గీతోపనిషత్తు - 61



🌹. గీతోపనిషత్తు - 61 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍀 22. ఇంద్రియ సృష్టి - ద్వంద్వములు - సర్వ విషయముల యందు మితి ఒక మార్గము. మితి తప్పినచో గతి తప్పును. ద్వంద్వములే మానవునకు శత్రువులని దైవము హెచ్చరించు చున్నాడు. వాని కింద్రియములు ముఖద్వారములని తెలుపుచున్నాడు. 🍀


34. ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ |

తయోర్న వశమాగచ్ఛేత్తౌ హ్యస్య పరిపంథినౌ || 34 ||


సృష్టి నిర్మాణమున ఇంద్రియసృష్టి ఒక ప్రధాన ఘట్టము. ఇంద్రియములే లేనిచో మానవుడు బహిఃప్రపంచముతో ప్రతి స్పందించలేడు. ఇంద్రియముల ద్వారానే రుచి, స్పర్శ, వాసన, చూపు, వినికిడి అనుభవించు చున్నాడు. దేహ పోషణకు, దేహ రక్షణకు తగుమాత్రము దేహానుభూతికి ఇంద్రియము లవసరము.

ఇంద్రియములే లేనిచో మానవుడు తన శరీరమును తానుగ పోషించుకొనలేడు. రక్షించుకొనలేడు. దశేంద్రియములు ప్రచేతస ప్రజ్ఞలు. అవి రుద్రుని ఆజ్ఞగా ఇంద్రియము లందు పని చేయుచున్నవి. ఈ ప్రజ్ఞలు దివ్యములు.

సృష్టియందు ఇంద్రియార్థములున్నవి. మానవుని యందు ఇంద్రియములున్నవి. ఇంద్రియార్థముల ద్వారా దేహ పరిపోషణ, తదనుభూతి కావించు కొనవచ్చును. రుచిలేనిచో మానవుడు భుజించునా? భుజించి దేహమును పోషించుట కర్తవ్యము.

అందులకు రుచి సంధానకర్త. భుజించుటకు రుచి కాని, రుచి కొరకు భోజనము కాదు. హితమును మితముగ భుజింపుమని ఆదేశము. మితి మీరినచో హితవస్తువు విషమగును.

ఇట్లే యితర ఇంద్రియముల విషయమున కూడను మితిమీరి నపుడెల్ల తీపి అనుభవము చేదుగ మారును. ఆహారము వలన పుష్టివంతమైన శరీరమును ఏర్పరచు కొనవచ్చును. ఆహారము వలన అనారోగ్యమును కూడ పొందవచ్చును. ఇట్లు మితిమీరి నపుడెల్ల ద్వంద్వానుభూతి కలుగును. ద్వంద్వములయందు చిక్కినచో బంధములు కలుగును. బంధములు దుఃఖములను కలిగించును.

సర్వ విషయముల యందు మితి ఒక మార్గము. మితి తప్పినచో గతి తప్పును. ద్వంద్వములే మానవునకు శత్రువులని దైవము హెచ్చరించు చున్నాడు. వాని కింద్రియములు ముఖద్వారములని తెలుపుచున్నాడు. (3-34)

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


27 Oct 2020


No comments:

Post a Comment