భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 141



🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 141 🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. నారద మహర్షి - 15 🌻

113. ప్రపంచంలో ద్వైతస్థితిలో ఉండి, దాని ఉపాసన అలాగే చేస్తూ, ఇతరములను ద్వేషిస్తున్నంత సేపూ ముక్తి ఉండదు. ఒక వస్తువు నందు తీక్షణమైన అభినివేశం, భతి మనోబుద్ధి చిత్తాహంకారములు దానియందు లయచెందేంత ఏకాగ్రత వస్తే ఇంక దేనిపైనా ద్వేషం ఉండదు.

114. తన ఉపాసనలోని, భక్తిలోని అసంపూర్ణత్వం వలననే ఇతరమతములను ద్వేషించే స్థితి అతడిలో వస్తుంది.

తరువాత నారాయణఋషి నారదునితో, “శ్రీకృష్ణావతార చరిత్రలో కృష్ణుడుకూడా శుద్ధమైనటువంటి బ్రహ్మమే! అతనియందు బ్రహ్మభావనే తప్ప దేహాత్మభావన ఏమీలేదు. అష్టభార్యలను స్వీకరించాడు. అదంతా అతడికి బంధనం కాలేదు.

115. నాయనా! నీవు బ్రహ్మజ్ఞానమునందే స్థిరుడవయితే ప్రకృతి నిన్ను బంధించదు. నువ్వు సంసారంలో ప్రవేశిస్తే మాత్రం అది నిన్నెందుకు బాధిస్తుంది? మోహంతో ఉన్నవాడినే సంసారం బాధిస్తుందికాని, విరాగి ధర్మస్వరూపంగా సంసారాన్ని భావిస్తే, లోకానికేమో అది ఆదర్శహేతువవుతుంది. నీకిది మంచిది” అని చెప్పాడు.

116. విష్ణువు దగ్గరికి తిన్నగా వెళ్ళి విష్ణుదర్శనం చేసుకోగలిగినవాడు, ఇక్కడ భూలోకంలో విష్ణువును గురించి అష్టాక్షరీ జపం చేసుకోవతం ఏమిటి? అన్న ప్రశ్న పుట్టవచ్చు. చక్షురాది ఇంద్రియములకు విష్ణుదర్శనం అవుతుంది తప్ప ఆత్మకు ఆ తత్త్వానుభూతి కలుగలేదు.

117. అంతఃకరణములో ఈశ్వరుడి దర్శనం అయింది అంటాం! అంటే ఎమిటి? నేత్రేంద్రియానికి, మనోనేత్రానికి, ఒక దర్శనం లభించి అంతరించి పోయింది. ఒకనాడు అరగంట కనబడింది. ఒక్క నిమిషం కనబడింది, వెళ్ళిపోయింది. నువ్వు నువ్వుగానే ఉన్నావు. నీ ఆకలి, నీ దప్పిక, నీ భయం, నీ భ్రాంతి, నీ మృత్యువు, నీ శరీరం ఇవి ఇలా యథా పూర్వంగా ఉండనే ఉన్నాయికదా! ఇక దర్శనం యొక్క ఫలమేమిటి? ఆ దర్శనంలో యథార్థమైన లాభమేమిటంటే, తత్త్వం జీవగతం, హృదయగతం.

118. యోగము, తపస్సులు మనిషికి శక్తినిస్తాయి. ముందు గనక ఇతడిలో జ్ఞానము, వివేకము లేకపోతే ఆ తపోబలాలు అన్నీ కూడా మూర్ఖుడి చేతుల్లో ఆయుధంవలె దుర్వినియోగం అయిపోతాయి. ఈ కథలన్నీ చెప్పే నీతి అదే. తపోబలం చేత, యోగబలం చేత శక్తులొస్తాయి. కాని శక్తిని వినియోగించు కోవలసినటువంటి వివేకము ఎలా కోరుకోవాలో, ఎలా నిగ్రహంతో ఉండాలో ఈ గాథల వల్ల తెలుస్తుంది.

119. అలాగే మనకు రాజకీయాలలోకూడా – అధికారంలోకి వచ్చిన తరువాత, రాజ్యపరిపాలనో ఏది మంచిది, ఏది చెడ్డది, నా కర్తవ్యం ఏమిటి, నేను ఏంచెయ్యాలి, నేను ధనం సంపాదించి చాలా కీర్తి సంపాదించాలా? రెండింటికీ సంబంధించిన పుణ్యం సంపాదించాలా? అనే ప్రశ్నలు వేసుకునే వివేకం నేటివారికి అవసరం.

120. ప్రజలకు సేవచేస్తే పుణ్యం వస్తుంది. కీర్తి రాకపోవచ్చు లేక కీర్తి రావచ్చును కూడా! వీటన్నిటికంటే అధమాధమమైంది ధనంమీద ఆశ పెట్టుకోవటం. అధికారంలో ఉన్నప్పుడు అత్త్యుత్తమమైన వస్తువును ఆశించక, అధమాధమమయిన ధనాన్ని ఆశిస్తారు, ధనాన్ని ఆశించే వాడికి భగవంతుడు ఒక అవకాశం ఇస్తాడు, పుణ్యం సంపాదించుకోవటానికి.

121. అటువంటి ఒక అవకాశం దొరికినప్పుడు, అట్టి సదవకాశాన్ని వదిలిపెట్టుకుని ఎందుకూపనికిరాని, అనర్థహేతువైనటువంటి ధనాన్ని సంపాదించుకుంటారు, అవివేకం అన్నమాట! అలాగే, అధికారం సులభమే కాని వివేకం సులభం కాదు. తపస్సులు చేసికూడా ఆనాడు వివేకాన్ని అడగలేదు వాళ్ళు. సంపాదించే ప్రయత్నమే చేయలేదు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹



Facebook, WhatsApp, Telegram groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/



21 Oct 2020

No comments:

Post a Comment