కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 80



🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 80 🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. ఆత్మను తెలుసుకొను విధము -10 🌻

ఇక్కడ యమధర్మరాజు గారు నచికేతునకు ఆత్మని పొందడం అనే అంశం గురించి, దానికి గల అధికారిత్వము గురించి చక్కగా వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అనగా అర్థం ఏమిటంటే, ఆత్మని పొందాలి అని మానవులందరికీ కూడా అనిపిస్తూఉంటుంది. కానీ, దాని యందు చిత్త శుద్ధి లేకపోవడం వలన దానిని పొందలేక పోతున్నారు. తన యందే ఉన్నటువంటి ఆత్మని తాను పొందడం ఏమిటి అనేటటువంటి కుసంశయాలకు తావిస్తాడన్నమాట.

ఎట్లా అంటే, దానికి కారణం ఏమిటంటే, ప్రపంచంలో చాలామంది మనుష్యులు ఉంటారు. అందులో వారు రకరకాలైనటువంటి విద్యలను నేర్చుకుంటారు. వ్యవహారిక విద్యలతో పాటు, వేదాధ్యయనం కూడా చేసేటటువంటి మానవులున్నారు. వేదాధ్యయనం చేసినప్పుడు ఈ ఆత్మ విషయం కూడా బోధించబడుతుంది.

అలా నారాయణ సూక్తం, మహానారాయణోపనిషత్తు, కఠోపనిషత్తు, కేనోపనిషత్తు, ముండకోపనిషత్తు, ఈశావాశ్యోపనిషత్తు, బృహదారణ్యకోపనిషత్తు, ప్రశ్నోపనిషత్తు ఇలా దశోపనిషత్తులని వేదాధ్యయనం చేసినటువంటి వారికి బోధిస్తారు. వారు వేదంతోపాటుగా, ఈ ఉపనిషత్తులను కూడా వల్లె వేస్తారు. తద్వారా ఆత్మ యొక్క విషయ పరిజ్ఞానం అంతా కూడా మౌళికముగా, వాచ్యముగా వాళ్ళకి తెలుస్తుంది.

అయితే దాని యొక్క లక్ష్యార్థమైనటువంటి, వాచికమైనటువంటి, యథార్థమైనటువంటి ఆత్మానుభూతి లేకపోవడం వలన ధారణ శక్తి చేత, తాను ఏదైతే ఆత్మానుభూతికి సంబంధించినటువంటి వాక్య సముదాయము ఉంటుందో, ఆత్మ యొక్క లక్షణాలు ఏవైతే ఉంటాయో, అవన్నీ కూడా పారంపర్య గురు పీఠములందు కూడా బోధించబడుతుంది.

భారతదేశంలో కానీ, ప్రపంచం మొత్తం మీద కానీ, పారంపర్య గురపీఠాలు చాలా ఉన్నాయి. అన్ని చోట్ల కూడా ఆత్మ యొక్క లక్షణాలు అనగానే, ప్రతి వారికి కూడా బాగా కంఠతా వచ్చేటట్లుగా, నిద్రలో లేపి అడిగినా చెప్పేటట్లుగా దానిని బాగా వల్లె వేస్తారు. అదేమిటి?

పంచకోశ విలక్షణః

గుణత్రయాతీతః

అవస్థాత్రయ సాక్షి

దేహత్రయ వ్యతిరిక్తః

శరీర త్రయ విలక్షణం

ఈ రకంగా ఆ ఆత్మ లక్షణాలను ప్రతీ ఒక్కరూ వల్లె వేయవచ్చు. కానీ, ఆ వల్లె వేసినంత మాత్రమున, అవి అనుభూతికి రావు. ఎందువలన అంటే, అత్యంత ముఖ్యమైనటువంటిది చిత్తశుద్ధి.

చిత్తములో త్రిగుణ మాలిన్యము ఉన్నంతవరకు కూడా ఈ ఆత్మవిషయం గురించి, విచారణ చేసినప్పటికి, ఆత్మానుభూతిని పొందజాలరు. కేవలము విచారణ చేసినంత మాత్రముననే ఆత్మను పొందుటకు సాధ్యము కాదు. ఎందువలన అనగా, ఆంతరిక పరిణామము చాలా ముఖ్యమైనటువంటిది. మనకు భగవంతుడు ఇచ్చినటువంటి కర్మేంద్రియ, జ్ఞానేంద్రియ, అంతరేంద్రియ సంఘాతము విషయ ఇంద్రియములందు ప్రవర్తిస్తూ ఉంటుంది.

అలా ప్రవర్తించినటువంటి దానిని వెనకకు మరలించ గలిగినటువంటి శక్తి, మానవుడు మొదట సంపాదించాలి. ఇంద్రియ జయాన్ని సంపాదించాలి. కామ్య కర్మల యందున్న ఆసక్తిని త్యజించాలి. నిష్కామ కర్మలయందు రతుడై ఉండాలి. ముఖ్యముగా నిషిద్ధ కర్మ త్యాగము చేయాలి. అంటే, అర్థమేమిటంటే, కొన్ని కర్మలను వేదం నిషేధించింది. మానవులు ఎప్పుడూ ఆచరించకూడదు. ఏమిటవి అంటే సప్తవ్యసనాలు.

ఆ సప్తవ్యసనాలను మానవుడు ఎప్పుడూ కూడా ఆచరించరాదు. అలాగే, షడూర్ములకు లొంగరాదు. అలాగే షడ్వికారములను జయించడానికి కావల్సినటువంటి సాధన చతుష్టయ సంపత్తిని సంపాదించాలి. - విద్యా సాగర్ స్వామి

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹



Facebook, WhatsApp, Telegram groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


21 Oct 2020

No comments:

Post a Comment