో ప్రేమతో ఆమెను స్తుతించెను (10). ఆమెకు వినయముతో దోసిలి యొగ్గి అనేక ప్రణామములాచరించెను. అపుడా దేవి సంతసించి మనస్సులో ఇట్లు తలపోసెను (11). నేను ప్రతిజ్ఞను నెరవేర్చుకొనుటకై ఈ వీరిణియందు అవతరించెదను. ఇట్లు తలచి ఆ జగన్మాత దక్షుని మనసులో స్థిరముగనుండెను (12).
ఓ మరర్షీ! అపుడా దక్షుడు మిక్కిలి ఉల్లాసముగ నుండెను. అపుడు దక్షుడు సుముహూర్తమునందు ఆనందముతో భార్యతో కలిసి రమించెను (13). అపుడు దయావతియగు ఉమ దక్షుని భార్య యొక్క మనస్సులో నివసించెను. దక్షుని భార్యకు తరువాత గర్భిణీ చిహ్నములన్నియూ బయలు దేరెను (14). వత్సా! మిక్కిలి ఆనందముతో నిండిన మనస్సుగల ఆ వీరిణి అధికముగా ప్రకాశించెను. ఉమ ఆమె గర్భములో నుండుటచే ఆమె మహా మంగళ రూపిణిగా కన్పట్టెను (15). దక్షుడు తన కులమునకు, సంపదకు, విద్యకు, మనస్సు యొక్క ఉదారతకు అనురూపముగా ప్రీతితో ఆమెకు పుంసవనాది సంస్కారములను చేయించెను (16).
అపుడా సంస్కార కర్మలయందు గొప్ప ఉత్సవము జరిగెను. ఆ ప్రజాపతి బ్రాహ్మణులకు కోరినంత ధనమునిచ్చెను (17). అపుడు ఉమాదేవి వీరిణి యొక్క గర్భములో నున్నదని యెరింగి విష్ణువు మొదలగు దేవతలు ఆనందించిరి (18). వారందరు అచటకు వచ్చి జగన్మాతను స్తుతించిరి. లోకములకు ఉపకారమును చేయు ఆ తల్లికి అనేక పర్యాయములు ప్రణమిల్లిరి (19). అపుడు వారు ఆనందముతో నిండిన మనస్సులు గలవారై దక్ష ప్రజాపతిని, వీరిణిని అనేక విధములుగా ప్రశంసించి తమ గృహములకు వెళ్లిరి (20).
ఓ నారదా! తొమ్మిది మాసములు గడువగానే దక్షుడు లౌకిక కర్మలను చేయించెను. పదవ మాసము నిండగానే ఆ ఉమాదేవి (21) తల్లిముందు వెంటనే ఆవిర్భవించెను. సుఖకరమగు ఆ ముహూర్తములో చంద్ర గ్రహతారలు అనుకూలముగ నుండెను (22).
ఆమె పుట్టిన తోడనే ప్రజాపతి ఎంతయూ సంతసించెను. తేజోమండలముచే చుట్టు వారబడియున్న ఆ శిశువును చూచి ఆమెయే దేవియని ఆతడు మురిసెను (23). అపుడు చక్కని పుష్పవృష్టి కురిసెను. మేఘములు నీటిని వర్షించినవి. ఓ మహర్షీ! ఆమె పుట్టిన వెనువెంటనే దిక్కులు ప్రసన్నములాయెను (24). దేవతలు ఆకాశమునందు శుభవాద్యములను మ్రోగించిరి. అగ్నులు శాంతముగా ప్రజ్వరిల్లినవి. సర్వము సుమంగళమాయెను (25).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
Facebook, WhatsApp, Telegram groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/
21 Oct 2020
No comments:
Post a Comment